నిజానికి ఇందులో ఏముందని..? ఒక జిల్లా కలెక్టర్ మరో చోటికి బదిలీ అయ్యాడు… కామనే కదా… అన్నిచోట్లా ఎప్పుడూ రొటీన్‌గా జరిగేవే కదా… రాత్రికిరాత్రి ఈ కలెక్టర్ వెళ్లిపోతాడు, ఇంకో కలెక్టర్ వస్తాడు, జిల్లా పత్రికల్లో వార్త వస్తుంది.., అంతే కదా…!! స్థూలంగా పైపైన చదివితే అంతే… కానీ ఈ జిల్లా కలెక్టర్ కథ వేరు..! కేరళలో పతనంతిట్ట తెలుసు కదా, శబరిమల ఆ జిల్లా పరిధిలోనే ఉంటుంది… దానికి మూడేళ్ల క్రితం, 2018 జూన్‌లో కలెక్టర్‌గా వచ్చాడు పీబీ నూహ్… నూ అని పిలుద్దాం… కేరళీయుడే… ఎర్నాకులం ఏరియాకు చెందిన ఓ చిన్న కిరాణా షాపు యజమానికి కొడుకు… మొత్తం ఎనిమిది మంది సంతానంలో ఏడవవాడు… 2012 యూపీఎస్సీ పరీక్షలు నెగ్గి, కేరళ కేడర్లోనే చేరాడు… కలెక్టర్ అయినప్పటి నుంచీ తనకు పరీక్షలే… ఎలాగంటే..?
ఈ ఫోటో గుర్తుందా..? వైట్ చొక్కా వేసుకుని, ఏదో ప్రవాహం దాటుతున్నాడు, మూతికి మాస్క్… ఇది కరోనా సహాయచర్యల ఫోటో కాదు… 2018లో భారీ వర్షాలు, వరదలు పతనంతిట్ట జిల్లాను అతలాకుతలం చేశాయి… అప్పుడు వరద సహాయ సామగ్రిని కలెక్టర్ నూ తను స్వయంగా మోసుకెళ్తున్న ఫోటో ఇది… ఆ వరదలు ఎంత కకావికలం చేశాయంటే దాదాపు 15 లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించాల్సి వచ్చింది… అంతకుముందు అదే జిల్లాకు కలెక్టర్‌గా పనిచేసిన హరికిషోర్ అనే మరో ఐఏఎస్ అధికారిని కూడా సహాయ చర్యల కోసం పంపించాల్సి వచ్చింది… ఇద్దరూ రోజుకు 20 గంటలపాటు పనిచేసిన తీరును మీడియా కూడా ప్రశంసించింది అప్పట్లో… 2019… మరోసారి వరదలు… మళ్లీ సహాయ చర్యలు…
Ads
అదే 2019… శబరిమల గుడిలోకి రుతు ప్రవేశాలపై వివాదం… సుప్రీం తీర్పు, దాన్ని అమలు చేయడానికి రాజకీయ నిర్ణయం తీసుకున్న సీపీఎం ప్రభుత్వం… ధర్నాలు, ఆందోళనలు, ఉద్రిక్తత, నిరసనలు… అందరి దృష్టీ ఆ జిల్లాపైనే… రోజంతా పనే… సరే, ఆ ఏడాది ఎలాగోలా గడిచిపోయింది… 2020 వచ్చింది… ఈసారి కరోనా వచ్చిపడింది…
దేశంలోనే ఫస్ట్ కరోనా హాట్ స్పాట్… కేసులు మొదట గుర్తించినవి ఈ జిల్లాలోనే… క్వారంటైన్స్, ఫస్ట్ కంటాక్ట్, సెకండ్ కంటాక్ట్, గుర్తించడం, ఐసోలేట్ చేయడం, కంటైన్మెంట్ జోన్లు క్రియేట్ చేయడం… పాండెమిక్ మీద ఫస్ట్ పోరాటం స్టార్ట్ చేసింది ఈ జిల్లాయే… అందులోనూ కలెక్టర్‌దే ప్రధాన బాధ్యత… అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం, వర్క్ చేయించుకోవడం ఎట్సెట్రా… ఇప్పుడు కాస్త కరోనా భయం తగ్గింది కదా… రొటీన్ బదిలీల్లో భాగమే కావచ్చు… తనను కోఆపరేటివ్ రిజిస్ట్రార్‌గా బదిలీ చేశారు… తను ఫేస్బుక్లో చాలా యాక్టివ్… బదిలీ విషయం తెలియగానే… ‘‘వెళ్లిపోయే టైం వచ్చేసింది, పతనంతిట్టకు వీడ్కోలు’’ అన్నట్టుగా ఓ పోస్టు పెట్టాడు… ఇలా…
సాధారణంగా ఒక కలెక్టర్ బదిలీ అయిపోతే జనంలో పెద్ద కదలిక ఏమీ ఉండదు… మరీ అసాధారణంగా జనంతో కనెక్ట్ అయితే తప్ప… ఈరోజుల్లో అలాంటి కలెక్టర్లు ఎవరున్నారని..? కానీ ఈయన బదిలీ తరువాత తన పోస్టుపై పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందించారు… తన బదిలీ పట్ల బాధపడ్డారు… తను పనిచేసిన కాలంలో రెండుసార్లు వరదలు, శబరిమల గొడవలు, కరోనా విపత్తు… దిగువ స్థాయి వరకూ సిబ్బందిలో విశ్వాసం కలిగిస్తూ, కలిసి పనిచేస్తూ, చేయించుకుంటూ, ఫీల్డ్ వర్క్ చేశాడు కాబట్టి ఈ స్పందన… కామెంట్ల రూపంలో తన సేవల్ని గుర్తించారు నెటిజనం… వీడి వెళ్లిపోతున్న ఓ కలెక్టర్‌కు వేల అభినందన వ్యాఖ్యలకు మించి వీడ్కోలు ఏముంటుంది..? వెల్ డన్ పీబీ నూహ్…!
Share this Article