హఠాత్తుగా ఫేస్‌బుక్‌లోనే ఓ పోస్టు చదవడం తటస్థించింది… అందులో సారాంశం ఏమిటంటే… బలగం సినిమా కథ గతంలో నేను రాసిన పచ్చికి కథకు కాపీ అని జర్నలిస్టు గడ్డం సతీష్ చెప్పడం, దానిపై వివాదం తెలుసు కదా… దానిపై బలగం దర్శకుడు వేణు స్పందన కూడా హుందాగా లేదు… బలగం దర్శకుడిగా తనపై మొలకెత్తిన అభిమానం కాస్తా ‘‘దిల్‌రాజు బొమ్మ పెట్టుకుని సతీష్ చిల్లర వ్యాపారం చేస్తున్నాడు… ఆయన దమ్ముంటే తనతో మాట్లాడాలి’’ అనే వ్యాఖ్యతో పోయింది…
‘‘నువ్వు ఇప్పుడు ఆ బూతు జబర్దస్త్ కమెడియన్‌వు కాదు, ఒక జర్నలిస్టు తనకు క్రెడిట్స్ ఇవ్వాలని అడిగితే చిల్లర వ్యాపారం అనడం ఏమిటి..? బలగం సినిమాతో ఓ మెట్టు ఎక్కావు, నీవే ఆ మెట్లు దిగిపోకు వేణూ… మరీ అంతగా దిల్ రాజుకు దాసోహం దేనికి..?’’ అనే విమర్శలు కూడా వచ్చాయి… ఇప్పుడు తాజాగా కనిపించిన ఫేస్ బుక్ పోస్టు ‘‘అసలు అది వేణు కథ కాదు, సతీష్ కథ కాదు… నిజానికి వాళ్లిద్దరికీ మూలం తెలంగాణ కవి నందిని సిధారెడ్డి 2013లో రాసిన పిట్టకు పెట్టి అనే కవితే’’ అనేది సదరు పోస్టు సారాంశం…
నిజానికి పలు భాషల్లో పిట్ట ముట్టుడు అనే అంత్యక్రియల్లోని ఓ తంతు మీద వేరే సినిమాలు వచ్చినయ్… కథలు కూడా ఉన్నయ్… కాకపోతే ఒక్కో క్రియేటర్ తమకు తోచిన అంశాలతో లింక్ పెట్టారు… నందిని సిధారెడ్డి కూడా పిట్టకు పెట్టుడు, పిట్ట ముట్టుడు అనే ఈ తంతును తెలంగాణ ఆకాంక్షలకు లింక్ చేసి రాశాడు ఆ కవిత… చివరలో అసలు పిట్టలంటూ ఉంటే కదా రావడానికి అని ఓ ముక్తయింపు ఇచ్చాడు… ఎంత పోరాడినా తెలంగాణ రాలేదు కాబట్టి, ఎవరికీ ఆత్మసంతృప్తి లేదు కాబట్టి పిట్టలు రావడం లేదనే ఓ మార్మికమైన వాక్యంతో ముగించాడు… గుడ్… ఇదీ ఆ కవిత…
Ads
దానికీ వేణు రాసుకున్న కథకూ లింకే లేదు… సతీష్ కూడా తన కథకు ఎంచుకున్న బేస్ లైన్ పిట్టముట్టుడే అయినా బలగం కథ ట్రీట్‌మెంట్ వేరు… తను ఆ కథను తీసుకువెళ్లిన దారి వేరు… సతీష్ రైటా, వేణు రైటా అనే చర్చలోకి నేను వెళ్లడం లేదిక్కడ… అది అంత్యక్రియల్లో కనిపించే ఓ తంతు… మరణించిన వ్యక్తి ఆత్మ సంతృప్తిగా ఈ ఇహలోకం నుంచి పరలోకం వెళ్లాలనీ, అందుకని తనకు ఇష్టమైన తిండి పెడితే పిట్ట రూపంలో వచ్చి తింటాడనీ ఓ నమ్మకం…
ఎహె, పిట్టలు, కాకులు పితరులెట్లవుతారు అని ఈసడించిన కవులూ ఉన్నారు… ఇలాంటి నమ్మకాలు మెల్లిమెల్లిగా పోతాయి తప్ప అంత త్వరగా మన వ్యవహారంలో నుంచి దూరం కావు… పైగా వేణు ఆ చావు, పిట్ట ముట్టుడు అంశం చుట్టూ కుటుంబబంధాలు అనే కథనాన్ని అల్లుకున్నాడు… సో, బలగం ఎవరి కథ అనే వివాదమే అనవసరం… పిట్ట ముట్టుడుపై ఎవరికీ పేటెంట్ లేదు… చివరకు తెలంగాణ సమూహానికి కూడా…!!
Share this Article