Nancharaiah Merugumala……… అమెరికా మార్క్సిస్టు సిద్ధాంతం అనుసరించే తృతీయ ప్రపంచదేశం అవుతుంది! యూరప్ లో కమ్యూనిజం వస్తుందన్న కిసింజర్ జోస్యం తప్పని తేలింది! మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా అంచనా నిజమౌతుందా? తెలుగు అమెరికన్ల వల్లే అమెరికా ‘ఎర్రబడుతుందా’?
………………………………………………………..
నటి స్టోర్మీ డేనియల్స్ (స్టివానీ క్లిఫర్డ్)కు డబ్బులిచ్చి తాను చేసిన తప్పును వెల్లడించకుండా నోరు మూయించారనే కేసులో అరెస్టయిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (76) తన దేశ ప్రజలను భయపెట్టే ప్రయత్నంలో పడ్డారు. తండ్రి వైపు నుంచి జర్మనీలో మూలాలున్న ట్రంప్ ఆ దేశం నుంచి లండన్ వచ్చి స్థిరపడిన మహామహోపాధ్యాయుడు కారల్ మార్క్స్ రూపొందించిన సిద్ధాంతం పేరు చెప్పి మరీ అమెరికన్లను భయకంపితులను చేయాలని చూస్తున్నారు.
Ads
ప్రపంచంలో అతి గొప్ప ప్రజాతంత్ర దేశమైన అమెరికాలో ప్రస్తుత పోకడలు ఇలాగే అవిచ్ఛిన్నంగా కొనసాగితే– ఈ దేశం మార్క్సిస్టు సిద్ధాంతాలు అనుసరించే తృతీయ ప్రపంచదేశంగా మారిపోతుందని మంగళవారం తాను పుట్టిపెరిగిన నగరం న్యూయార్క్‌లో ఆయన దేశ ప్రజలను హెచ్చరించారు. డబ్బులిచ్చి స్టోర్మీ దేనియల్స్ నోరు నొక్కే ప్రయత్నం చేశారనే కేసులో మన్ హటన్ పోలీసులు ట్రంప్ ను అదుపులోకి తీసుకున్న సందర్భంలో ఆయన ఇలా అమెరికా భవిష్యత్తుపై జోస్యం చెప్పారు.
1970ల్లో వియత్నాం విముక్తి పోరాటం వంటి అనేక కమ్యూనిస్టు సాయుధ పోరాటాలు విజయవంతమౌతున్న పరిస్థితుల్లో నాటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ (రేపొచ్చే మే 27కు ఆయనకు 100 ఏళ్లు నిండుతాయి) అన్న మాటలను నిన్నటి ట్రంప్ హెచ్చరిక గుర్తుచేస్తోంది. 1970ల ద్వితీయార్ధంలో అప్పటి సోవియెట్ యూనియన్ దూకుడు, పశ్చిమ ఐరోపా దేశాల్లో (ఇటలీ, ఫ్రాన్స్) కమ్యూనిస్టు పార్టీల ఎన్నికల విజయాలను చూసి, ‘‘ పదేళ్లలో ఐరోపా దేశాల్లో కమ్యూనిజం వచ్చేస్తుంది,’’ అని కిసింజర్ అప్పట్లో హెచ్చరించారు.
వాస్తవానికి ‘కమ్యూనిజం’ ఉన్న సోవియెట్ యూనియన్ (యూఎసెసార్) సహా తూర్పు ఐరోపా దేశాల్లో కమ్యూనిస్టు వ్యవస్థలు కిసింజర్ జోస్యం చెప్పిన పదిహేనేళ్లకు కుప్పకూలిపోయాయి. పశ్చిమ ఐరోపా దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు పేర్లు మార్చుకుని మాయమయ్యాయి. 30 ఏళ్ల తర్వాత ‘ఐరోపా కమ్యూనిజంపై మీ అంచనా నిజం కాలేదు కదా!’ అని ఓ విలేఖరి కిసింజర్ ను ప్రశ్నించగా, ‘ అమెరికా, ఇతర పెట్టుబడిదారీ– పారిశ్రామిక దేశాలను కమ్యూనిజం విషయంలో కఠినంగా ఉండేలా చేయడానికే అలా మాట్లాడాను,అలా హెచ్చరించాను’ అని ఆయన జవాబిచ్చారు.
ఇక అమెరికా విషయానికి వస్తే– ఇప్పుడు అమెరికాలో వర్గం అనే స్పృహ వేగంగా పెరుగుతోందని, అమెరికా యువతలో మార్క్సిజంపై ఆసక్తి, అభిమానం పెరుగుతున్నాయని సియాటల్ (అమెరికా పశ్చిమ రాష్ట్రం వాషింగ్టన్) నగర సిటీ కౌన్సిల్ సభ్యురాలు, మార్క్సిస్టు సోషలిస్టు ఆల్టర్నేటివ్ సభ్యురాలు క్షమా సావంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఏదేమైనా మా కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి వంటి ప్రాంతాల నుంచి కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న కమ్మ కుటుంబాల పిల్లలు, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు, తెలంగాణ ప్రాంత ‘ఎర్ర రెడ్ల’ పిల్లలు పెద్ద సంఖ్యలో అట్లాంటిక్ మహాసముద్రం దాటి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో చదువుకుని స్థిరపడడం వల్ల కూడా అక్కడ యువత మార్క్సిజం వైపు పరుగులు తీస్తోందని బెజవాడలోని కొందరు కమ్యూనిస్టు మిత్రులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో సంపద సృష్టిండమేగాక, అక్కడ మార్క్సిజానికి గట్టి పునాదులు వేస్తున్న కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ సహా తెలుగు సకలజనులు నిజంగా గొప్పవారే మరి. ఎప్పటికైనా తెలుగు కమ్మ మార్క్సిస్టో, రెడ్డి కమ్యూనిస్టో అమెరికా వైట్ హౌస్ లో కనీసం నాలుగేళ్లు బసచేసే రోజు 2047లోపే రావచ్చేమో?
Share this Article