మూడు రోజులుగా ఈ వార్తను ఫాలో అవుతుంటే… ఈరోజు వార్తల్లోని చివరి వాక్యం ఇంట్రస్టింగుగా ఉంది కనెక్ట్ అయిపోయింది… ఆ వాక్యం ‘‘ఈ పెళ్లి కోసం చుట్టుపక్కల నుంచి గిరిజనం విశేషంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు..’’ ముందుగా ఈ వార్త ఏమిటో సంక్షిప్తంగా… భద్రాచలం ఏరియాలో చర్ల మండలం, ఎర్రబోరు గ్రామం…
సత్తిబాబు (ఎస్టీ) ఇంటర్ చదువుతున్నప్పుడు స్వప్న అనే అమ్మాయిని ప్రేమించాడు… ఆ ప్రాంత గిరిజన సంప్రదాయంలో అమ్మాయిని పెళ్లికి ముందే ఉంచేసుకోవచ్చు… సారీ, తెచ్చేసుకుని సంసారం చేయవచ్చు… ఆధునిక భాషలో సహజీవనం… మన సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా… యుక్తవయస్సుల వారి శృంగారం చట్టబద్ధమే అని..! సో, చట్టప్రకారం తప్పు కాదు, వాళ్ల సంప్రదాయం ప్రకారం అసలే తప్పు కాదు…
ఆమెకు ఓ పాప పుట్టింది… మనవాడి ప్రేమ సునీత అనే అమ్మాయి వైపు మళ్లింది… వరుసకు మరదలే… సహజీవనం స్టార్ట్… ఆమెకు ఓ బాబు పుట్టాడు… ఆమె పెళ్లి కోసం పట్టుపట్టింది… మనవాడి మనస్సు తెలుసు కదా… తను కూడా సరే అన్నాడు… ఇది తెలిసి పాత పార్టనర్ స్వప్న నా మాటేమిటని పంచాయితీ పెట్టింది… ఆ ప్రాంత గిరిజన సంప్రదాయం మేరకు మొదట సహజీవనం చేసినా, పెద్దలను మెప్పించి తరువాత పెళ్లి చేసుకోవడం పరిపాటే…
Ads
సరే, కులపెద్దలు ఇద్దరినీ చేసుకొమ్మన్నారు… రెండువైపులా… కాదు, మూడు వైపులా పెద్దలు ఒప్పుకున్నారు… శుభలేఖలు కొట్టించారు… అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది… ఒకే సమయానికి ఒకే వరుడు ఇద్దరు వధువులకు పుస్తెలు కట్టే ముహూర్తం విశేషమే కదా… ఇదీ ఆ శుభలేఖ…
చర్చ మొదలైంది… హిందూ సమాజంలో బహుభార్యత్వాన్ని చట్టం ఒప్పుకోదు కదా… మరి ఈ పెళ్లి చట్టబద్దమా కాదా..? కానీ హిందూ సమాజంలోనే అనేక తెగలుంటయ్… వేర్వేరు సంప్రదాయాలుంటయ్… ఇక్కడ ఈ గిరిజనుల సంప్రదాయంలో అది పెద్ద తప్పేమీ కాదు… ఇద్దరు భార్యల్లో ఎవరైనా కంప్లయింట్ చేస్తే తప్ప అది చట్టం పరిధిలోకి రాదని మరో వివరణ వినిపించింది… పోలీసులు కూడా పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు… కేసు, మన్నూమశానం అనలేదు…
బాగా చర్చనీయాంశం కావడంతో ముహూర్తానికి కాస్త ముందే, రాత్రిపూట పెళ్లి చేసేసుకున్నాడు సత్తిబాబు… ఇద్దరు మెడల్లో పుస్తెలు కట్టేశాడు… శుభం… పైన కనిపించేది ఆ ఫోటోయే… ఈ మొత్తం వ్యవహారంలో ఆసక్తికరంగా అనిపించింది… పిలిచినా పిలవకపోయినా అనేకమంది గిరిజనులు వచ్చి ఆశీర్వదించడం… చట్టం ఏమంటుందో వాళ్లకు అనవసరం… సత్తిబాబు చేసింది రైటేనని ఆ సమూహం తేల్చేసింది… ఆ ఆమోదమే విశేషం…
పాలిగామీ… బహుభార్యత్వం… ముస్లింలలో ఆమోదనీయమే… క్రిస్టియన్లలో ఏమిటో తెలియదు గానీ… హిందూ చట్టాల ప్రకారం కుదరదు… ఏళ్లుగా ఒక తెగ పాటించే సంప్రదాయం విలువైందా..? చట్టం విలువైందా..? ఒక ధర్మ మీమాంస… చట్టాలే ఒక సమాజపు సంప్రదాయాల మేరకు లేకపోతే ఆ చట్టాలకే విలువ లేదనాలేమో… ఆ కులాల పెద్దలు, ఆ కుటుంబాల పెద్దలు, ఆ వధువులు, ఆ ప్రాంత గిరిజన సమాజం అంగీకరించింది… ఆశీర్వదించింది… ఇక్కడ చట్టానికి ఉన్న విలువెంత..? సరే, ఈ చర్చలు ఇలా నడుస్తూనే ఉంటాయి గానీ… సత్తిబాబూ, హేపీ మ్యారీడ్ లైఫ్ విత్ టూ వైవ్స్… అన్నట్టు… ఇక చాలు…!
Share this Article