“సావుకు పోయొచ్చిన” …. ఈ మాట తెలంగాణ పల్లెల్లో అంత్యక్రియలకు వెళ్లొచ్చిన వాళ్ళు వాడే మాట. చావు ఏకైక సత్యం అంటుంది మన వాంగ్మయం. ఇంకా అనేక సత్యాలు ఉండవచ్చు, కానీ భౌతికంగా మరణం అనేది పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో రోజు ఎదుర్కోవలసిన సత్యం.
వారానికి ఒక సినిమా చూసిన రోజుల నుండి సినిమా థియేటర్ కు పోక ఎనిమిది నెలలు అవుతున్నా, ఏ సినిమా మీద మనసు పోక, టీవీల్లో కూడా ఏ సినిమాలు చూడకుండా ఉన్న నాకు, మిత్రుడు రవి కుమార్ గారు ఫోన్ చేసి నిన్న బలగం సినిమా చూసాను, గొప్పగా వుంది. ఆదివారం సినిమా చూసి మళ్ళీ మాట్లాడు అని ఆల్మోస్ట్ ఆదేశించాడు.
జబర్దస్త్ వేణు అంటే ఘాటైన హాస్యం (?!) ఉంటుందేమో అనే భయం. అయినా రెండు పాటలు యూట్యూబ్లో చూడ్డం, కాసర్ల శ్యామ్, భీమ్, మంగ్లీ లాంటి టెక్నీషియన్స్, ప్రియదర్శి వంటి సహజ నటులు థియేటర్ వరకు ధైర్యంగా కాళ్ళను నడిపించాయి.
Ads
ఇంట్లో మరణంతో తీవ్ర విషాదానికి లోనైన ఒక వ్యక్తికి ఒక సాధువు చెప్పిన మాట, ఎవరింట్లో ఇప్పటివరకు ఒక్కరు కూడా చావలేదో వాళ్ళింట్లో బియ్యం పట్టుకు రమ్మంటాడు. తీవ్ర దుఃఖంలో ఉన్న వ్యక్తి ఊళ్లోని అన్ని ఇళ్లూ తిరుగుతాడు, ప్రతి ఇంట్లో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు చనిపోయారని తెలుసుకొని వాళ్ళందరూ ఆ విషాదం నుండి బయటపడి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారన్న జ్ఞానాన్ని పొంది ఉపశమనం పొందినట్లుగా మనకు ఆ కథ చెబుతుంది.
పెళ్ళిళ్ళు ఇతర శుభ కార్యాలు ఒకే రకంగా కనిపించవచ్చు, కానీ చావులు దేనికదే ప్రత్యేకం. బలగం సినిమాలో చనిపోయిన పెద్దాయన వయసులో పెద్దోడే కానీ ఊళ్లోనీ అందర్నీ తన మాటలు చేష్టలతో తమాషాలు చేసే కుర్రోడు. పెళ్లి చేసుకుని వచ్చే కట్నంతో అప్పుల బాధనుండి బయటపడాలని మనుమడు ఆరాటపడుతుంటే ముసలాయన చావు పెళ్లిని చెడగొడుతుంది.
ఇద్దరు కొడుకులు కోడళ్ళు, ఒక బిడ్డ అల్లుడు, మనమడు, మనుమరాల్లు, చెల్లే, తమ్ముడు ఇదే ఆ సినిమాలో ఆ పెద్దాయన దగ్గరి బలగం, మిగతా ఊరంతా కూడా. చావు దగ్గర ఎవరికీ పెద్ద బాధ ఉన్నట్టు కనపడదు. ఊళ్ళల్లో ఉండే dramatic గా శోకాలు పెట్టేవాళ్ళు, పుల్లలు వేసేవాళ్లు, చావులోనూ పండుగలాగా భోజనాలు, పార్టీలు ఎంజాయ్ చేసేవాళ్ళు అతి సామాన్య మనుషుల్లా కనిపిస్తారు.
కానీ సినిమా ముందుకు పోతుంటే, తెలంగాణ పల్లె మనుషుల జీవితాలు, భావోద్వేగాలు, అనురాగాలు, మాట పట్టింపులు, ప్రేమలు అన్నీ పతాక స్థాయికి చేరుతాయి. పిండాలను కాకి ముట్టక పోవడం చుట్టూ కథ తిరిగి చివరికి కుటుంబం మొత్తం ఒక్కటయ్యాక కాకి ముట్టడంతో కథకు స్వస్తి.
చివరి 15 నిమిషాలు ప్రేక్షకుడు కన్నీరు పెట్టుకోకపోతే, అది సినిమా తప్పుకాదు, ఆ మనిషి బండ రాయయ్యాడని భావించాలి. Catharsis అనే మాట ఈ సినిమాకు అతికినట్టు సరిపోతుంది. గుండెలో ఏ మూలలోనో ఆర్ద్రత ఉన్న దాన్ని తట్టిలేపి కళ్ళకు చెమ్మ చేర్చడం కొంత మందిలో లావాలా కన్నీరు తన్నుకురావడం ఒక సామూహిక ప్రతిస్పందన. బిడ్డకు తండ్రి మీదున్న ప్రేమకు సినిమాలో దర్శకుడు conscious గా అగ్రతాంబూలం ఇచ్చాడు.
మిగతా బంధాలన్నీ అరిషడ్వర్గాల మాయలో చనిపోయిన పెద్దాయనపై ప్రేమను చూపడంలో ఒకే స్థాయిని చూపకపోయిన, బిడ్డ మాత్రం మొదటి ఫ్రేమ్ నుండి చివరి వరకు అమృతతుల్యమైన ప్రేమను పంచుతుంది. వేణు దర్శక ప్రతిభకు బిడ్డ పాత్ర చిత్రీకరణ అద్దంపడుతుంది. సినిమా అయ్యాక నా ముందు వరుసలో కూర్చున్న ఒక్క 50-55 సంవత్సరాల మహిళ పెద్దగా ఏడ్వడం, చుట్టూ ఉన్న ప్రేక్షకులు ఆమెను ఓదార్చడం ఈ సినిమాకు ప్రేక్షకులు ఇచ్చిన ఆస్కార్ అవార్డ్. సినిమాలో ఎక్కడా అనవసరపు డ్రామా లేదు, నటన లేదు, జీవించారు, పాటలు సినిమాకు ప్రాణం, నేపథ్య సంగీతం బాగుంది.
వేణూ, Kudos.
Continue this wonderful journey.
- శ్రీనివాసులు వేముల
Share this Article