రంగమార్తాండ… ఈ సినిమాకు చెత్త ట్యూన్లను ఇచ్చి, కర్ణకఠోరంగా తెలుగు పదాల్ని ఉచ్చరించిన ఇళయరాజాది ఓ పతనావస్థ… ముచ్చటలో పబ్లిషైన ఈ అభిప్రాయాన్ని ఆయనకు ఎవరో ఇంగ్లిషులో ట్రాన్స్‌లేట్ చేసి పంపిస్తే, చివరకు ఇదా నాకు శ్రోతల్లో గుర్తింపు అని బాధపడ్డాడు… ఇప్పటికీ ముచ్చట తన అభిప్రాయానికి కట్టుబడే ఉంది… ఇళయరాజా, పాడటం వేరు, పాఠం అప్పగించడం వేరు, అదీ ఘోరమైన ఉచ్చరణతో…
ఈ సినిమాకు సంబంధించిన మేజర్ మైనస్ పాయింట్ అదే… తరువాత లెక్కకు మిక్కిలి ఫ్రీ షోలు వేసి, బహుశా లక్ష్మిభూపాల కావచ్చు, తనకు తెలిసినవాళ్లందరికీ ఉచితంగా సినిమా చూపించాడు… పెయిడ్ రివ్యూలు, మొహమాటం రివ్యూలు సినిమాను నిలబెట్టవు అనే బేసిక్ సోయి నిర్మాతకు గానీ, దర్శకుడికి గానీ లేకుండా పోయింది… సినిమా చూసినవాళ్లు ఆహా ఓహో అని గీకిపడేశారు… నిజానికి ఆ సినిమాలో అంత దమ్ముందా..? అస్సలు లేదు… ఇది కృష్ణవంశీ పతనావస్థ…
తరువాత బలగం సినిమాకూ, రంగమార్తాండకూ పోలిక వచ్చింది… నిజానికి బలగం సినిమాతో రంగమార్తాండను పోల్చకూడదు… బలగంలో కొన్ని దోషాలున్నా సరే, ప్యూరిటీ శాతం ఎక్కువ… రంగమార్తాండ ఓ కృతకమైన ఫీల్… ఒక్క పాత్రకూ సరైన కేరక్టరైజేషన్ లేదు… అన్నింటికీ మించి కృష్ణవంశీలో అడుగంటిన క్రియేటివిటీకి తార్కారణం ఈ సినిమా… ఎస్, కాపీరాయుళ్లు మలుపు మలుపుకీ ఉన్నారు ఇండస్ట్రీలో….
Ads
నిజానికి ఇక్కడ ఒరిజినాలిటీ పడదు, అందరికీ కాపీలే కావాలి… త్రివిక్రమ్ నుంచి మొదలుకొని రాజమౌళి దాకా అందరూ కాపీబోతులే… ఫలానా సినిమ ఇన్‌స్పిరేషన్ అనగానే కావలించుకుని కోట్ల బడ్జెట్ ఇస్తారు. కొమ్ములు తిరిగిన రైటర్లు కూడా ఎత్తిపోతల సీన్లు రాసి బోరఎత్తుకు తిరుగుతున్నారు… ఈ రంగమార్తాండలో కూడా అడుగడుగునా శంకరాభరణం సీన్లు వాడేసుకున్నారు…
కథకు మూలమైన మూడు కారక్టర్లను కూడా ‘శంకర శాస్త్రి, అతని మిత్రుడైన అల్లు, తులసి (మంజుభార్గవి)’ పోకడలతో అచ్చుదింపారు. చివరికి చావులను కూడా వాడేసుకున్నారు… చూసే జనాలు పిచ్చోళ్ళైతే, తీసే జనాలు క్రియేటర్లు ! ఒరిజినల్‌కి రీమేక్ కి నక్కకి నాకలోకానికున్నతేడా వుంది. నానా పటేకర్ ప్రకాష్‌రాజ్‌కు థాంక్స్ చెప్పుకోవాలి… ప్రకాష్‌రాజ్ ఓవరాక్షన్, మొనాటనస్ ధోరణితో నానాపటేకర్ గొప్పదనం ఎంతో లోకానికి తెలిసొచ్చింది…
క్రియేటివ్ డైరెక్టర్ అని పేరుమోసినాయన కాపీ డైరెక్టరయ్యాడు. ఇక సోషల్ మీడియాలో సెలబ్రిటీ ఐన లక్ష్మీభూపాల కాపీ సీన్లు రాసి తన సత్తా చాటాడు. ఇళయరాజా ఐతే సరేసరి. చెప్పుకున్నాం కదా, చూరులో దాచిన చుట్టముక్క అరువిచ్చినట్లు, వాడకపోగా మిగిలిన ట్యూనిచ్చి పండగచేసుకో అని పంపేసాడు డైరెక్టర్‌ని. అడుగడుగునా కాపీ సీన్లే. సీనుసీనులో కాపీ కారెక్టర్లే….. మచ్చుకు కొన్ని చూడండి…
1. శంకరశాస్త్రి సాటి కళాకారున్ని ఆదుకోడానికి గండపెండేరం అమ్మేస్తాడు. ‘రంగ’లో కూడా అంతే…
2. శంకరశాస్త్రి వేరే మాస్టారుతో పిల్లకి శాస్త్రీయ సంగీతం చెప్పమని క్లాసుపీకుతాడు. రంగలో- స్కూల్లో తెలుగు పైన క్లాసు పీకుతాడు…
3. శంకరశాస్త్రి వెస్టర్న్ మ్యూజిక్ పాడే యువకులకి క్లాసుపీకుతాడు. రంగలో స్కూల్లో యాన్యువల్ డేకి క్లాసు పీకుతాడు…
4. శంకరశాస్త్రి పెళ్ళి చూపులకొచ్చిన అల్లునికి సంగీతమంటే ఏంటో క్లాసు పీకుతాడు. రంగలో షూటింగుకుపోయి అక్కడ నటన అంటే ఏంటో క్లాసు పీకుతాడు…
5. శంకరశాస్త్రి ఇల్లు గడవక దయనీయ స్థితిలో కూడా గంభీరంగా బతుకుతూ సంగీతం మీద గొప్పలు చెప్తాడు. రంగలో కూడా డిటో…
6. శంకరశాస్త్రి చనిపోయాడని తెలియగానే తులసి ప్రాణాలు విడుస్తుంది. రంగలో కూడా ఇంచుమించు అంతే… తవ్వితే ఇంకా వస్తాయి…
7. అల్లు పాత్రకి + సాగరసంగమంలో శరత్‌బాబు పాత్రకి బ్రహ్మీ పాత్ర ఎక్స్‌టెన్షన్… చివరగా… బలగం సహజాహారం… రంగమార్తాండ రుచి కుదరని వంట… బలగంలో సహజనటన… రంగమార్తాండలో ‘అతి ప్రదర్శన’… రెండు సినిమాల్లోనూ కుటుంబబంధాలే కథలో కీలకం… బలగంలో జీవితం కనిపిస్తుంది, రంగమార్తాండలో ‘నాటకం’ కనిపిస్తుంది… సుదీర్ఘ నిర్మాణం, అదుపు తప్పిన నిర్మాణవ్యయం, నాసిరకం కథ, మార్కెటింగ్ లోపాలు, సోషల్ ప్రమోషన్‌పై నమ్మకం, ఇళయరాజా నాసిరకం మోతలు… ఇవేకాదు, రంగమార్తాండ ఫెయిల్యూర్ కారణాల్లో ప్రకాష్ రాజ్ కూడా ప్రధాన బాధ్యుడే… ‘అతి’ చేసి నిర్మాతను అడ్డంగా ముంచేశాడు…!!
Share this Article