Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జోలా జో-లమ్మ జోలా, జేజేలా జోలా, జేజేలా జోలా… హమ్ చేయండి ఓసారి…

December 19, 2025 by M S R

.

Bharadwaja Rangavajhala……..   విశ్వనాథ్ చిత్రాల్లో లాలి పాటలు … హాయైన సంగీతాన్ని అందించడమే కాదు … ఎందుచేతో విశ్వనాథ్ గారి చిత్రాల్లో మిగిలిన దర్శకుల చిత్రాలతో పోలిస్తే జోలపాటలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం ఆయన గుర్తించారో లేదోగానీ … నిజం. అసంకల్పితంగా జరిగిపోయి ఉండవచ్చుకూడా.

ఆయన సినిమాలకు ఆయనే కథ సమకూర్చుకోవడం వల్ల కావచ్చు … ఆయన మీద చిన్నతనంలో విన్న లాలి పాటల ప్రేరణ ఉండడం వల్లనూ కావచ్చు … మనసు సేద తీరే లాలి పాటలు విశ్వనాథ్ గారి చిత్రాల్లోనే అధికంగా వినిపిస్తాయి … స్వాతిముత్యంలో వటపత్రసాయికి వరహాల లాలీ – అని రాయించిన లాలిపాట ఠక్కున గుర్తొస్తుందిగానీ … ఇంకా చాలానే ఉన్నాయని నాకనిపించింది …

Ads

నాకనిపించిన పాటలు చెప్తాను … మీకు తెల్సిన నేను చెప్పని పాటలు మీరూ చెప్పాలే …. తల్లి పాడే లాలి పాటలే కాదు .. ప్రేయసి పాడే లాలి పాటలనూ ఊహించగలగడం దర్శకుడుగా ఆయనలోని ఆర్ద్రతను తెలియచేస్తుంది. నిండు హృదయాలు చిత్రం కోసం కథానాయిక వాణిశ్రీ కథానాయకుడు ఎన్టీఆర్ కు జోలపాడే సందర్భం ఉంటుంది.

స్క్రిప్ట్ రాసుకునేప్పుడే అబద్దపు పల్లవులు రాసుకోవడం విశ్వనాథ్ కు అలవాటు. ఆ అలవాటు నుంచి వచ్చిన పల్లవి రామలాలీ మేఘశ్యామలాలీ … దీన్ని పుచ్చుకుని నారాయణరెడ్డిగారు కొనసాగి చరణాలు పూర్తి చేశారు. రామలాలి మేఘ శ్యామలాలి – (నిండు హృదయాలు) … జోలపాటల క్రేజ్ పెంచిన దర్శకుడుగా కూడా విశ్వనాథ్ గారిని చెప్పుకోవాలి …

జోలపాట అనేది కేవలం పాట కాదు …. పిల్లలైనా పెద్దలైనా …. అలసిన మనసులకు సాంత్వన కలిగించడం లాలిపాట లక్ష్యం … సాంత్వన పొందిన మనసు నెమ్మదిగా నిద్రలోకి జారుకుని సేదతీరుతుంది …. అలా శక్తి పుంజుకుంటుంది. తిరిగి జీవన సమరంలోకి మళ్లుతుంది. ఇదే జీవన చక్రం. ఈ మర్మాన్ని ఎరిగి ఉండడం చేత రకరకాల సందర్భాలకు ఆయన లాలి పాటల తరహా గీతాలను ఎంచుకుంటూ ఉంటారు.

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి – అంటూ ఆపద్బాంధవుడులో బాలు పాడిన వర్షన్ విన్నప్పుడు నాకనిపించింది. అమ్మని మర్చిపోని వాడికి అమ్మ పాడిన లాలి పాటని మర్చిపోవడం కూడా కుదరదు … అమ్మతనానికీ జోలపాటకూ ఉన్న సంబంధం అది. విశ్వనాథ్ గారిలో … ఈ రెండూ చెదరకుండా ఉండడం వల్లే కావచ్చు … ఆయన సందర్భం దొరికినప్పుడల్లా లాలి పాట పెట్టేయడానికి ప్రయత్నం చేస్తూంటారు. ఆ లాలిపాటతోనే సినిమాలు విజయతీరాలు చేరిన సందర్భాలూ ఉన్నాయి.

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు అంటూ జీవన జ్యోతిలో ఈ పాట వాటా పెద్దదే …. జుజుజుజూ …. ఏ తల్లి పాడేను జోలా ఏ తల్లి ఊపేను డోలా … ఎవరికి నీవు కావాలి ఎవరికి నీ మీద జాలి అంటూ ఓ తండ్రి కాని తండ్రి పాడే లాలిపాట వింటూ పాప ఏడుపు ఆపి నిద్రపోతుంది …. అంటరాని కులంలో పుట్టి అనాధ అయిన ఆ పాపకు లోకం తనను ఎందుకు పట్టించుకోవడంలేదో అర్ధం కాదు … ఏడ్చినా ఈ లోకం తన వైపు జాలి చూపదెందుకో పోల్చుకోలేకపోతుంది … ఆ పాప కోసం …. కులం వదిలేసి కదిలిన ఓ హృదయం అక్కున చేర్చుకుంటుంది. ఈ సందర్భానికి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారితో జోల పాట రాయించుకున్నారు విశ్వనాథ్ … ఆ సాహిత్యానికి స్వరరాజేశ్వరుడు బాణీ కట్టారు. ఘంటసాల సుశీల ప్రాణం పెట్టి పాడారు. ఏ తల్లి పాడేను జోలా – (కాలం మారింది)… ఇక్కడే ఓ విషయం చెప్పేస్తా …

తల్లి పాడే లాలి పాటకన్నా తండ్రి పాడే లాలి పాటకు కాస్త స్పందన ఎక్కువుంటుందనేది నా అనుమానం … అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా ఓసి వేలెడంత లేవు బోసి నవ్వులదానా …. ఈ మాటలు వింటుంటేనే మనసులు పులకరిస్తాయి … ఉయ్యాలలో జాబిలి కూనల్లాంటి పిల్లలు పెద్దవాళ్లని చూసి పలకరిస్తూ … ఎత్తుకోమని చేతులు చాస్తూ … కాళ్లు కొట్టుకుంటూ …. ఉంటే చూడడం ఓ మురిపెం. సరిగ్గా ఇలాంటి సందర్భాన్ని తన  నిమా కోసం కల్పన చేశారు విశ్వనాథ్. ఇక్కడా దేవులపల్లి కృష్ణశాస్త్రిగారే … ఆ సన్నివేశానికి తన కవిత్వంతో రససిద్ది కల్పించారు. చాలులే నిదురపో జాబిలికూనా …. (ఉండమ్మా బొట్టు పెడతా లో వినండి …)

బుజ్జగిస్తూ …. లాలిస్తూ పాడే పాటలు కనుకే వీటిని జోలపాటలనీ లాలిపాటలనీ అంటారు. ఈ లాలించడానికి వారి ముందు వారికి తెలియని లోకాన్ని ఆవిష్కరిస్తూ …. పాటల్లోనే ఓ కల్పన చేస్తారు కవులు… చందమామను పిలుస్తారు … అదిగదిగో చందమామ అనగానే పిల్లలు అటు వైపు చూస్తారు …. చూసి అదేదో భలే ఉందే అనుకునే లోపు …. ఆ చందమామ నీ కోసం పాలబువ్వ తెస్తుంది … హాయిగా తినేసి బజ్జో అని చెప్తాం …. నిజంగానే చందమామ తెచ్చి అమ్మకు ఇచ్చిన పాలబువ్వే తినేస్తున్నానుకుని పాపాయి హాయిగా తినేసి బజ్జుంటుంది …. చందమామనే కలగంటూ …. ఇలా ప్రపంచాన్ని చూడలేని ఓ పాప చూడాలనుకున్న వెన్నెల్లో బృందావనాన్ని చూపించి మనసుకు సాంత్వన కలిగించే సందర్భాన్ని సృష్టించడానికి ఎంత తపన ఉండాలి?

చందమామ రావే … (సిరివెన్నెల) …. అమ్మకడుపు చల్లగా … అంటూ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వడం వెనకాల ఆ బిడ్డకు జన్మనిస్తూ ఆ తల్లి అనుభవించిన బాధకు అనునయింపు కూడా ఉంటుంది. బిడ్డ కేరింతలు వింటే చాలు అప్పటి వరకూ అనుభవించిన బాధనంతా ఒక్క క్షణంలో మర్చిపోతుందా మాతృహృదయం … ఈ సందర్భాన్ని పాటలో పొదివి తన సినిమాలో వినియోగించారు విశ్వనాథ్ … ఒక్క క్షణం … (స్వరాభిషేకం) … ఈ పాట వింటే నాలాంటి దుర్మార్గుడికి కూడా ఏడుపొస్తుందంటే నమ్మండి …

ఇక రొమాన్స్ కూడా లాలి పాటలోనే నడిపించడం మామూలు ఫీట్ కాదు … నిజానికి హృద్యమైన ఆలోచన ఇది. రఘువంశ తిలకుడివై రాముడివై రమణుడివై … సీత తోనే ఉండిపోరా… గీత నువ్వే దిద్దిపోరా అంటూ కథానాయకుడ్ని ఉద్దేశించి నాయిక పాడడం నిజంగానే సొగసైన మాత్రమే కాదు సంస్కారవంతమైన ఆలోచన. వార్నీ అనుకున్నా సూత్రదారుల్లో జోలా జోలమ్మ జోలా విన్నప్పుడు …

జోలపాటలు ఎప్పుడూ తల్లులే పాడాలని నిబందన ఏదీ లేదు కదా … పిల్లలు కూడా తల్లులకు లాలి పాడవచ్చు. కలికితనమున విధుల అలసినవుగాన లాలీ శుభలాలీ అంటూ తల్లికి లాలి పాడే సందర్భాన్ని ఊహించడం ఆ దర్శకుడి అద్భుతం అయితే … అన్నమయ్యను తోడుగా తీసుకుని అంత చక్కటి సాహిత్యాన్ని అందించిన ఆ సాహితీమూర్తి దర్శనం. చిన్ననాటి నీ లాలి నన్ను నిదుర పుచ్చగా ఈనాటి నీ లాలి మేలుకొలుపు కాగా అంటూ …. అమ్మతనాన్ని పాటంతా నింపారు వేటూరి విశ్వనాథులు. పలుకు తేనెల తల్లి పవళించవమ్మ కలికితనమున – (జననీ జన్మభూమి)

స్వాతిముత్యం సినిమాలో రెండు రకాల లాలిపాటలుంటాయి. ఒకటి తల్లి పిల్లాడికి పాడే లాలి పాటైతే … మరోటి తన జీవితాన్ని ముందుకు నడిపించిన తోడు నీడ శాశ్వతనిద్రపోయిన సందర్భంలో ఆ దేవతకు పంచభూతాల లాలీ అని పాడించాలనుకోవడం …. హృదయాలను తడిమేస్తుంది … మనసులను తడిచేస్తుంది … తల్లి పిల్లవాడికి పాడే జోలపాట నారాయణరెడ్డి రాస్తే …. జీవిత సహచరి అయిన దేవతకు పాడే ఈ లాలిపాటను సీతారామశాస్త్రి రాశారు. నా దేవతకు పంచభూతాల లాలి…………. ఇలా ఇన్ని వేరియేషన్స్ లో ఇన్ని లాలి పాటలు ఉన్నాయి విశ్వనాథ్ సినిమాల్లో …. ఇంకా ఉండే ఉంటాయి .. చెప్పండి … ప్లీజ్ … ఆయన్నే అడుగుదాం అనుకున్నా… కానీ కుదిరింది కాదు… ఏం చేస్తాం….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • A Journalist’s Journey Through Two Eras of Reporting
  • ఒక డోరతీ… కొంచెం సమీక్ష.. బోలెడు సైన్సూ…
  • మన పేదరికం నిజంగా తగ్గిందా..? జబ్బలు చరుచుకుందామా..?
  • ఒక సరస్వతీ పుత్రుడు – ఒక సరస్వతీ పుత్రిక – ఓ అదర్శ కుటుంబం !!
  • పగులుతున్న పాపాల పుట్టలు – బీఆర్ఎస్ క్యాంప్ హఠాత్తుగా సైలెంట్
  • ఎఐ కొలువుల్నే కాదు, ప్రాణాలనూ తీయగలదు… బహుపరాక్…
  • ఫ్లూ వేక్సిన్ అనగానే… చిన్ననాటి మశూచి టీకాలు, పుండ్లు గుర్తొచ్చాయి…
  • మరీ ‘ఆదర్శ’ కుటుంబం కాదు గానీ… ఏదో సంసారపక్షంగా నడిపించేశారు!
  • అటు నోటి దూలతో నెగెటివిటీ – ఇటు మహర్దశ కూడా నడుస్తోంది
  • ప్రవచనకారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారూ… తమరు తప్పులో కాలేశారు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions