మీకు నిద్రలేమి జబ్బుందా..? అదేనండీ, సరిగ్గా నిద్రపట్టకపోవడం..! ఏ మందులూ పనిచేయడం లేదా..? ఓ పనిచేయండి… అమిష్ అనబడే ఓ పాపులర్ రచయిత రచించిన లంకా యుద్ధం (War of Lanka) పుస్తకం తెప్పించుకొండి… డిజిటల్ కాపీ కాదు, వీలయితే పుస్తకమే తెప్పించుకొండి… నాలుగైదు పేజీలు చదువుతుండగానే మీకు నిద్ర రావడం ఖాయం… కాకపోతే దీనికి సైడ్ ఎఫెక్ట్ ఒకటుంది… సదరు రచయిత కనిపిస్తే కసితీరా పొడవాలని అనిపించి, కాస్త చికాకు కలుగుతుంది… (ఈ పుస్తకం పూర్తి చేయడానికి నెల రోజులు పట్టింది నా వంటి సీరియస్ రీడర్‌కు కూడా…)
ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నవలిస్టు… దాదాపు 15, 16 భాషల్లోకి అనువదింపబడే నవలారచయిత అమిష్… ఇప్పటివరకు దాదాపు కోటి పుస్తకాల దాకా అమ్ముడైఉంటాయి… ఏ రచయితా కలలో కూడా ఎక్స్‌పెక్ట్ చేయనంత… ఒక్క ముక్కలో చెప్పాలంటే అది ఇండియాలో అవతార్-2 రేంజ్… మొదట్లో శివపురాణం రాశాడు, మూడు భాగాలు… అది చాలామందికి తెలియదు కాబట్టి, ఏదో కొత్తగా చెబుతున్నాడు, సరళమైన భాషలో కథ చెబుతున్నాడు అనుకుని అందరూ చదివారు…
అదే ఊపులో రామాయణం సీరీస్ మొదలుపెట్టాడు… రాముడి కథ, సీత కథ, రావణుడి కథ అంటూ మూడు కోణాల్లో కథను చెప్పడం కొనసాగించాడు… సర్లే, ఏదో చెబుతున్నాడు అనుకున్నారు… అయితే జరుగుతున్న తప్పు ఏమిటీ అంటే..? ఎప్పుడూ స్టోరీ రీటెల్లర్ ఒరిజినల్ కథకు ఎన్ని బాష్యాలైనా చెప్పుకోనీ, ఎలాగైనా కథను చెప్పనీ… కానీ ఒరిజినల్ కథ మూలస్వరూపాన్ని చెడగొట్టవద్దు… అంటే చెట్ల చాటు నుంచి రాముడు వాలిని చంపాడు అంటే, ఆ చంపడాన్ని అలాగే ఉంచాలి… కాకపోతే అలా ఎందుకు చంపాల్సి వచ్చిందో, బహుశా ఎలా చంపి ఉంటాడో నీ ఊహ నువ్వు రాయి… అంతే…
Ads
అంతేగానీ వాలిని రాముడు బండరాయితో మోది చంపాడు, వెనుక నుంచి కత్తితో కసుక్కున పొడిచాడు వంటి వక్రవివరణలకు పోవద్దు… అందుకే అమిష్ అనబడే ఈ చేయితిరిగిన, బుర్రతిరుగుడు రచయిత ఫేమస్ రచయిత భైరప్ప రాసిన పర్వ నవల చదవాలి ఓసారి… ఎందుకంటే, తను భారతం రాస్తాడట… ఎన్ని భాగాలుగా, ఇంకెంత వంకరగా రాస్తాడో అనేదే మన భయం ఇప్పుడు…
స్టోరీ రీటెల్లింగులో భైరప్పను మించినోడు లేడు… కుంతి, మాద్రి దేవతల వల్ల పాండవులను కన్నారు అనే మూలస్వరూప కథను మార్చకుండానే… అప్పటి సంప్రదాయాలు, ఆనవాయితీలు ఏమిటో, వారసత్వాల కోసం నియోగ పద్ధతిని ఎలా అనుమతించేవారో చెబుతూ… అప్పట్లో బహుశా ఇలా జరిగి ఉండవచ్చు అని మనల్ని కన్విన్స్ చేస్తాడు… కానీ ఈ అమిష్ దానికి పూర్తి భిన్నం… నాసిరకం…
తన ట్రేడ్ మార్క్ అయిన సరళమైన భాష ఈ నాలుగో భాగంలో గల్లంతైంది… అత్యంత గందరగోళంగా రచనశైలి… (తను రాశాడా, ఔట్ సోర్సింగుకు ఇచ్చాడా..?) ఉదాహరణలు కావాలా..? రావణుడి మీద యుద్ధానికి రాముడితోపాటు కేవలం వానరసేన మాత్రమే కాదు, భరతశతృఘ్నులు కూడా అయోధ్య సైన్యాన్ని సమీకరించి రావణుడితో యుద్ధం కోసం తరలివస్తారు… రామసేతు కూడా వానరముఖ్యుడు నలుడు కాదు కట్టింది, శతృఘ్నడు…
సీతను అశోకవాటికలో ఉంచాక… ఆమె తను ప్రేమించిన వేదవతి బిడ్డ అని చెబుతాడు రావణుడు… తను, కుంభకర్ణుడు తరచూ వెళ్లి ఆమెతోపాటు భోజనాలు చేస్తారు, ధర్మసూక్ష్మాల మథనం జరుపుతారు… లక్ష్మణుడు మూర్చబోతే హనుమంతుడు పరుగున వెళ్లి మూలికలు తీసుకురాడు… అప్పటికే రామసైన్యం స్వాధీనం చేసుకున్న పుష్పకవిమానంలో వెళ్లి పట్టుకొస్తాడు… కుంభకర్ణుడు ఏనుగు వల్ల మరణిస్తాడు… ఇంద్రజిత్తును భరతుడు చంపేస్తాడు… రాముడు, రావణుడు చివరలో ద్వంద్వ యుద్ధం చేస్తారు… అదీ కత్తులతో… ఆ యుద్ధంలో రాముడు రావణుడిని హతమారుస్తాడు… వివాదం ఎందుకులే అనుకుని సీత అగ్నిపరీక్షను కూడా అవాయిడ్ చేశాడు రచయిత…
ఇలా రామాయణం మూలకథే సమూలంగా మార్చేశాడు అమిష్… దరిద్రం… పైగా పలుచోట్ల షూట్, ఆన్ పేపర్ వంటి పదాలు పళ్ల కింద రాళ్లలా నొప్పి కలిగిస్తాయి… రామాయణ కాలానికి పుట్టని మత ప్రబోధకుల పేర్లు కూడా రాసేశాడు అమిష్… తన ఇష్టం… నేనేం రాసినా పాఠకులు చదివి చప్పట్లు కొడుతున్నారు కదానే ఒక అజ్ఙానం ఈ రామాయణ నాలుగో భాగంలో అక్షరమక్షరంలోనూ కనిపించింది… అందుకే చెప్పేది ఈ నవల కేవలం నిద్రలేమి పాఠకులకు మాత్రమే…!! అమిష్ భాయ్… నీ కోట్ల మంది పాఠకుల మానసికారోగ్యం కోసం దయచేసి నువ్వు భారతం సీరిస్ రాయకు ప్లీజ్…!!
Share this Article