Sankar G………. కాలం చెల్లిన సినిమా రచయితలు… తెలుగు సినిమాకు స్వర్ణయుగం అనదగ్గ రోజుల్లో సముద్రాల, పింగళి, DV నరసరాజు, సదాశివ, బ్రహ్మం, ఆరుద్ర, ముళ్ళపూడి వెంకట రమణ, గొల్లపూడి మారుతి రావు, పాలగుమ్మి పద్మరాజు, రంగనాయకమ్మ, యద్దనపూడి, కోడూరి కౌసల్యలాంటివారు, కొవ్వలి నరసింహారావు, కొమ్మూరి సాంబశివరావు లాంటి వారి కథలు సినిమాలుగా వచ్చేవి… కథ సిద్ధం అయ్యాక పూర్తి స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసుకుని షూటింగులకు వెళ్లేవారు. దర్శకుడు కేవీ రెడ్డి స్క్రిప్ట్ రెడీ అయ్యాక కథను ఇంచు కూడా మార్చేవాడు కాదు.
ఆ తర్వాత వచ్చిన పరుచూరి, దాసరి లాంటి వారి దగ్గర అరడజనుకు తగ్గకుండా రచయితల టీమ్ ఉండేది. కథ మాటలు షరా మాములుగా దాసరి, పరుచూరి లాంటివారే వేసుకునేవారు. అరుదుగా తమ టీమ్ లో వేరేవారి పేర్లు వేసేవారు. యండమూరి, మల్లాది, కొమ్మనాపల్లి, సూర్యదేవర లాంటి నవలా రచయితలు సినిమాకు కథలు అందించేవారు. శ్రీ శ్రీ, గణేష్ పాత్రో, కాశీ విశ్వనాధ్, జంధ్యాల, సత్యానంద్, mvs హరినాధరావు లాంటి మాటల రచయితలు క్రమేపి కనుమరుగయ్యారు.
సినిమా అంటే ఇంతమంది దిగ్గజ ఉద్ధండులు పూనుకుంటే తప్ప సినిమా నిర్మాణం పూర్తి కాదు. వీసీఆర్, వీడియో క్యాసెట్ల ద్వారా మొదలైన కథాచౌర్యం టెక్నాలజీ పెరిగాక అరచేతిలో మొబైల్ లో విదేశీ సినిమాలు చూసి కథ ను కాపీ పేస్ట్ చేయటం మొదలు పెట్టారు. ఇక ఈ హైబ్రిడ్ దర్శకుల టార్గెట్ హీరోల డేట్స్ సంపాదించటం. హీరో డేట్స్ ఇస్తే తనేం తీస్తే అదే సినిమా ఇంక ఒరిజినాలిటీ ఎక్కడ ఏడుస్తుంది…
Ads
కాలక్రమంలో రచయిత అన్నవాడు మాయం అయిపోయి టీమ్ లు తయారు అయ్యాయి. ఇంటర్ కూడా చదవని దర్శకులు కథ, మాటలు, స్క్రీన్ ప్లే దర్శకత్వంకు తమ పేరే వేసుకుంటున్నారు. గొప్ప చదువులు చదివిన ఆనాటి దర్శకులకు ఈ తెలివి తేటలు లేవు. నలుగురైదుగురు కలిసి తయారు చేసిన కథను కొన్ని నిర్మాణ సంస్థలు కథ ఫలానా చిత్రయూనిట్ అని వేసుకునేవారు.
ఇప్పుడు రచయిత అంటూ ఎవడూ లేడు. కాపీ పేస్ట్ రచయితలు వచ్చేశారు. ఫలానా హాలీవుడ్, కొరియా చిత్రాల నుండి మంచి సీన్లు నేటివిటికి అనుగుణంగా రాసేవారు రచయితలు అయిపోయారు. లేదా ఆల్రెడీ హిట్టయిన పరభాషా చిత్రాల రీమేక్ రైట్స్ కొని తీస్తున్నారు. మన తెలుగు దర్శకుల దగ్గర ఆరేడుమందికి తక్కువ కాకుండా రచయితలు ఉంటారు. కష్టం వీరిదే కానీ పేరు దర్శకుడిది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నిటికీ తన పేరే ఉంటుంది. టైటిల్స్ లో రచయితకు స్థానం ఉండదు. ఈ రచయితలకు నెల మామూళ్లు లేదా తిండి పెట్టి చిత్రానికింత అని ఇస్తారు.
ఈ రచయితల్లో తెలివైనవారు, మాటకారులు ఉంటే అవకాశం వచ్చేదాకా వేచిఉండి నిర్మాత దొరకగానే తామూ దర్శకుడయిపోతున్నారు… ఇప్పుడు రచయితలు రచయితలుగా ఉండట్లేదు, టార్గెట్ దర్శకత్వం. రచయితలకు తగిన గుర్తింపు ఉండదనే కొరటాల శివ, త్రివిక్రమ్, వక్కంతం వంశీలాంటి వారు దర్శకులయ్యారు. పైగా రచయితకు ఇచ్చే అమౌంట్ కన్నా దర్శకులకు ఇచ్చే అమౌంట్ వందలరెట్టు ఎక్కువ.
మంచి నవల దొరికినా దాన్ని జనరంజకంగా మలిచే సత్తా మన దర్శకులకు లేదని కొండపొలం నవలను సినిమాగా మలిచిన దర్శకుడు క్రిష్ నిరూపించాడు. మెరికల్లాంటి ఘోస్ట్ రైటర్లను పెట్టుకున్న వినాయక్,పూరి, కృష్ణవంశీ, శ్రీనువైట్ల లాంటి దర్శకులు ఇప్పుడు హిట్లు లేక ఇబ్బంది పడుతున్నారు, సుకుమార్ వినాయక్ దగ్గర నుండి, హరీష్ శంకర్, పరశురాంలు పూరి జగన్నాధ్ దగ్గరి నుండి బయటికి వచ్చాక సీనియర్ దర్శకులకు హిట్లు లేవు. స్వతహాగా మాటల రచయిత అయిన త్రివిక్రమ్ హాలీవుడ్ చిత్రాల నుండి కామెడీ సీన్లు, ఏక్షన్ సీన్లు లేపేసి తన మార్కు డైలాగులతో నెట్టుకొస్తున్నాడు. ఇక రాజమౌళి ఇంట్లో పెద్ద ప్యాకేజ్ టీమే ఉంది.
ఇప్పుడు ప్రతి రచయిత లక్ష్యం దర్శకుడవటమే… అయితే చిన్న దర్శకులు కొందరు రచయితలకు పేమెంట్ బదులు టైటిల్స్ లో రచయిత పేరు వేస్తున్నారు. పేమెంట్ లేకపోయినా రచయితగా గుర్తింపు వస్తుంది అని వీరి ఆశ. అయితే దర్శకుడు కావాలనుకునే రచయితకు అన్నిటికంటే ముఖ్యం హీరోల డేట్లు సంపాదించడం. ఇది అందరివల్లా కాదు ముందు హీరోలను ప్రసన్నం చేసుకోవాలి. కథ చెప్పేవిధానం బాగా తెలిసి ఉండాలి. అప్పుడే వారిని నిర్మాతలకు రికమాండ్ చేస్తారు. లేదా ఒక చిన్న నిర్మాతను పట్టుకుని ప్లాపుల్లో ఉన్న హీరోను ఒప్పించి కథ ఓకే చేయించుకుంటారు.
ఇవికాకుండా ఇంకో విధానం ఉంది మంచి కథతో చిన్న షార్ట్ ఫిల్మ్ చేసి తద్వారా నిర్మాతల్ని, హీరోలని ఆకర్షించడం. లేదా ఓ పదిమంది కలిసి అంతా కొత్తవాళ్ళతో ఓ క్రౌడ్ ఫండింగ్ మూవీ తీయటం. ఇప్పుడు కంటెంట్ బాగుంటే OTTలోను మంచి సినిమాలు ప్రజాదరణ పొందుతున్నాయి. వందల కోట్లలో గ్రాఫిక్ మూవీలు అవసరం లేదు లక్షల్లో కూడా ఫీల్ గుడ్ మూవీస్ తీసి హిట్ కొట్టవచ్చని మలయాళం ,తమిళ్ సినిమాలు నిరూపిస్తూనే ఉన్నాయి…
Share this Article