Suraj Kumar……… అయోమయం జగన్నాథం! #రంగమార్తాండ
ఈ మధ్య వచ్చిన మూవీల్లో బంధాలు ఎలా ధృఢపడాలో చెప్పింది బలగం ఐతే, వాటిని ఎలా తెంపుకోవాలో చెప్పింది రంగమార్తాండ! సారీ, నేనిక్కడ బంధాలు ఎలా తెగిపోతాయో తెలిపేడని దర్శకుడికి కితాబు ఇవ్వదల్చుకోలేదు. ఎందుకంటే, బంధాలను తెంపుకోవడానికి గల కారణాలు ఏమిటని అన్వేషించడం ఎలానో రమ్యకృష్ణ పాత్ర ద్వారా దర్శకుడు తెరకెక్కించే ప్రయత్నం చేశాడేమో అనిపించింది! సవరించుకోదగ్గ, సర్దుకుపోదగ్గ చిన్నచిన్న కారణాలతోనే తల్లిదండ్రులు, పిల్లల నడుమ పాశాలు వీగిపోతాయన్న సెన్స్ లో మొత్తం టేకింగ్ నడిచింది!
రంగమార్తాండ చిత్రంలో ఏ క్యారెక్టర్ ను పూర్తిస్థాయిలో విలన్ గా ఎలివేట్ చేయలేకపోయాడు కృష్ణవంశీ! ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, మూవీలో ఆడాళ్లు అందరూ విలన్స్, మగవాళ్లందరూ వాళ్ల మధ్య నలిగిపోయే పాత్రలా అన్నట్లుగా సన్నివేశాలున్నాయి! ఆద్యంతం చిత్రకథనం సాగిన తీరు, ఒక సగటు ఫ్యామిలీని విడగొట్టడంలో డైరెక్టర్ సెల్యులాయడ్ పైకి ఎక్కించిన కారణాలే అందుకు సాక్ష్యం!
Ads
ఆకర్షణీయమైన టైటిల్ తోపాటు, సినిమాలో హీరో ప్రకాష్ రాజ్, ఆయన ఆప్తమిత్రుడు బ్రహ్మనందాలు రంగస్థలనటులన్నదే ఇక్కడ స్టోరీలో కొత్త లైన్! మిగతా అంతా సేమ్ టు సేమ్ రొటీన్, పాత చింతకాయ పచ్చడే! నాటకాల్లో రంగస్థలంపై చెప్పించాల్సిన డైలాగ్లను అర్థంపర్థం లేకుండా, సందర్భరహితంగా కథలోకి జొప్పించి అందులోని పాత్రలతో నేరుగా చెప్పించడం బోర్ కొట్టించడమే కాకుండా, అచ్చం అతుకులబొంతను తలపించింది.
పొనియ్, సినిమాలో ప్రకాష్ రాజ్ ఇరగదీశాడనడానికి కూడా లేదు! ఎందుకంటే, అతనొక విలక్షణమైన ప్రతిభ కలిగిన సహజనటుడు. ఏ పాత్రలో ఐనా ఇట్టే ఇమిడిపోయి నటించడం కాదు, ఏకంగా జీవించేస్తాడు. కానీ, నన్నడిగితే ఇదే కృష్ణవంశీ దర్శకత్వంలో 1998 లో వచ్చిన అంత:పురం సినిమానే ప్రకాష్ రాజ్ కీర్తికిరీటంలో కలికితురాయి. ఒక మైల్ స్టోన్ గా నిలిచిన ఆ చిత్రంలో పతాకస్థాయి నటనను ప్రదర్శించి, ప్రకాష్ రాజ్ ఇంతకంటే ఎక్కువగా ప్రేక్షకులను అలరించాడు! అబ్బురపరిచే అభినయకౌశలంతో అదరగొట్టి మన్ననలు పొందాడు! ఐతే, తన స్వభావసిద్ధమైన కామెడీ ట్రాక్ ను వదిలి ఒక సీరియస్ క్యారెక్టర్లో తనదైన శైలిలో లీనమైపోయి అత్యంత సహజంగా నటించిన బ్రహ్మానందాన్ని మాత్రం శభాష్ అనక తప్పదు.
ఇక ఇవ్వాల్టి రోజుల్లో కుటుంబసభ్యుల మధ్య పొరపొచ్చాలు సహజం. వాటిలో నిజంగా సీరియస్ గా తీసుకోవాల్సినవి కొన్నైతే, సిల్లీ అంశాలే అధికం! చిన్నవే ఐనా కొన్నిసార్లు చినికిచినికి గాలివానలా మారి తాత్కాలిక గొడవలకు దారి తీసినా, అవి తెగదెంపుల దాకా వెళ్లవు! కాస్త సమయం గడిచాక వాటంతటవే సద్దుమణగడమో, లేక క్షమాపణ కోరడం వల్ల కుటుంబంలో ఉద్రిక్తత వీగిపోవడమో సర్వసాధారణం. పాలమీది పొంగులా వ్యక్తుల ఆవేశాలు కూడా చల్లారిపోయి కొద్దిసేపటికి పరిస్థితి యధాస్థితికి చేరుతుందనడంలో ఏమాత్రం డౌటక్కరలేదు! రక్తసంబంధాలు అలానే ఉంటాయి, మాస్ మీడియా కూడా అంతిమంగా అవి అలా ఉండాలని చూపితేనే దానికి పరమార్థం! కానీ, ఆద్యంతం అప్రాధాన్య అంశాలకే పెద్దపీట వేసి, అందులోని కొన్ని పాత్రల చిన్న తప్పిదాలే, ఘోరమైన నేరాలన్న చందంగా రంగమార్తాండ చిత్రీకరణ సాగుతుంది.
క్షమాపణలు, పశ్చాత్తాపాలతో పనిలేదు, విడిపోవడం మాత్రమే పరమావధి అన్నట్లుగా చిత్రకథనం ఉంటుంది. ఇంకోమాటలో చెప్పాలంటే పిల్లలను తల్లిదండ్రుల పాలిట విలన్లుగా చూపించే ఒక అసహజ ప్రయత్నం జరిగింది! నిజంగా సమాజంలో అలాంటి పిల్లలు లేరా? అంటే, ముమ్మాటికీ ఉన్నారు! కానీ, ఈ సినిమాలో పిల్లల క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అలా జరగలేదు! కన్ఫ్యూజనో లేక ఇంకోటో తెలియదు కానీ, ప్రకాష్ రాజ్ పిల్లల్ని దర్శకుడు మంచోళ్లుగా చూపించాలనుకున్నాడా, లేదా చెడ్డవాళ్లుగా చూపించాలనుకున్నాడా అని మాత్రం క్లారిటీ లేదు!
ఇక, బ్రహ్మానందానికి, ప్రకాష్ రాజ్ నిద్ర మాత్రలిచ్చి చంపే సీన్ ద్వారా కృష్ణవంశీ సినిమా మీద పూర్తిగా పట్టుకోల్పోయాడని చెప్పవచ్చు! ఎందుకంటే, ఆసుపత్రిలో అంతకు కొంచం ముందు షాట్లో ”నేను డాక్టర్ ను కలిసి వచ్చాను, నువ్వు ఒకరోజుకంటే ఎక్కువ బ్రతకవు” అని ప్రకాష్ రాజ్ సరదాగా అన్నప్పుడు, బ్రహ్మానందం తీవ్రంగా కలత చెందడం, ఆ వెంటనే, “ఊరికే అన్నానులేరా, కంగారుపడకు” అని ప్రకాష్ రాజ్ అనగానే, ఓ భారీ నిట్టూర్పుతో బ్రహ్మానందం “హమ్మయ్య బ్రతికించావురా” అంటూ రిలాక్సయ్యే సీన్ ఉంటుంది.
కాసేపటికే, ఇందుకు పూర్తి భిన్నమైన మరో సీన్ వస్తుంది. అందులో ఇద్దరు మిత్రుల మధ్యా అనూహ్యమైన ఎమోషనల్ సీన్ క్రియేటయి, బ్రహ్మానందం “ఇక నేను, ఈ బాధలు భరించలేకపోతున్నాను, నాకు విముక్తి కల్పించరా” అని అడిగిందే తడవు, తాను అందుకోసమే ఎదురుచూస్తున్నాడా అన్నట్లు, ఆ వెంటనే ప్రకాష్ రాజ్, బ్రహ్మానందాన్ని చంపేసి వెళ్లిపోయే షాట్ ఉంటుంది. ఇక్కడ దర్శకుడు ప్రేక్షకులకు చెప్పాలనుకున్నది ఏమిటో అర్థంకాలేదు! పోనియ్, ఆ సీన్లను వేర్వేరుగా చూసే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే ఆ ఇద్దరు స్నేహితుల మధ్య డ్రామా అంతా ఒకే సీక్వెన్స్ లో కొనసాగుతుంది.
చివరగా, కుటుంబాల్లో చిన్నచిన్న పొరపొచ్చాలుంటే సర్దుకుపోవాలనే మెసేజ్ ఇవ్వాల్సిన మూవీని, క్లైమాక్స్ లో రమ్యకృష్ణ క్యారెక్టర్ నడిరోడ్డు మీద చచ్చిపోవడమనే కాన్సెప్టే డామినేట్ చేసింది. అటు రాజుగారూ అంటూ ప్రకాష్ రాజ్ ప్రేమగా పిలుచుకునే తన అర్థాంగిని రోడ్డుపాలు చేసి చంపడం, ఇటు అదే ప్రకాష్ రాజ్ ప్రాణాప్రాణ హితుడికి నిద్ర మాత్రలిచ్చి చంపడం మినహా సినిమాలో ఏమీలేదు! ఏమిటో, అంతా అయోమయం జగన్నాథం!
Share this Article