ఇదొక ఇంట్రస్టింగు పరిణామం… రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది కదా… దాని సమర్థకులంతా చూపిస్తున్న కేసు మొహమ్మద్ ఫైజల్ కేసు… లక్షద్వీప్ ఎంపీకి ఒక కోర్టు జైలుశిక్ష విధించగానే పార్లమెంటు అనర్హత వేటు వేసింది… ఎన్నికల సంఘం కూడా ఆ ఎంపీ సీటును ఖాళీగా పరిగణించి, ఉపఎన్నికలకు రెడీ అయిపోయింది… ఇక్కడ రెండుమూడు కీలకాంశాలు చర్చకు వస్తున్నాయి…
ముందుగా తాజా పరిణామం ఏమిటో తెలుసుకుందాం… లోకసభ సచివాలయం సదరు ఎంపీపై వేసిన అనర్హత వేటును రద్దు చేసి, తిరిగి పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించింది…!! సో, రేప్పొద్దున అహ్మదాబాద్ హైకోర్టు గానీ, సుప్రీంకోర్టు గానీ రాహుల్ గాంధీ శిక్షను రద్దు చేస్తే వెంటనే పార్లమెంటు సచివాలయం ఫైజల్ కేసులో స్పందించినట్టుగానే స్పందించి, రాహుల్ లోకసభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తుందన్నమాట…
కానీ 17 రాజకీయ పక్షాలు కలిసి లోెకసభ స్పీకర్‌ను బదనాం చేయడానికి పూనుకున్నాయి… అంటే రాహుల్ సభ్యత్వాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి… తద్వారా రాజకీయ లబ్ధి కోసం, బీజేపీ మీద వ్యతిరేకత పెంచడానికి ఓ ప్రయత్నం… దానికన్నా కోర్టులో కొట్లాడటమే సరైన మార్గం… కానీ రాహుల్ పార్లమెంటులో చేయగలిగిన దానికన్నా ఈ అనర్హత వేటును రచ్చ చేయడం వల్ల ఎక్కువ ఫాయిదా పొందగలడు కాబట్టి ప్రతిపక్షాలు ఆ మార్గాన్ని ఎంచుకున్నాయని లెక్క…
Ads
బలంగా కనిపిస్తున్న బీజేపీ బలహీనపడటమే ప్రతిపక్షాలకు కావల్సింది… దొరికిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాయి..? ఇక ఫైజల్ కేసుకు వద్దాం ఓసారి… ఫైజల్ సహా నలుగురికి కరవత్తి సెషన్స్ కోర్టు జనవరి 11న పదేళ్ల జైలుశిక్ష విధించింది… ఇది 2009 లోకసభ ఎన్నికల గొడవలకు సంబంధించిన పంచాయితీ… కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పీఎం సయీద్ అల్లుడు సలిహ్‌ను హతమార్చడానికి ఫైజల్ తదితరులు ప్రయత్నించారని కేసు…
శిక్ష పడింది కదా… Article 102(1)(e) of the Constitution of India, Section 8 of the Representation of the People Act ప్రకారం లోకసభ సెక్రటేరియట్ ఫైజల్ సభ్యత్వంపై వేటు వేసింది… జనవరి 11న జైలు శిక్ష తీర్పు రాగా మరుసటి రోజే నిందితులు కేరళ హైకోర్టులో బెయిల్ అప్పీల్ కోసం అప్పీల్ చేశారు… జనవరి 25న హైకోర్టు వారికి విధించిన శిక్షను రద్దు చేసింది… దాంతో పార్లమెంటు సభ్యత్వంపై వేటు విషయాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయారు…
ఈ కేసులో విచారణలు ప్రారంభం కానుండగా లోకసభ సెక్రటేరియట్ ఫైజల్ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించింది… అదీ విశేషం… కేరళ హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని ఈ పునరుద్ధరణ నిర్ణయం తీసుకున్నట్టు సెక్రటేరియట్ వెల్లడించింది… అప్పట్లో అనర్హత వేటు పడగానే ఆ లోకసభ సీటును ఖాళీగా పరిగణించి ఎన్నికల సంఘం ఉపఎన్నికలను ప్రకటించింది… దాన్ని ఫైజల్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాడు… కేరళ హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకు చెప్పడంతో, సుప్రీం ఆ కేసు కొట్టేసింది…
సో, ఒకవేళ దిగువ కోర్టులు రెండేళ్లకు పైబడి శిక్షను విధించినా సరే, పైకోర్టుల్లో ఆ శిక్షలు రద్దు చేసినా, రెండేళ్లలోపుకు తగ్గించినా అనర్హత వేటు వేయాల్సిన పనేమీ లేదన్నమాటే కదా… మరి రాహుల్ గాంధీ విషయంలో కేంద్రం, లోకసభ ఎందుకు తొందరపడినట్టు..? తక్షణం వేటు వేయాలని గతంలో సుప్రీమే చెప్పిందనేది ఒక సమర్థన… ఎలాగూ దిగువ కోర్టు శిక్ష అమలును నెలపాటు వాయిదా వేసినప్పుడు, నిందితుడికి పైకోర్టుల్లో అప్పీళ్ల అవకాశం ఉన్నప్పుడు ఎకాఎకి సస్పెన్షన్ వేటు వేయడం కరెక్టేనా..? ఇదీ చర్చ…
దానికి సుప్రీమే క్లారిటీ ఇవ్వాలి ఇక… ఇక్కడ లోకసభ నిర్ణయం అంత వేగంగా వెలువడకపోయినా ఎవరూ తప్పుపట్టేవారు కాదు… సో, రాహుల్ విషయంలో తొందరపడి బీజేపీయే చేతులు కాల్చుకుందని అనుకోవాలి… అయితే… కేంద్ర ఎన్నికల సంఘం గానీ, లోకసభ గానీ సుప్రీంతో ఘర్షణ కోరుకోవడం లేదు ఈవిషయంలో… దాంతో ‘‘అధికారాల పరిధి’’ తెరపైకి రావడం లేదు… ప్చ్, లోకసభ తన నిర్ణయంపై అలాగే నిలబడి ఉంటే, సుప్రీం గత నిర్ణయాల మేరకే వ్యవహరించామని గనుక చెప్పి ఉంటే… సుప్రీం ఏమనేదో తెలిస్తే బాగుండేది… కథ రక్తికట్టేది…!!
చివరగా…. రాహుల్ పై అనర్హత వేటు వేశారుగా, ఫైజల్ కేసులోలాగే వాయనాడ్ సీటును ఖాళీగా పరిగణించి, ఉపఎన్నిక ప్రకటించలేదు ఎందుకు అనే ప్రశ్న కేంద్ర ఎన్నికల సంఘానికి ఎదురైంది ఈరోజు… అబ్బే, నెలరోజుల టైమ్ ఉందిగా, అందుకే తొందరపడ దలుచుకోలేదు అని చెప్పాడు సీఈసీ రాజీవకుమార్… సుప్రీంతో మొట్టికాయ ఎందుకనా..? సుప్రీంతో ఘర్షణ అక్కరలేదు అనుకున్నారా..? అసలే ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం వర్సెస్ కేంద్రం ఘర్షణ రగులుతూనే ఉంది…!! ఆల్రెడీ ఫైజల్ ఇష్యూలో తనే వెనక్కి తగ్గింది కూడా…!!
Share this Article