ఓ మిత్రుడి వెటకారం… బీపీ ఉంటే, ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటే సాక్షి, నమస్తే తెలంగాణ చదవాలి… రెండు రాష్ట్రాలూ పచ్చగా, శాంతి సౌఖ్యాలతో అలరారుతున్న భ్రమల్లో పడిపోతామ్… ఈమధ్య బీజేపీ మీద పడి ఏడుస్తున్నారు గానీ నమస్తే చదివితే అంతా పాజిటివిటే… గుళ్లో కూర్చుని ఎవరో ఎవరికో స్తుతిపాఠం పాడుతున్న ఫీల్ ఉంటుంది… సాక్షి కూడా అంతే కదా, జస్ట్, చంద్రబాబు మీద ద్వేషవిషాన్ని వదిలేస్తే ఆంధ్రా ఎంత అద్భుతంగా ఉద్దరించబడుతుందో కళ్లకుకట్టినట్టే ఉంటుంది…
మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి… ఇదుగో త్వరలో ప్రళయం రాబోతోంది… ఎటు చూసినా వినాశనం, అవినీతి, అక్రమం అంటూ ఫుల్లు నెగెటివ్ వైబ్స్ ప్రసారం చేస్తుంటాయి… దీనికితోడు టీవీ5 అనబడే మరో పేరెన్నికగన్న ప్రముఖోత్తమ చానెల్ ఉండనే ఉంది కదా… వాటిల్లోనూ ఆంధ్రజ్యోతి కాస్త డిఫరెంట్… గాలి పోగేసి వార్తల్ని వండగలదు అది… ఈరోజు ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలోని రెండు మూడు ప్రధాన వార్తలు చదివితే… త్వరలో మోడీ ముగ్గురు ముఖ్యమంత్రులను జైలుకు పంపించబోతున్నాడనే భ్రమల్లోకి నెట్టేయబడతాం…
Ads
ఎవరా ముఖ్యమంత్రులు..? 1) కేజ్రీవాల్ 2) జగన్ 3) కేసీయార్… ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆల్‌రెడీ కేసీయార్ బిడ్డ ఇరుక్కుని ఉంది కదా… ఇప్పుడు కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచారు… 9 గంటల్లో 56 ప్రశ్నలు వేశారట… అందులో కీలకమైన ప్రశ్న… కేసీయార్‌తో లింకేంటి..? ఇప్పటికే వాడెవడో ఆప్ చెబితే బీఆర్ఎస్ ముఖ్యులకు కిలోలకొద్దీ నెయ్యి సప్లయ్ చేశానని చెబుతున్నాడు కదా… నెయ్యి అనగా కరెన్సీ అని అర్థం… సీబీఐ విచారణలో కేజ్రీవాల్‌కు ఎదురైన ప్రశ్నల్లో కేసీయార్‌తో తన సంబంధాల మీదే స్ట్రెస్ చేశారట…
పంజాబ్ ఎన్నికల కోసం కేసీయార్ ఆప్‌కు సహకరించాడా..? ఇదీ కీలకప్రశ్న… నాన్ బీజేపీ పార్టీలకు పలు ఎన్నికల కోసం కేసీయార్ ఇబ్బడిముబ్బడిగా సాయం చేస్తున్నాడనేది కదా బీజేపీ సందేహం… సీబీఐ ప్రశ్నలూ అదే రీతిలో సాగాయి… అంతేనా..? ఈమధ్య రాజదీప్ సర్దేశాయ్ ‘‘నాన్ బీజేపీ ప్రతిపక్ష కూటమికి తనను లీడర్‌ను చేస్తే మొత్తం ప్రతిపక్షాల ప్రచారవ్యయం నేను భరిస్తా’’ అని కేసీయార్ ఆఫర్ ఇచ్చాడనే బాంబు పేల్చాడు…
కేజ్రీవాల్ ఇంటరాగేషన్ పూర్తిగా కేసీయార్ సెంట్రిక్ సాగినట్టు ఆంధ్రజ్యోతి వార్త సారాంశం… ఈ వార్తను సీరియస్‌గా చదివితే మోడీ సీబీఐను ముందుపెట్టి… ఒక్క దెబ్బకు ఇద్దరు సీఎంలు అన్నట్టుగా కేజ్రీవాల్‌ను, కేసీయార్‌ను కొట్టబోతున్నాడనే భ్రమలకు మనం గురికావడం తథ్యం… అబ్బే, కవితనే అరెస్టు చేయలేని మోడీ ఇక కేసీయార్‌ను జైలులో పెడతాడా..? అంత సీనుందా తనకు..? అంత దమ్మున్న మోడీ అయితే వ్యవసాయ చట్టాల మీద క్షమాపణలు చెప్పి, ఖలిస్థానీ శక్తులకు దాసోహం అంటాడా అనేదేనా మీ ప్రశ్న… ఏమో… ఆంధ్రజ్యోతి వార్తల తీవ్రతను బట్టి కేజ్రీవాల్‌ను, కేసీయార్‌ను లక్నో జైలుకు పంపిస్తాడనే రేంజు కనిపిస్తోంది…
మూడో సీఎం జగన్… తమకు ఇష్టమైన వార్త కాబట్టి కాస్త మసాలా దినుసులు ఎక్కువ వాడి, వంటను రుచికరంగా, స్పైసీగా చేయడానికి ఆంధ్రజ్యోతి చాలా కష్టపడింది… వరల్డ్ ఫేమస్ చెఫ్… జగన్ భార్య భారతి మేనమామ, ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని, జగన్ బాబాయ్ వివేకా హత్య కేసులో అరెస్టు చేశారు కదా… జగన్ తన ప్రధాన ప్రత్యర్థిగణంగా భావించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 క్యాంపుల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నట్టుంది… అయితే ఆంధ్రజ్యోతి కథలు, కథనాలు తీరు వేరు…
వివేకా హత్య కేసులో మోడీ జగన్‌కు ఏమీ సహకరించడం లేదు… ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి కప్పం కట్టొచ్చినా మోడీ కరుణించడం లేదు… సీబీఐ నిర్దాక్షిణ్యంగా భాస్కర్‌రెడ్డిని లోపలేసింది… అవినాష్‌రెడ్డినీ వదిలే సూచనల్లేవు… అంతేకాదు, ఇది తననెక్కడ చుట్టుకుంటుందో అని జగన్ భయపడిపోయాడా..? న్యాయవ్యవస్థను కూడా మేనేజ్ చేయగల ఓ జ్యోతిష్కుడు టైపు దళారీని బెంగుళూరు నుంచి రప్పించి, మొత్తం బాధ్యతను తనకు అప్పగించాడట… వివేకా హత్య కేసు నుంచి బయటపడేయండి అని అర్ధిస్తున్నాడట… వావ్, చూడబోతే కేసీయార్, కేజ్రీవాల్, జగన్‌లను అస్సోం, గౌహతి సెంట్రల్ జైలుకు మోడీ పంపించబోతున్నాడన్నంతగా కథనాలు భలే వండబడ్డాయి…!!
అవునూ, ఈ చింతా శశిధర్ ఎవరు..? నవయుగ పోర్టు మాజీ ఎండీ అట… ఈయన సోదరుడు రామోజీరావుకు సమీప బంధువట… పెద్ద పెద్ద వాళ్ళతో సన్నిహిత సంబంధాలున్నాయట… జగన్ క్లాస్ మేట్ అంటారు… ఆయన సదరు కన్నడ దళారీ విజయకుమార్‌ను పట్టుకొచ్చాడట ప్రత్యేక విమానంలో… ఈ దళారీ కమ్ జ్యోతిష్కుడికి మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా ఆధ్యాత్మిక, పూజాసంబంధాలున్నాయట… సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఇటీవలి తెలుగు గుళ్ల సందర్శనకూ ఆయన వెంటే ఉన్నాడట… మస్తు ‘ప్రభావశీలి’ అట… అబ్బో, అబ్బో…!!
Share this Article