ముందుగా ప్రముఖ రచయిత Yandamoori Veerendranath ఫేస్ బుక్ వాల్ పై కనిపించిన చిన్న కంటెంట్ చదవండి… ‘‘”హీరోయిన్ డాక్టర్. దేశ సరిహద్దులో టెంట్. ఎదురుగా గాయాలతో సైనికుడు. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడు..! కానీ టెంట్ లో కరెంట్ లేదు…” రచయిత చెబుతొంటే నిర్మాత వింటున్నాడు.
నిజమే… డ్రామా పండితే సినిమా హిట్… ఎదురుతంతే, ప్రేక్షకులకు నచ్చకపోతే థియేటర్లు ఖాళీ… నిర్మాత నెత్తిపై ధవళవస్త్రం… రాఘవేంద్రరావు ఏమంటాడంటే..? ‘‘లాజిక్ కోసం ప్రయత్నిస్తే మ్యాజిక్ దెబ్బతింటుంది’’… అంటే లాజిక్కులు అవసరం లేకపోవడమే సినిమా కథ… హీరో ఒకే దెబ్బ కొడితే ఇరవై మంది రౌడీలు అలా గాల్లోకి లేచి అల్లంత దూరాన పడతారు… ఇక్కడ లాజిక్ ఏం పాడైంది…? అసలు స్టెప్పుల సినిమా డ్యూయెట్లే అతి పెద్ద లాజిక్ రాహిత్యం కదా…
స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ శ్రీరామనవమి ఉత్సవాల్లోని మంగళసూత్రాన్ని తీసుకుని, రాధిక మెడలో కట్టేస్తాడు… మరి ఆ అమాయకుడికి ఆ ఆలోచన ఎలా తట్టింది..? అదే మ్యాజిక్… లాజిక్ ఆలోచించొద్దు… సాగరసంగమం సినిమాలో ఫుల్లు తాగేసి బావి మీద డాన్సాడుతున్న కమలహాసన్ జయప్రద నొసటిపై బొట్టు వర్షపునీటికి కారిపోతుంటే అంత ఉలిక్కిపడి, తాగిందంతా దిగిపోయి, ఆమె బొట్టుకు అరచేయి అడ్డుపెడతాడు ఎందుకు..? అసలు బొట్టు లేని జయప్రదను చూస్తే ఏంటట..? అదే కథలోని మ్యాజిక్… ఆఫ్టరాల్ బొట్టు అనుకుంటే లాజిక్… అది ఉంటే ఆ సినిమా కథే లేదు…
Ads
సో, లాజిక్కుకూ సినిమా కథకూ లింకు ఉండదు, ఉండకూడదు… ఉంటే అది సినిమా కథ అనిపించుకోబడదు… మీరు డ్రామా అనండి, మెలోడ్రామా అనండి… అది ఉండాల్సిందే… లేకపోతే రియల్ లైఫ్ కథలకూ రీల్ లైఫ్ కథలకూ తేడా ఏముంటుంది..? ఎందుకు చూడాలి..? మచ్చుకు కొన్ని ఎగ్జాంపుల్స్… త్రీ ఇడియెట్స్ సినిమాలో ఏకంగా జనరేటర్ పెట్టి, ఏకంగా వాక్యూమ్ క్లీనర్ పెట్టి మరీ కాన్పు చేస్తాడు హీరో… పోకిరి సినిమాలో అదేదో సీన్‌లో రెండు గ్రూపులు తుపాకులతో కాల్చుకున్నంతసేపు, ఓ గుండు తాకిన కరెంటు బల్బు నుంచి నిప్పు రవ్వలు పడుతూనే ఉంటాయి… మరి ఫైట్ స్పెషల్ ఎఫెక్ట్, పంచ్ కుదరాలంటే ఆ రవ్వలు పడుతూనే ఉండాలి…
అంతెందుకు..? దాదాపు అన్ని సినిమాల్లోనూ కరెంటు షాకుల కామెడీ ఒకేతీరు… ఒకరిని విడిపించబోయి మరొకరు ఊగుతూ ఉంటారు… అదేనట షాక్ అంటే… చూస్తుంటే నవ్వొస్తుంది… అందువల్ల చేత సినిమాల్లో డ్రామాలు, మెలోడ్రామాలు కొన్నిసార్లు పండును… ఇంకొన్నిసార్లు మండిపోవును… అది ప్రేక్షకుడి దయ- నిర్మాత ప్రాప్తం… అంతే…
Share this Article