నాకు లారెన్స్ అంటే ముచ్చటేస్తుంది… రాఘవేంద్రుడి మహత్తుతో బ్రెయిన్ కేన్సర్ నుంచి బయటపడ్డాననే భక్తితో తన పేరులో రాఘవ కూడా కలుపుకున్నాడు… ప్రభుదేవాకు దీటైన డాన్సర్… ఎవరెలా పోతేనేం, తనకంటూ ఓ సెక్షన్ ప్రేక్షకులుంటారు… కాంచన టైపు థ్రిల్లర్లు అలా అలా అలవోకగా తీసేసి వదులుతాడు… చూసేవాడు చూస్తాడు… మినిమం గ్యారంటీ సినిమాలు… ఎప్పుడూ ఏదో టీవీ చానెల్‌లో కాంచనలు కనిపిస్తూనే ఉంటయ్…
నిజానికి ఇది కాదు తన మీద అభిమానానికి కారణం… సమాజం మీద కన్సర్న్… కరోనా పీరియడ్‌లో సాయాలు గానీ, అంతకుముందు పిల్లల గుండె ఆపరేషన్లకు ఆర్థికసాయం చేయించడం గానీ… తనలో ఓ భిన్నమైన మంచి మనిషి ఉన్నాడని చెబుతాయి… ఇతర దిక్కుమాలిన హీరోల్లాగా పిల్లికి బిచ్చం పెట్టని దరిద్రం కాదు తనది… తనకు చేతనైనంతగా జనానికి సేవ చేసే భాగ్యవంతుడు… ఒక రజినీకాంత్ 1000 కోట్ల ఔదార్యం చూపిస్తే… (అంత సీన్ లేదు)… అందులో వార్తేమీ లేదు… తన అపారమైన సంపద నుంచి కాస్త ఇచ్చాడు అనుకుందాం సమాజానికి…
కానీ లారెన్స్ చిన్న స్థాయి హీరో… అందులోనే పదిమందీ మెచ్చుకునే ఔదార్యం చూపిస్తుంటాడు… అదీ గ్రేట్… సరే, విషయంలోకి వద్దాం… ఇలాంటి లారెన్స్ కూడా తన కాంచన టైపు తన మార్క్ సినిమాల నుంచి బయటికి వచ్చేసి, ఓ సాదాసీదా ఫక్తు రొటీన్ సినిమా చేశాడు… అరె, మన లారెన్స్ సినిమా ఇది, కాంచన నాలుగో పార్ట్ అయి ఉంటుంది అని సినిమాకు వెళ్లారో బుక్కయిపోయినట్టే…
Ads
పెద్దగా చెప్పుకోవడానికి కొత్త కథో, కొత్త కథనమో, ప్రయోగమో, క్రియేటివిటీయో ఏమీ ఉండదు… కొన్ని వందల సార్లు మనం చూసిన సగటు సౌత్ ఇండియా రొటీన్ సినిమాయే… ఓ హీరో, ఓ తల్లి, ఓ ప్రియురాలు, ఓ విలన్… ఫైట్లు, డాన్సులు, పాటలు, ప్రతీకారం… శుభం… రొడ్డకొట్టుడు అంటామే అదే ఇదన్నమాట… ఇలాంటి సినిమాల్లో ఇతర పాత్రధారుల్ని ఎవరూ పట్టించుకోరు… ఇందులో కూడా అంతే…
అప్పుడెప్పుడో మంత్రిగారి వియ్యంకుడు సినిమా అనుకుంటా, పూర్ణిమా భాగ్యరాజ్ అందంగా కనిపిస్తుంది అందులో… మళ్లీ ఇప్పుడు లారెన్స్ తల్లి… తోడుగా నాజర్… లారెన్స్‌కు తోడుగా ప్రియ భవానీశంకర్… నిజం చెప్పాలంటే… ఈ సినిమా గురించి చెప్పడానికి ఏమీ లేదు… జర్నలిస్టు మిత్రుడు జోశ్యుల జోకేసినట్టుగా… మండే ఈ ఎండల్లో కొంతసేపు ఏసీ చల్లదనం ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది సినిమా… కాకపోతే సినిమాలో లీనం కావద్దు… అదీ ముందుజాగ్రత్త… అంతే సుమా…
ఎంతసేపూ తనను కాంచన టైపు హీరోగా ముద్రేస్తున్నారు అనే భయంతో, సందేహంతో, ఆందోళనతో… అర్జెంటుగా ఓ రొటీన్ సినిమా తీసి, నేనూ నేనూ కమర్షియల్ మీటరే అని చెప్పడానికి చేసిన ప్రయత్నం రుద్రుడు సినిమా… అలాగని పూర్తిగా నాన్-కాంచన సినిమా తీసేసి నిరాశపరిస్తే ఎలా లారెన్స్… తప్పు కదూ… మరీ ఈ రుద్రుడు ఏదో టైంపాస్ పల్లీ వ్యవహారంలా ఉంది…!!
Share this Article