Sankar G………. మహాభారతంలోని ఒక ఘట్టాన్ని, పాత్రల్ని తీసుకుని కొంచెం కల్పితం జోడించి తీసిన మాయాబజార్ చిత్రం ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. మహాగ్రంథాన్ని వక్రీకరించి తీస్తారా అని ఎవరూ నోరెత్తలేదు ఎందుకు? మాయాబజార్ సినిమా భారత పాత్రలను తీసుకుంది కానీ, ఆ ఘట్టాలన్నీ కల్పితాలే. మొదటగా శశిరేఖ పాత్రయే కల్పితం.
అయితే శశిరేఖ పాత్రకు బహుశ భాగవతంలో సుభద్ర పాత్ర ఆదర్శం కావచ్చు. సుభద్ర – అర్జునుడు- దుర్యోధనుడు పాత్రలను ఒక తరం క్రిందకి దించి కథ నడిపించారు. మాయాబజార్ సినిమాకు ముందే ఈ ధీమ్ చాలా ప్రచారంలో ఉండి జనాదరణ పొందినదే. తెలుగులో శశిరేఖా పరిణయం అనే పేరిట ఉన్న నాటకమే. ఉత్తర భారతంలో శశిరేఖ పేరు వత్సల… వత్సలా పరిణయం అనే నాటకం, సినిమా కూడా ఉంది.
మహాగ్రంధాన్ని వక్రీకరించడం క్రింద ఇది లెక్క లోకి రాదు. ఏ పాత్ర మూలవిరుద్ధంగా ప్రవర్తించదు. మహాభారతం అనేక కవుల, నాటక కర్తల , కల్పనాశక్తిని పెంచి పోషించిన మహాగ్రంధం. మూలవిరుద్ధంగా రాసి ఆ గ్రంధానికి ద్రోహం చేశామని వారెవరూ భావించలేదు. వాటన్నింటికీ రాజాదరణలూ , ప్రజాదరణలూ లభించాయి.
Ads
భాస మహాకవి , కాళిదాసుకు పూర్వుడు. ఆయన రచించిన ఊరుభంగం , దుర్యోధనుడి పతనం ప్రధానంగా సాగుతుంది. అతని కుమారుడు దుర్జయుడితో కలసి ధృతరాష్ట్రుడు, గాంధారీ అతడిని చూడవస్తారు. పూర్తిగా మూలవిరుద్ధం. అలాగే గురుదక్షిణ నాటకంలో అభిమన్యుడు, విరాట యుద్ధంలో దుర్యోధనుడి తరఫున యుద్ధం చేసి భీముడి చేతిలో చిక్కుపడి , ఉత్తరతో పెళ్ళి చేసుకుంటాడు. దుర్యోధనుడు ద్రోణుడికి గురుదక్షిణగా పాండవులకు వారి రాజ్యం ఇచ్చివేస్తాడు. ఎంత మూలవిరుద్ధం! ఇలాగే ఆయన మిగిలిన నాటకాలు.
కాళిదాసు విషయానికొస్తే అభిజ్ఞాన శాకుంతలంలో నాయికా నాయకులను ఉదాత్తంగా చిత్రీకరించడంలో మహాభారత వృత్తాంతాన్ని మార్చివేయడం జరిగింది. ఆ నాటకం ఆధారంగా తీసిన హిందీ , తెలుగు సినిమాలు హిట్ అయినవే. అసలు ఆ మాటకొస్తే అసలు మహాభారతమే జరగలేదనీ , ఆ కథ మొత్తం రాసినది ఆ ద్వాపరయుగం నాటి వ్యాసుడు కాదని , కలియుగంలో క్రీస్తుశకం మూడవ శతాబ్దంలో కవులు రాసి ఆయన పేరు పెట్టారనే వాదనలూ ఉన్నాయి.
రామస్వామి చౌధరి వంటి నాస్తికవాదులు వ్రాసిన శంబూకవధ వంటి నాటకాలను కూడ ఆసక్తిగా చదివారు తెలుగువారు. తెలుగువారికి మత మౌఢ్యం తక్కువ , సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. అన్ని రకాల అభిప్రాయాలను గౌరవించి , అందులోని కళను ఆస్వాదించగలం. భారత విరుద్ధంగా రచనలు చేశారని ఫత్వాలు జారీ చేసే తత్వాలు కావు మనవాళ్ళవి. తాలిబాన్ల లాగా , అటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళలాగా ఇప్పటికీ మెజారిటీ లేరు తెలుగువారు. మాయాబజార్ సినిమా నాటికి అసలే లేరు.
మాయాబజార్ అద్భుతమైన కళాఖండం. దీని గొప్పతనం గురించి ఎంతైనా చెప్పవచ్చు. విరుద్ధంగా నోరు ఎవరైనా ఎత్తారేమో తెలియదు. అయితే ఆ సినిమాకు ప్రేక్షకులు కొట్టిన చప్పట్లలో అవి మునిగివుంటాయి…
Share this Article