పత్రికల జోన్ పేజీలలో కొన్ని వార్తలొస్తుంటాయి… ఏదైనా సభ జరిగితే అందులో పాల్గొన్నవారి పేర్లు లంబాచోడా అనేక పేర్లు వార్తలో ఇరికిస్తారు… కొన్ని మొహామాాటాలు, కొన్ని ఒత్తిళ్లు, కొన్ని ప్రలోభాలు… కారణాలు ఏవైతేనేం..? కొన్నిసార్లు లీడ్ రాసేసి, మిగతా వార్త మొత్తం పేర్లతో నింపేవాళ్లు కూడా ఉన్నారు… డెస్కుల్లో కూడా కళ్లు మూసుకుని అచ్చేస్తారు…
పైగా రొటీన్ ఫార్మాట్… ఎవరో ముఖ్య అతిథి తెలిసీతెలియక ఏదైనా కూస్తే దాన్నే లీడ్ తీసుకుని, అదే హెడింగ్ పెట్టి తోసేస్తుంటారు… పత్రిక దయ, పాఠకుడి ప్రాప్తం… ఈనాడులో ప్రమాణాల పతనం వేగంగా సాగుతున్నది అనేది నిజం… క్షుద్ర అనువాద పదాలు ఒక పైత్యం కాగా, ఇదుగో ఇలాంటి వార్తలు మరో ఇకారం… సినిమా వార్తలు అంటే లైవ్‌గా ఉండాలి, శైలి బాగుండాలి… ఇది మరీ జోన్ వార్తలాగా ఉంది…
వార్త ఏమిటంటే..? ఆస్కార్ అవార్డు పొందిన నాటునాటు పాట రచయిత చంద్రబోస్‌కు, సంగీతకర్త కీరవాణికి ఫిలిమ్ ఇండస్ట్రీ సన్మానం చేసింది… దానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధులుగా ఇద్దరు ముగ్గురు మంత్రులు హాజరయ్యారు… దీనికి సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా వచ్చారు… ఇదీ వార్త… ఈ ఈనాడు వార్త ఓసారి లుక్కేయండి…
Ads
పొన్నియిన్ సెల్వన్ మూడున్నర- నాలుగు గంటల రెండో పార్టు ఉన్నంత సుదీర్ఘంగా ఉంది వార్త… అబ్బో, బాగానే అని కాస్త చదువుతూ పోతుంటే… ఆ పాటకు డబ్బులు పెట్టిన నిర్మాత దానయ్య హాజరే కాలేదు… అంటే అసలైన వాడినే పక్కన పెట్టేసిన ఓ దిక్కుమాలిన మీటింగ్ అన్నమాట… అంతేలెండి, 85 కోట్ల ఖర్చుతో కష్టపడి, రాజమౌళి తను స్వయంగా లాబీయింగు చేయించుకుని దక్కించుకున్న అవార్డులు కదా… గాయకులు, డాన్స్ కంపోజర్లకు కనీసం శాలువా ఐనా కప్పారా..? తెలియదు, వార్తలో లేదు…
మూడో కాలమ్ కూడా సుదీర్ఘంగా కిలోమీటర్ పొడవుంది… లెక్క పెట్టాను… 39 మంది పేర్లు వరుసగా రాశాడు ఆ రిపోర్టర్ ఎవరో… ఈనాడు సినిమా పేజీ బాధ్యులెవరో గానీ కళ్లు మూసుకుని అచ్చేశాడు, అనగా పేజీలోకి తోసేశాడు… ఫాఫం, మెయిన్ స్ట్రీమ్ మీడియా, మరీ ప్రత్యేకంగా పత్రికలు… ఒక్క వాక్యమూ నెగెటివ్‌గా రాయడానికి, రావడానికి వీల్లేదు… పైగా ఇలాంటి సమావేశాల వార్తలు రాస్తే ఎవడికీ కోపం రాకుండా, ఎవడి పేరుకూ కత్తెర వేయకుండా జాగ్రత్తపడాలి…
ఇది చూడండి… ఆంధ్రజ్యోతి… సింపుల్‌గా రాసిపడేసింది… అసలు రాయడమే ఎక్కువ అన్నట్టుగా… ఏడ్చేవాడు ఏడ్వనీ, మేం రాసే రీతిలోనే రాస్తాం… ఎవడి మొహమాటంతోనూ పనిలేదు… మరి ఈనాడుకు ఇదెందుకు చేతకాలేదు… 39 పేర్లు రాసినవాడికి మరో 39 పేర్లు రాయడం శ్రమా..? పనిలోపనిగా సభకు వచ్చిన వారి పేర్లను కూడా రాసేస్తే ఓ పనైపోయేది… డెస్కులో ఎలాగూ కళ్లుమూసుకునే కదా పేజీలోకి నెట్టేసేది… ఒకటి మాత్రం నవ్వు తెప్పించింది…
పరచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘’రాజమౌళి, కీరవాణి, బుర్రా సాయిమాధవ్, విజయేంద్రప్రసాద్, చంద్రబోస్ పంచపాండవుల్లా కలిసి పనిచేసి ఆస్కార్ సాధించారు’’ అన్నాడట… ఆస్కార్ పొందింది పాట… పాట రాయించుకున్న రాజమౌళికీ, సంగీతం ఉద్దరించిన కీరవాణికి, రాసిన చంద్రబోస్‌కు పాత్ర ఉందీ అనుకుందాం… మధ్యలో విజయేంద్రప్రసాద్, బుర్రా సాయిమాధవ్ గొప్పతనం ఏముంది..? క్రెడిట్స్ దక్కాల్సిన రాంచరణ్, జూనియర్, ప్రేమ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్ పేర్లు మాత్రం లేవిక్కడ… చంద్రబోస్‌కైతే భారత పతాకాన్ని చేతపట్టుకున్నంత ఆనందం కలిగిందట… ఫాఫం, నాటునాటు వంటి సాహిత్యం భవిష్యత్తులో వస్తుందీ అని తెలిసి ఉంటే ఆదికవులు ఎంత తల్లడిల్లిపోయేవారో… ఈ సోయి తప్పిన మాటలకు ఎంత బాధపడేవాళ్లో…!!
Share this Article