ఒక్కో దేశంలో సంస్కృతి, కట్టుబాట్లు ఒక్కో రకం… కానీ ప్రపంచం మొత్తం తల్లి అంటే తల్లే… తల్లి ప్రేమలో తేడాలుండవ్… కాకపోతే పెంపకం తీరులో కాస్త తేడా ఉండొచ్చు… అంతే… తల్లి అంటే ప్రేమ, తల్లి అంటే సహనం, తల్లి అంటే సంరక్షణ… ఇలా చెబుతూ పోతే అన్నీ… అయితే మనం వేరే దేశం వెళ్లినప్పుడు అక్కడి సమూహం కట్టుబాట్లనే గౌరవించాలి, ఆ దిశలో మనం మౌల్డ్ కావడానికి ప్రయత్నించాలి… తప్పదు… కానీ అన్ని విషయాల్లోనూ అది వర్తించదు… కాదు, పిల్లల పెంపకంలో నాకు అలవాటైన నా మూల సంస్కృతి, పద్ధతులే పాటిస్తాం అంటే అక్కడి సమాజాలు, ప్రభుత్వాలు హర్షించకపోవచ్చు… కఠినంగా వ్యవహరించవచ్చు… అలాంటి స్థితిలో తల్లి కూడా ప్రతిఘటిస్తుంది… పోరాడుతుంది… అదుగో ఆ ఘర్షణే రాణి ముఖర్జీ నటించిన సినిమా ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ కథ…
మనం ఎంతసేపూ చెత్తా ఫార్ములా కథలు, ఇమేజీ బిల్డప్పుల మురికి కథల్లోనే మునిగితేలుతున్నాం… కానీ ఇతర భాషల్లో భిన్నమైన కథాంశాలను ఎన్నుకుని, కాస్త లోతుగా చర్చించడానికి ప్రయత్నిస్తున్నారు… అలాంటి నటీనటులనే ఎంచుకుంటారు… మన చుట్టూ ఎన్ని కథలు… ఎన్ని భిన్నమైన సమస్యలు… ఐనాసరే, మంచి కథలు దొరకడం లేదంటూ మూసీ జవాబులు ఇస్తుంటారు మన సెలబ్రిటీలు… అదే అసలైన ట్రాజెడీ…
ఈ నార్వే కథకొద్దాం… రాణిముఖర్జీకి వంక పెట్టడానికి ఏముంటుంది..? ఈ ఒరిజినల్ కథలో జీవించేసింది… అసలు ఈ కథే కాస్త చిత్రమైన కథ… ఇది సాగరిక భట్టాచార్య అనే మహిళకు నార్వేలో ఎదురైన ఓ సమస్య కథ… దానిపై ఆమె పోరాడిన వైనమే ఈ కథ… power of mother… ఒక తల్లి ఒక దేశపు వ్యవస్థను కదిలించింది… కళ్లురిమింది… అదే ఈ పదేళ్లనాటి ఒరిజినల్ కథ…
Ads
అనురూప్ భట్టాచార్య… వృత్తిరీత్యా జియోఫిజిసిస్ట్… తను 2007లో సాగరికను పెళ్లి చేసుకున్నాడు… ఇద్దరూ నార్వేకు వెళ్లారు ఉపాధి వేటలో… సాగరిక తన ఫస్ట్ డెలివరీ కోసం కలకత్తాకు తిరిగి వచ్చింది… ఇండియాలో ఉన్నప్పుడే కొడుకులో ఆటిజం తరహా లక్షణాలు కనిపించసాగాయి… తల్లీకొడుకులు తిరిగి 2009లో నార్వేకు వెళ్లిపోయారు…
సాగరిక దంపతులు కొడుకు అభిజ్ఞను 2010లో కిండర్ గార్టెన్లో జాయిన్ చేశారు… ఆ సమయంలోనే సాగరికకు మళ్లీ గర్భం… అభిజ్ఞకు తన అనారోగ్య లక్షణాల తీవ్రత పెరిగింది… చిరాకు, తల నేలకేసి కొట్టుకోవడం వంటివి ఎక్కువయ్యాయి… భర్తకు పని ఒత్తిడి ఎక్కువ… సాగరికే కొడుకును, తన ఆరోగ్యాన్ని చూసుకుంటోంది…
మా దేశంలో ఉంటున్నప్పుడు మేం అమలు చేసే చైల్డ్ ప్రొటెక్షన్ సిస్టంను ఎవరైనా స్ట్రిక్టుగా అమలు చేయాల్సిందే అంటుంది నార్వే ప్రభుత్వం… పిల్లల పెంపకం తీరును గమనిస్తూ ఉంటుంది… సాగరిక తీరు అక్కడి అధికారులకు నచ్చలేదు… నవంబరు 2010లో నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్ టీం ఒకటి సాగరిక ఇంటికి వచ్చింది… అభిజ్ఞ పరిస్థితిని ఆ టీం గమనించింది… కానీ సాగరిక కడుపుతో ఉండటం వల్ల అప్పటికి ఏ యాక్షనూ తీసుకోలేదు…
ఆ తరువాత నెలలోనే సాగరిక బిడ్డకు జన్మనిచ్చింది… పేరు ఐశ్వర్య… రాను రాను అభిజ్ఞ అనారోగ్యం పెరుగుతోంది… చివరకు చెల్లెలు అమ్మపాలు తాగుతుంటే కూడా సహించలేకపోయేవాడు… ఈ సిట్యుయేషన్ కంట్రోల్ చేయడం సాగరికకు రోజురోజుకూ కష్టమవుతోంది… అభిజ్ఞను జాయిన్ చేసిన కిండర్ గార్టెన్ సాగరికకు అసంతృప్తి సంకేతాలు పంపించసాగింది…
అక్కడ మార్టే మియా అనే ఓ సిస్టం… పిల్లల పరిస్థితులను వివరించడానికి పేరెంట్స్ మీట్ వంటి భేటీ అన్నమాట… తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఉంటుంది… కానీ తమకు కేటాయించిన సామాజిక కార్యకర్త దురుసుగా ఉన్నట్టు తల్లిదండ్రులు విమర్శించారు… ‘‘ఆమె తరచూ ఇంటికి వచ్చేది… ఆమె డ్యూటీ అబ్జర్వేషన్ మాత్రమే… మనకు అనుకూలంగా టైమ్‌లో వచ్చేది… నేను పాలు ఇస్తున్నప్పుడో, వంట చేస్తున్నప్పుడో వచ్చేది… ఓచోట కూర్చుని నన్నే చూసేది… వాళ్ల భాష కూడా నాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు… అందుకని ఎప్పటికప్పుడు రిప్లయ్స్ ఇవ్వడం కూడా నాకు సాధ్యం అయ్యేది కాదు…
నాకు ఏమీ చెప్పేది కాదు… చివరకు ఒక దశలో నా పిల్లల్ని నా నుంచి దూరం చేసి, తీసుకుపోవడానికి నిర్ణయం తీసుకున్నది ఆ ప్రభుత్వ శాఖ… ఆ నిర్ణయం విని షాక్ తిన్నాను… నాకు ఆ కౌన్సిలింగ్ ఏమిటో, ఈ అబ్జర్వేషన్ ఏమిటో తెలుసు… మా కొడుకు కోసం మొదట ఇవన్నీ అంగీకరించాల్సి వచ్చింది… ఈ కౌన్సిలింగ్, హోం విజిట్స్ కాస్త వాయిదా వేయాలని కోరేదాన్ని… వాళ్లు వినిపించుకునేవారు కాదు… చివరకు నా ఆరోగ్యం బాగాలేని రోజుల్లో కూడా అబ్జర్వేషన్ విజిట్స్ ఉండేవి…
నాకు కాస్త రెస్ట్ అవసరం, బేబీకి నిద్ర అవసరం… కానీ వినిపించుకునేవాళ్లేరీ..? వాళ్లు ఏమేం రిపోర్టులు రాస్తున్నారో నాకు తెలిసేది కాదు, చెప్పేవాళ్లు కాదు… ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు… మే 11, 2011లో నేను కిండర్ గార్టెన్‌లో అబ్బాయిని దింపి ఇంటికి వచ్చేశాను… అప్పటికే సోషల్ వర్కర్, మరో ఇద్దరు మీటింగ్ అన్నారు…’’ అని వివరించింది ఓ ఇంటర్వ్యూలో సాగరిక…
వాళ్లతో సాగరికకు వాగ్వాదం జరిగింది… కిండర్ గార్టెన్ నుంచి పిల్లాడిని, సాగరిక ఇంట్లో నుంచి ఐశ్వర్యను తీసుకునిపోయారు… పేరెంట్స్‌కు షాక్… రెండురోజులు పిల్లలతో కలవనివ్వలేదు… మూడోరోజు సరే అన్నారు… సాగరిక హిస్టీరిక్‌గా ఏడుస్తోంది… అరుస్తోంది… ఇదంతా అధికారులు రికార్డ్ చేశారు… ఈ తల్లి తన పిల్లలతో సరిగ్గా వ్యవహరించడం లేదు అని చెప్పడానికి ఈ వీడియోను కూడా ఓ సాక్ష్యంగా చూపించారు తరువాత… ‘‘నా పిల్లల్ని నాకు దూరం చేస్తారా’’ అనేది సాగరిక శోకం… పట్టించుకున్నవాడు లేడు…
ఈ తల్లి కొడుక్కి సరైన మెడికల్ అటెన్షనే లేదనీ, అందుకే పిల్లాడు అటాచ్‌మెంట్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడనీ తేల్చారు… అంటే ఏమిటో వీళ్లకు అర్థం కాలేదు… ‘‘తన పిల్లలకు ఈ తల్లి చేతితో అన్నం తినిపిస్తోంది… అంటే నిర్బంధంగా తినిపించడం, పిల్లలు తల్లిదండ్రులతో కలిసి పడుకోవడం తప్పు… ఇండివిడ్యుయల్ బెడ్స్ ఉండాలి…’’ ఇదీ నార్వే అధికారుల వాదన… అంటే వాళ్లకు ఇండియన్ కల్చర్, పిల్లల పెంపకం తీరు తెలియదు… తమకు తెలిసిన సిస్టం నిర్బంధంగా రుద్దడం తప్ప…
‘‘నా పిల్లల్ని నాకివ్వండి’’ అని సాగరిక పోరాటం ఆరంభించింది… 2011 నవంబరులో లోకల్ కౌంటీ కమిటీ కూడా సాగరికకు వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చింది… లోకల్ కోర్టు పిల్లలకు 18 ఏళ్లు వచ్చేవరకు సర్కారీ పర్యవేక్షణలోనే పెరగాలని తీర్పు చెప్పింది… సాగరికకు మాటపడిపోయినంత పనైంది…
పిల్లల తల్లిదండ్రుల మొత్తుకోళ్లు ఫలించలేదు… పిల్లల్ని విడదీశారు… వాళ్లకు ఇచ్చిన వెసులుబాటు ఏమిటయ్యా అంటే సంవత్సరానికి మూడుసార్లు చెరి గంట చొప్పున మాత్రం పిల్లల్ని కలవొచ్చునట… ఫాలోఅప్ అప్పీళ్లు చెత్తబుట్టల పాలయ్యాయి… అక్కడెవరూ వినిపించుకునే దిక్కులేక ఇండియాకు వచ్చి, మన విదేశాంగ శాఖ సాయం కోరారు… విదేశాంగశాఖ జోక్యం చేసుకుని, కేసు రీఓపెన్ చేయాలంటూ నార్వే సర్కారు మీద ఒత్తిడి ప్రారంభించింది…
రోజులు గడుస్తున్నయ్… భట్టాచార్య పత్రికలతో మాట్లాడుతూ నార్వే, ఇండియాలోని కల్చరల్ డిఫరెన్సెస్ ఎత్తిచూపడం మొదలుపెట్టాడు… పిల్లలతో కలిసి ఒకే బెడ్ మీద పడుకోవడం, అన్నం చేతితో తినిపించడం కూడా నార్వే అధికారులు పిల్లల పట్ల అపచారంగా, నేరంగా చిత్రించిన తీరును ప్రచారంలోకి తీసుకొచ్చాడు బలంగానే…
సుదీర్ఘమైన న్యాయపోరాటం సాగింది… సాగరికకు, ఆమె భర్తకు నడుమ కూడా సంబంధాలు బాగా లేవని నార్వే అధికారులు మరో ప్రచారం ఆరంభించారు… ఎట్టకేలకు 2012 ఫిబ్రవరిలో స్టావెంజర్ జిల్లా కోర్టు… పిల్లల సంరక్షణ బాధ్యతను సాగరిక మామ అరుణాభాస్ భట్టాచార్యకు అప్పగించాలని, ఇండియాకు పిల్లల్ని పంపించవచ్చుననీ తీర్పు చెప్పింది… దాని మీద కూడా స్టే తీసుకురావడానికి నార్వే అధికారులు ప్రయత్నించారు… ఎట్‌లాస్ట్ పిల్లలు ఢిల్లీలో దిగారు…
మామతోపాటు పిల్లల సంరక్షణ కోసం నార్వే చైల్డ్ వెల్ఫేర్ శాఖకు చెందిన ఫోస్టర్ ఫాదర్, కేస్ వర్కర్ కూడా వచ్చారు… సాగరిక పోరాటం ఆగలేదు, అంతం కాలేదు… నార్వే అధికారులు చెప్పినట్టుగానే ఆమె పెళ్లిబంధం కూడా దెబ్బతినిపోయింది… సో, ఆమె మామకు పిల్లల సంరక్షణ బాధ్యతలు ఎలా ఇస్తానని మరో పోరాటం మొదలుపెట్టింది… ఆమె తల్లి… నా పిల్లలను నాకు అప్పగించండి అనేదే ఆమె పోరాటం… ఈసారి పోరాటం బెంగాల్‌లో…
నా పిల్లల్ని నాకే అప్పగించాలంటూ బెంగాల్, బుర్ద్వాన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి దరఖాస్తు చేసుకుంది… నా పిల్లల్ని నా మాజీ భర్త తల్లిదండ్రులు అనుమతించడం లేదని ఆమె ఆరోపణ… చాన్నాళ్ల తరువాత ఆమె మానసికంగా దృఢంగానే ఉందనీ, పిల్లల్ని ఆమెకు అప్పగించవచ్చుననీ 2012 నవంబరులో నిర్ణయం వెలువడింది… 2013 జనవరి 8న ఆమె పిల్లలు ఆమె ఒడిచేరారు.. ‘‘నా పిల్లల్ని నా ఒడిలో కూర్చోబెట్టుకుని, ముద్దుపెట్టుకుని ఎన్నో యుగాలు గడిచిన ఫీలింగ్… నేను మాటల్లో చెప్పలేను…’’ అని చెప్పింది ఆమె..
ఈ సినిమా పేరు కూడా స్ట్రెయిట్‌గా పెట్టారు… సాగరిక అని గాకుండా ఛటర్జీ వర్సెస్ నార్వే అని నేరుగా ఆ దేశం పేరు టైటిల్‌లో పెట్టారు… దీనిపట్ల ఆ దేశ రాయబారి ఎక్కడో మాట్లాడుతూ… ‘‘ఇది మా దేశ పద్ధతులను నిందిస్తున్నట్టుగా ఉంది…’’ అని అభ్యంతరం వ్యక్తం చేసింది… కానీ నిర్మాతలు భయపడకుండా, ఏం జరిగితే అది జరగనీ, కేసు నిజం, ఆమె పోరాటం నిజం, అదే చూపించాం అంటూ మొన్న థియేటర్లలో రిలీజ్ చేశారు…!!
Share this Article