ఏదో ఒకటి మాట్లాడటమే తప్ప నేనేం మాట్లాడుతున్నాను అనే సోయి ఉండదు కొందరు నాయకులకు… సారీ, చాలామంది నాయకులు అదే ధోరణి… ఏదో ఒకటి కూయాలి, విలేకర్లు కూడా కళ్లు మూసుకుని రాసేసుకుంటారు… అచ్చేస్తారు… టీవీలు చూపిస్తాయి… సోషల్ మీడియా భజన అందుకుంటుంది… రేణుకా చౌదరిని కూడా ఆ కోవలోకి చేర్చేయవచ్చు… సుదీర్ఘ రాజకీయ జీవితం ఉండి కూడా ఏదో ఒకటి మాట్లాడేయడం ఆమె స్టయిల్…
నిన్న తనది ఓ ప్రకటన… 2018వ సంవత్సరం ఫిబ్రవరి ఏడున రాజ్యసభ సమావేశాల్లో ఒక సందర్భం… పీఎం మాట్లాడుతుంటే రేణుక పదే పదే పెద్దగా నవ్వుతోంది… రాజ్యసభ ఛైర్మన్ వారించాడు… అప్పుడు మోడీ ‘‘నవ్వనివ్వండి, టీవీలో రామాయణం సీరియల్ ముగిశాక మళ్లీ శూర్పణఖ నవ్వు వినే అదృష్టం లేకుండా పోయింది’’ అని సెటైర్ వేశాడు… దాంతో అందరూ నవ్వారు…
ఇన్నేళ్ల తరువాత రేణుకకు మళ్లీ యాదికొచ్చింది… ఎందుకట అంటే… రాహుల్ గాంధీకి ఓ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది కదా… లోకసభ స్పీకర్ కార్యాలయం తక్షణం స్పందించి రాహుల్ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది… ఈ వేగంపై బీజేపీయేతర పార్టీలు, నాయకులు విమర్శలు చేస్తున్నారు… అదుగో, దానిమీదే స్పందించిన రేణుక నన్ను ఏకంగా పార్లమెంటులో అవమానించిన మోడీ మీద పరువునష్టం కేసు వేద్దామని అనుకుంటున్నాను, న్యాయవ్యవస్థ రాహుల్ గాంధీ మీద స్పందించినంత వేగంగా స్పందిస్తుందా చూద్దాం అని ఓ ప్రకటన చేసింది…
Ads
ఇక్కడ కొన్ని అంశాలు పరిశీలిద్దాం…
- న్యాయవ్యవస్థ వేగంగా స్పందించకపోతే ఆక్షేపించాలి… స్పందిస్తే తప్పేముంది..? నువ్వుందుకు స్పీడ్‌గా తీర్పు చెప్పావోయ్ అనడం విచిత్రం, హాస్యాస్పదం…
- నిజానికి ఇందులో వేగంగా స్పందించడం అంటూ ఏమీ లేదు… మధ్యలో హైకోర్టు స్టే ఇచ్చింది విచారణ మీద… ఆ స్టే వెకేట్ అయ్యాక సూరత్ కోర్టులో తిరిగి విచారణ ప్రారంభమైంది…
- న్యాయవ్యవస్థను ఒకరకంగా వెకిలి చేయడం ఇది…
- నిజంగా తప్పుపట్టాల్సి ఉంటే తక్షణం స్పందించిన స్పీకర్ ఆఫీసును తప్పుపట్టాలి… అలా తప్పుపడితే లోకసభ ఊరుకోదు, సో, ఇలా ఓ పాత మోడీ వీడియో బయటికి తీసి, నేనూ కేసు వేస్తా, శిక్ష వేస్తారా చూస్తా అంటూ రాహుల్ పట్ల వెరయిటీ విధేయతను ప్రకటించుకుంది ఈ 68 ఏళ్ల నిప్పు బ్రాండ్.
https://twitter.com/RenukaCCongress/status/1638927867018092545
కొంతకాలం కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన ఈమెకు… పార్లమెంటులో జరిగే వ్యవహారాల మీద ఏ కోర్టు కూడా జోక్యం చేసుకోదనే బేసిక్ సంగతి తెలియదేమో… పైగా అప్పుడే అభ్యంతరం చెప్పి ఉండాల్సింది… ఇన్నేళ్లకు, అంటే అయిదేళ్లకు… అరెరె, మోడీ చేసిన వ్యాఖ్య నన్ను అవమానించినట్టుగా ఇప్పుడు అర్థమైంది, నా పరువు పోయింది అని కోర్టుకెక్కినా చెల్లదేమో…
ఐనా శూర్ఫణఖ పాత్ర బాధపడాలి తప్ప ఇందులో రేణుక బాధపడటానికి ఏముంది..? శూర్ఫణఖ అందగత్తె, మనోహరంగా నవ్వుతుంది… ఆ అందం, ఆ నవ్వుతోనే రాముడిని లేదా లక్ష్మణుడిని పడేయాలని అనుకుంది… ఆమెతో గనుక పోలిస్తే అందులో పరువునష్టం ఏముంది..? పైగా శూర్పణఖ విలన్ కాదు, కమెడియన్ కాదు, బాధితురాలు… ఆమె నవ్వుతో పోలిస్తే అందులో అవమానకరం ఏముంది..? మోడీకే ఆమె మీద సరైన విసురు చేతకాలేదు…!!
Share this Article