వెలుగు పత్రిక, వీ6 చానెల్ పై బీఆర్ఎస్ బ్యాన్ పెట్టింది… జరగాల్సినంత చర్చ జరగడం లేదు… ఎవరో కొందరు జర్నలిస్టులు ఆందోళన వెలిబుచ్చారు… పత్రిక స్వేచ్ఛ, భావప్రకటన అనే పదాలు చాలా విస్తృతమైనవి… బీఆర్ఎస్ అనే పార్టీ ఓ చిన్న దినపత్రిక, ఓ పాపులర్ చానెల్‌పై నిషేధం పెడితే ఆ రెండు పదాల చట్రంలో ఒకటీరెండు జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తీకరించడం విశేషమే… ఎందుకంటే… అది ఆ మీడియా హౌజు సమస్య…
అదే పోరాడాలి… సాక్షిని మూసేయించాలని చంద్రబాబు ప్రయత్నించినప్పుడు సాక్షి ఉద్యోగులు మాత్రమే రోడ్డెక్కారు… మిగతా జర్నలిస్టులు కిక్కుమనలేదు… సేమ్, ఈనాడు ఆర్థికమూలాలను దెబ్బతీయాలని వైఎస్ ప్రయత్నించినప్పుడు మాత్రం పవిత్ర, తటస్థ జర్నలిస్టులు కూడా కొందరు ఆందోళన వ్యక్తం చేశారు… అసలు జర్నలిస్టు సంఘాలనే ఈనాడు దేకదు, తమ సంస్థలో అలాంటి ‘సంఘ’ కార్యకలాపాలనే సహించదు… కానీ దానికి సమస్య వస్తే అందరూ రావాలి… సరే, అదొక చర్చ…
మీడియా హౌజు మూతపడితే జర్నలిస్టులు రోడ్డున పడతారు కదా, అందుకని ఆందోళన వ్యక్తీకరిస్తే తప్పేమిటి..? సొసైటీలో భావప్రకటన స్వేచ్ఛను అణిచివేయడం, తొక్కేయడం కాదా అనేది మరో ప్రశ్న… ఒక మీడియా హౌజు మూతపడడానికి ఒక పార్టీ వాళ్లపై నిషేధాన్ని ప్రయోగించడమే కారణం అవుతుందా..? అదే నిజమైతే దాని పునాదులు మరీ బలహీనంగా ఉన్నట్టు లెక్క… బీఆర్ఎస్ ప్రభుత్వం దానిపై నిషేధాన్ని పెట్టలేదు… కేవలం ఆ పార్టీ మాత్రమే నిషేధాన్ని ప్రయోగించింది… దాని కారణాలు దానికున్నాయి… ఫలానా అంశంలో నువ్వు ఇలాగే నడుచుకోవాలంటూ ఓ రాజకీయ పార్టీని ఎవరమూ శాసించలేం, నిర్దేశించలేం…
Ads
కేటీయార్ చెబుతున్నాడు… అది బీజేపీ పత్రిక, మా నమస్తే తెలంగాణను, తెలంగాణ టుడేను, టీన్యూస్ చానెల్‌ను బీజేపీ బహిష్కరించింది… వెలుగు మీడియా హౌజ్ మాకు పక్కా వ్యతిరేకం… ఆ ఆఫీసులో వివేకా రెగ్యులర్‌గా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మీటింగులు పెడతాడు అని సాకులేవే చెప్పాడు… తన పత్రికాఫీసులో దాని ఓనర్ ఎవరితో మీటింగు పెట్టుకుంటే బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకించాలి..? అది ఒక కుంటిసాకు…
పైగా చంద్రబాబు మీద సాక్షిలాగా… వైసీపీ మీద ఆంధ్రజ్యోతిలాగా వెలుగు బీఆర్ఎస్ మీద అంత విశృంఖలంగా ఏమీ విరుచుకుపడదు… అది నిజానికి బీజేపికి పెద్ద బలమేమీ కాదు… పత్రిక కాపీల దృష్ట్యా, మెతకదనం దృష్ట్యా…!! పైగా బీఆర్ఎస్, ప్రభుత్వ వార్తలు కూడా కవర్ చేస్తుంది… నిజానికి నమస్తే తెలంగాణ, టీన్యూస్ కరపత్రికలు, పుత్రికలు… బీఆర్ఎస్, ప్రభుత్వ వార్తలు మినహా… బీజేపీ మీద రోజువారీ రకరకాల విషాలు కుమ్మడం తప్ప వాటికేమీ తెలియదు…
ఇప్పుడు బీజేపీకి-బీఆర్ఎస్‌కు పడటం లేదు కాబట్టి బీజేపీకి వ్యతిరేకమైంది… గతంలో యాంటీ-బీజేపీ వార్తలకూ చోెటుండేది కాదు… ప్రధాని వచ్చి తెలంగాణలో బ్రహ్మాండమైన మీటింగు పెట్టినా సరే, జనం లేరు అనే ఫోటో వేసేది తప్ప మీటింగు వార్త వేయదు అది… ప్యూర్ కరపత్రం… దాంతో పోలిస్తే వెలుగు కాస్త నయమే… అంతెందుకు ఆంధ్రజ్యోతి జగన్ వార్తలు పబ్లిష్ చేస్తుంది, సాక్షి ఎప్పుడో ఓసారి చంద్రబాబు వార్తలు కూడా వేస్తుంది… కానీ నమస్తే తెలంగాణకు, టీన్యూస్‌కు ఆమాత్రం బేసిక్ పాత్రికేయం కూడా లేదనేది నిజం… నమస్తే, టీన్యూస్‌లను బీజేపీ బహిష్కరించింది కాబట్టి మేం వెలుగును బహిష్కరించాం, చెల్లుకుచెల్లు… అందుకే దీన్ని కుంటిసాకు అనేది…
ఏం ఒరుగుతుంది..? పార్టీ, ప్రభుత్వ యాడ్స్ ఇవ్వరు… అవి ఎలాగూ ఇవ్వడం లేదు… ప్రెస్‌మీట్లకు పిలవరు, నష్టమేముంది, వార్త కవర్ చేయాలంటే ప్రెస్‌మీట్ వివరాలు చెప్పేవాళ్లే దొరకరా..? మీటింగులకు పిలవరు, నిజంగా అవసరమైతే ప్రత్యక్షప్రసారాల్లో చూసి రాసుకుంటారు, లేదంటే వార్తే అవాయిడ్ చేస్తారు… మరిక ఈ నిషేధంతో బీఆర్ఎస్ సాధించేదేముంది..? వాళ్లెలాగూ బీఆర్ఎస్ మీద విరుచుకుపడే రకం కాదు… ఇప్పుడూ అంతే… టీచానెల్ డిబేట్లకు బీఆర్ఎస్ నేతలను పోనివ్వరట..,
సో వాట్… అసలు టీవీలలో పొలిటికల్ డిబేట్లనే పెద్దగా ఎవడూ చూడరు… వాటి టీఆర్పీలు చూస్తేనే అర్థమవుతుంది… సగటు జనం ఈ డిబేట్లను అస్సలు పట్టించుకోరు… కాస్త రేటింగ్స్ వచ్చేలా డిబేట్లలో అరివీరభీకరంగా రెచ్చిపోయే సాంబశివరావు, టీవీ5మూర్తి, ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ9 రజినీకాంత్ వంటి ప్రజెంటర్లు కూడా టీన్యూస్‌లో ఎవరూ లేరు… వీ6లో అసలే లేరు… సో, దొందూ దొందే…
కనుక బీఆర్ఎస్ నిర్ణయం ఏదో పార్టీపరమైన స్పర్థ తప్ప దానికీ ఒరిగేదేమీ లేదు… కాకపోతే ఒక్క లాభం… బీఆర్ఎస్ ముఖ్యనేతలు తమను ఎవరైనా ప్రశ్నిస్తే తట్టుకోలేరు… ప్రెస్‌మీట్లలో తాము కోరుకున్న ప్రశ్నలే, తమ అనుకూల విలేకరులే వేయాలి… అప్పుడో ఇప్పుడో ఒకటీరెండు చికాకు పెట్టే ప్రశ్నలు వేసే వెలుగు విలేకరులు లేకపోతే, రాకపోతే అదీ సౌకర్యం బీఆర్ఎస్ వాళ్లకు…!! (ఐనా వెలుగు ప్రింట్ కాపీలు తగ్గించేసుకున్నారు వాళ్లే… చానెల్ కూడా వారంవారం బార్క్ రేటింగుల్లో లోపలకు వెళ్లిపోతోంది… వాటిపై ఇంకా నిషేధం అవసరమా కేటీయార్ సార్..?)
Share this Article