‘‘నేను అరువు తెచ్చుకున్న కలలో బతుకుతుంటాను… ఢిల్లీలోని ఓ పంజాబీ మధ్యతరగతి కుటుంబం మాది… బయట ప్రపంచానికి మాది అందమైన, ఆనందమైన కుటుంబం… కానీ మూసిన మా ఇంటి తలుపుల వెనుక ఏముందో ఎవరికీ తెలియదు… ఓ పెద్ద ఇంట్లో మా కుటుంబానికి ఉన్నది ఒక గది… కారణం సింపుల్… ప్రాపర్టీ మీద అన్నదమ్ముల తగాదాలు…
మా అమ్మ మాటల్ని అణిచేశారు… తిట్టారు దారుణంగా… తలుచుకుంటే ఇప్పటికీ ఏడుపొస్తుంది… ఒక దశలో ఆమెను సజీవంగా కాల్చేయడానికి సిద్ధపడ్డారు దుర్మార్గులు… నాన్న పోలీసులను పిలిచాడు… వాళ్లు పారిపోయారు… పోలీసులు సకాలంలో రాకపోతే ఏమయ్యేదో…
తరువాత మా జీవితాన్ని మేం కొత్తగా నిర్మించుకున్నాం… మా అమ్మకు ఓ కల… కనీసం మూడు బెడ్రూంల ఇల్లు కావాలి… అదీ గ్రౌండ్ ఫ్లోర్… మూడు మెట్లతో ఇంట్లోకి వెళ్లేలా ఉండాలి… అంత స్పెసిఫిక్ కల… అప్పుడే అనుకున్నాను నేను బలంగా… అలాంటి ఇల్లే ఒకటి అమ్మకు కొనివ్వాలి… నాకు 16 ఏళ్ల వయస్సు వచ్చింది… స్కూల్ వర్క్ చూసుకుంటూనే వీథుల్లో తిరుగుతూ వెన్న, జున్ను అమ్మేదాన్ని… ఓ అనౌన్సర్, ఓ డీజే, ఓ యాంకర్… డబ్బుల సంపాదనకు ఏదైనా చేసేదాన్ని…
Ads
సినిమాల్లో పనిచేయడానికి ముంబై వచ్చాను… సంపాదించిన ప్రతి పైసా పేరెంట్స్‌కే ఇచ్చేదాన్ని… వాళ్లకు ఓ కల ఉంది కదా… ముందు ఆ కల తీరాలి… మెల్లిగా మేం పొదుపు చేసిన సొమ్మంతా కలిపి, లెక్కేసి, ఓ ఇల్లు బుక్ చేశాం… ఇక ఇంట్లోకి వెళ్లాలి అనుకునేంతగా మొత్తం సిద్ధం… కానీ నా దురదృష్టం… ఆరు నెలల వ్యవధిలో అమ్మను, నాన్నను కోల్పోయాను… అమ్మకు గొంతు కేన్సర్, నాన్న కిడ్నీల ఫెయిల్యూర్… నా గుండె పగిలింది…
నాకు ఓ మార్పు కావాలి… నా బ్యాగ్స్ సర్దుకున్నాను… బొంబాయికి షిఫ్టయ్యాను… నా శక్తిసామర్థ్యాలన్నీ సినిమాల్లో పెట్టడం స్టార్ట్ చేశాను… దర్శకురాలు అవ్వాలనే కలలు పెరగసాగాయి… రోజుకు గరిష్టంగా 4 గంటలు నిద్రపోయేదాన్ని… ప్రతి సినిమా ఓ చాలెంజ్… క్రౌడ్ ఫండింగ్, ఇంటర్నేషనల్ సేల్స్ గట్రా… కానీ నాకు నచ్చేది ప్రతి చాలెంజ్…
మంచి పనిచేశావమ్మా అని అమ్మ మెచ్చుకుంటే చూడాలని ఉండేది… నిన్ను చూస్తే గర్వంగా ఉంది తల్లీ అని నాన్న నా భుజం తడితే పొంగిపోవాలనీ ఉండేది… నాన్న నన్ను అమెరిరాకు నా ఫస్ట్ ట్రిప్ పంపించడానికి తన బంగారు కడియం అమ్మేయడం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది… నేను ప్రపంచమంతా చూడాలనేది ఆయన కోరిక… అదెంత ఖర్చు వ్యవహారమో వాళ్లకూ తెలుసు… కానీ ఓ ప్రయత్నం…
ఆస్కార్ మెట్ల మీద నిలుచుకున్నప్పుడు… ఇంకా ఆనందక్షణాల్లో… గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ లేదా ది లంచ్ బాక్సు వంటి తీసినప్పుడు… లేదా నేను సొంతంగా నా ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు… మా అమ్మా నాన్నా నా పక్కనే ఉండి ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తూ ఉంటుంది… కానీ నాకు తెలుసు, వాళ్లు ఎప్పుడూ తిరిగిరాని ఓ ప్రశాంతతలోకి వెళ్లిపోయారని… ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ వాళ్లను చూస్తాను… నాకు వాళ్ల నుంచి రావల్సిన ప్రశంసలు అలాగే ఉంటాయనీ, నాకు దక్కుతాయనీ తెలుసు… ప్రస్తుతానికి నా జీవితంలో నేను చాలా బిజీ… వాళ్లతో షేర్ చేసుకోవడానికి ఆనందమైన క్షణాల్ని పోగేసుకోవడంలో బిజీ… నేను కలల్ని అరువు తెచ్చుకోవడం ఆగిపోయిన రోజు వాళ్లు మరింత ఆనందపడతారు… ప్రస్తుతానికి నా జీవితం నాదే… నేను నా సొంతం… బహుశా అందులోనే కలలు నిజం చేసుకుంటానేమో…!!
(ఈమె పేరు గునీత్ మోంగా… మన దేశంలో చాలామందికి తెలియదు… ఈమె రెండు ఆస్కార్ అవార్డులు పొందింది… ఈ మహిళా నిర్మాతకు “పీరియడ్ : ఎండ్ అఫ్ సెంటెన్స్” అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్‌కి 2019లో మొదటిసారి ఈ అవార్డు దక్కింది… ఈ ఏడాది రెండోసారి “ది ఎలిఫెంట్ విస్పరర్స్” డాక్యుమెంటరీకి ఆస్కార్ పురస్కారం లభించింది… ఈ స్వగతం ఆమె స్వయంగా హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్ బుక్ పేజీలో రాసుకుంది…)
Share this Article