ఒకప్పుడు కన్నడ సినిమాలు అంటే చాలామంది తెలుగు ప్రేక్షకులకు కేవలం ఉపేంద్ర మాత్రమే తెలుసు… మిగతావాళ్లు పెద్దగా తెలియదు… అంతకుముందు ఏ, ఓం, ఉపేంద్ర వంటి సినిమాలు డిఫరెంటుగా ఉండి పర్లేదనిపించాయి… తరువాత సన్నాఫ్ సత్యమూర్తి, గని వంటి సినిమాల్లో కూడా నటించాడు… ఉపేంద్ర మనకు పరిచయం ఉన్న నటుడే… కానీ తొలిసారిగా తనను చూస్తే జాలేసింది… నవ్వు పుట్టింది…
ఇప్పుడు కన్నడ సినిమా పేరు జాతీయంగా, అంతర్జాతీయంగా మోగుతోంది… కాంతార సినిమా ఏకంగా ఐరాసలో ప్రదర్శితమైంది… 777 చార్లి, కేజీఎఫ్, కాంతార వందల కోట్లను మింట్ చేసుకున్నాయి… పాన్ ఇండియా హిట్స్… ఈ స్థితిలో విజయవంతమైన కేజీఎఫ్ సినిమాకు స్పూఫో, పేరడీయో, అనుకరణో తెలియని రీతిలో కబ్జా అనే సినిమా తీశారు…
పోనీ, ఒక్క ఉపేంద్ర కాదు, అందులో కిచ్చా సుదీప (ఇతను కూడా మనకు పరిచయమే), శివ రాజకుమార్ కూడా నటించారు… వెటరన్ హీరోయిన్ శ్రియ కూడా ఉంది… ఇంత మంది, ఇంత ఖర్చు చేశారు, ఏదో హిట్ సినిమాకు కాపీ కథ గాకుండా ఓ మంచి ఒరిజినల్ కథ రాయించుకోలేకపోయారా..? ఎస్, ఇప్పుడు రఫ్ కేరక్టర్ల హవా నడుస్తోంది… పుష్ప, కేజీఎఫ్ ఎట్సెట్రా కేరక్టర్లు హిట్ అవుతున్నాయి… పుష్పకు సాంగ్స్ సపోర్ట్ ఉంది, కేజీఎఫ్‌కు అది కూడా లేదు… ఆ కేరక్టర్‌ను జనం ఇష్టపడ్డారు… కుమ్మేసింది… కాంతార, చార్లీ పూర్తిగా డిఫరెంట్…
Ads
ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కొడుకు హీరో… 1947 నుంచి 1984 మధ్యకాలంలో నడిచే కథను కిచ్చా సుదీప కోణంలో నెరేట్ చేస్తుంటారు… అప్పట్లో ఆర్కేశ్వర్ (ఉపేంద్ర అనే పెద్ద డాన్ ఉండేవాడని, మామూలోడు కాదని చెబుతుంటాడు… అక్కడెక్కడో నార్త్ ఇండియాలో పుడతాడు… తండ్రి చనిపోవడంతో దక్షిణ భారతంలోని అమరాపురానికి చేరి, ఎయిర్‌ఫోర్స్‌లో కొలువు సాధిస్తాడు… ఓ రాజావారి బిడ్డను లవ్ చేస్తాడు… కానీ ఆ రాజావారికి ఈ ప్రేమ ఇష్టముండదు… కానీ పరిస్థితుల ప్రాబల్యంతో ఉపేంద్ర కత్తి పడతాడు… డాన్ అవుతాడు… స్థూలంగా చూస్తే పర్లేదు కథ…
పైగా స్టాల్‌వార్ట్స్ నటించారు… మస్తు ఖర్చు పెట్టారు… బహుశా కేజీఎఫ్‌లా ఇదీ కోట్లు ప్రింట్ చేసి పెడుడుతుందని అనుకుని భారీగా ఖర్చు పెట్టి ఉంటారు… కానీ తమపై కేజీఎఫ్ రాఖీ భాయ్ ప్రభావం బాగా ఉందనీ, ఒకరకంగా దాన్నే తీస్తున్నామని మరిచిపోయింది ఈ సినిమా టీం… ఐనా కేజీఎఫ్ ఇప్పటికీ ఓటీటీలో దొరుకుతూ ఉంది చూడటానికి… అలాంటప్పుడు దానికి అనుకరణ సినిమాను ఎందుకు చూస్తారు జనం… ఈ బేసిక్ లాజిక్ మరిచిపోయారు నిర్మాతలు, ఫలితంగా నవ్వుల పాలైపోయారు…
పాత కథ అయినా సరే, కాపీ కథ అయినా సరే, నోటికొచ్చిన కథయినా సరే… చెప్పడంలో తెలివి చూపించాలి… రాజమౌళి చూడండి, సీన్లకుసీన్లే ఎత్తేసిన చరిత్ర ఉంది… కానీ తనకు తెలివి ఉంది, కొత్త కథ చెబుతున్నట్టు కలరిస్తాడు… ఆస్కార్ దాకా బాటలు వేసుకుంటాడు… పైగా ఆ పేర్లు, బోలెడు పాత్రలు కథను, కథనాన్ని గందరగోళంలో పడేస్తాయి… అసలు ఈ సినిమా గురించి ఇంత చెప్పుకోవడమే వేస్ట్… ఆ హీరోల ఫ్యాన్స్ వల్ల కన్నడంలో ఏమైనా నాలుగు రోజులు నడుస్తుందేమో గానీ తెలుగు మార్కెట్‌కు అస్సలు పనికిరాని సరుకు ఇది… కేవలం నెత్తురు, భీకరమైన బీజీఎంతో సినిమాలు నడవవు మాస్టార్లూ… ఇన్నిరోజులూ కన్నడ సినిమా ఆ సరిహద్దులు దాటి బయటికి రాలేదంటే ఇప్పటిదాకా కారణం అర్థం కాలేదు… ఇదుగో పెద్ద హీరోల తెలివి కూడా ఇలా తగలడింది కాబట్టే…
అన్నింటికన్నా ఘోరం, ప్రమాదం ఏమిటంటే… దీనికి సీక్వెల్ కూడా ఉంటుందట… దేవుడా రక్షించు కన్నడ ప్రేక్షకులను… అఫ్ కోర్స్ ఫస్ట్ పార్ట్ దెబ్బకు సెకండ్ పార్ట్‌ను తెలుగు ప్రేక్షకులు ఎవడూ చూడడు… వాళ్లకేమీ ప్రమాదం లేదు… ప్రపంచ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ మధ్యలో ఆపి, మిగతాది రెండో పార్ట్‌లో చూడండి అని చెప్పే తెగువ వీళ్లు తప్ప ఇంకెవరూ చెప్పలేదనుకుంటా… కేజీఎఫ్‌కు భీకరమైన అనుకరణగా వెలువడిన సినిమాను చూడాలనుకుంటే మీ ఖర్మ… దీన్ని సూసైడల్ టెండెన్సీ అంటారు…
Share this Article