Vijayakumar Koduri……….. ఏ ఒక్కరి ఆకలీ మరొకరి ఆకలిలా వుండదు… ‘ప్రతి మనిషికీ ఆకలి వుంటుంది, ఏ ఒక్కరి ఆకలీ మరొకరి ఆకలిలా వుండదు’ తన దగ్గర పని కోసం వచ్చిన కొత్త పిల్ల ‘ఓయ్’ తో అంటాడు థాయ్ ల్యాండ్ మహానగరం బ్యాంకాక్ లోని ఐదు నక్షత్రాల కిచెన్ ‘హంగర్’ చీఫ్ షెఫ్ ‘పాల్’.
‘ఒక మనిషి తినే తిండిని బట్టి సమాజంలో ఆ మనిషి స్థాయి ఏమిటో చెప్పొచ్చు’ అని నమ్మే మనిషి ఈ చీఫ్ షెఫ్ పాల్.
(యు ఆర్ వాట్ యు ఈట్ – అన్న ఫ్రెంచ్ మాట గుర్తుకొచ్చిందా?)
Ads
ఓయ్ – అప్పటిదాకా బ్యాంకాక్ మహా నగరంలోని ఒక మూలనున్న వీధిలోని తమ ఇంటి నుండే ఒక చిన్న నూడుల్స్ రెస్టారెంట్ నడుపుకుంటూ ఉంటుంది. ఇంటికి పెద్ద కూతురు. తల్లి లేదు. తమ్ముడు, చెల్లి, తండ్రి. నానమ్మ నుండి తండ్రి ద్వారా నేర్చుకున్న ‘ఫ్రై నూడుల్స్ వంటకం’ ఆ పిల్ల స్పెషల్. ఆ వంటకం కోసమే ఆ వీధి చుట్టు పక్కల నివసించే పేద, మధ్య తరగతి వాళ్ళు ఆ పిల్ల రెస్టారెంట్ కి వస్తూ వుంటారు.
‘ఓయ్ వంటలు ప్రేమతో చేస్తుంది కాబట్టి వాటికి అంత రుచి’ అన్నది అక్కడి కస్టమర్ల అభిప్రాయం.
ఓయ్ కి జీవితంలో వున్న అవసరాలు పెద్దవి.
ప్రేమ తో చేసే వంటలు పెద్ద మొత్తంలో డబ్బులు తేలేవు గదా !
ఓయ్ పనితనం గమనించిన స్టార్ షెఫ్ పాల్ సహాయకుడు ఒకడు ఆ పిల్లను పాల్ టీమ్ లోకి ఆహ్వానిస్తాడు.
పాల్ కు కావలసింది కూడా ఇట్లా పేద వాళ్ళు నివసించే వీధులలో పని చేసిన వంటగాళ్ళే తప్ప, విద్యాసంస్థలలో సర్టిఫికెట్లు సంపాదించి వచ్చిన వాళ్ళు కాదు.
పాల్ అంత సులభంగా ఓయ్ ని టీమ్ లోకి తీసుకుంటాడా ?
రక రకాల పరీక్షలు పెడతాడు. విసిగిస్తాడు. యాతన పెడతాడు. ఓయ్ అన్నింటినీ తట్టుకుని నిలబడుతుంది.
‘ఎందుకు నా హంగర్ టీమ్ లోకి రావాలనుకుంటున్నావు ?’ అని నిలదీస్తాడు.
‘నేను స్పెషల్ గా బతకాలని అనుకుంటున్నాను’ అని స్థిరంగా బదులిస్తుంది ఓయ్.
సన్నగా నవ్వుతాడు పాల్
ఆ పిల్లకు అర్థం కాదు
సినిమా పతాక సన్నివేశాలలో ఒకచోట అడుగుతాడు -‘స్పెషల్ గా ఉండడం అంటే ఏమిటో ఇప్పటికైనా అర్థమైందా?’
* * * * * * * * *
భారతదేశమే కాదు – ప్రపంచమంతా ‘థాయ్ రుచుల’ కోసం ఎగబడుతున్న కాలంలో ఈ ‘హంగర్’ సినిమా అచ్చంగా థాయిలాండ్ నుండి వొచ్చింది. థాయిలాండ్ కిచెన్ నుండి సృష్టించిన కథతో వచ్చింది .
అందంగా అమర్చిన రెస్టారెంట్ టేబుల్స్ పైకి వేడి వేడిగా వడ్డనకు వచ్చే రుచికరమైన పదార్థాల సృష్టి జరిగే కిచెన్ లో హడావుడిగా తిరిగే మనుషుల జీవితాల లోకి, మహా వంటగాళ్ల రాజకీయాల లోకి, వాళ్ళను ముందు పెట్టి స్టార్ రెస్టారెంట్లు నడిపే వ్యాపారవేత్తల చదరంగం ఆటలోకి ప్రేక్షకులను తోడ్కొని వెళ్లే సరికొత్త సినిమా ఈ ‘హంగర్’ (గతంలో ఇటువంటి కథాంశంతో ఒకట్రెండు సినిమాలు వచ్చినా ఈ సినిమా ప్రత్యేకత ఈ సినిమాదే )
‘మనం పెద్ద రెస్టారెంట్స్ లో సువాసనల కోసం, గొప్ప రుచుల కోసం ఉపయోగించే దినుసులన్నీ పేద వాళ్ళ వంట గదుల నుండి దొంగిలించినవే’ అంటాడు పాల్ ఒక సన్నివేశంలో.
‘తిండిని హాయిగా ఆస్వాదిస్తూ తినేది పేదవాళ్ళే. ఈ బాగా డబ్బులున్న వాళ్ళు తమ హోదా చూపించుకోవడం కోసం నా వంటి ఖరీదైన వంటగాళ్లను ఆహ్వానిస్తారు. తిండి కోసం ఈ డబ్బులున్నవాళ్ళు నా ముందు నిలబడడం ఒక వెర్రి సంతోషాన్ని ఇస్తుంది నాకు. షెఫ్ గా పెద్ద పేరు సంపాదించాలంటే, నీ ప్రత్యేకత ఏదో నువ్వు చేసే వంటలలో వుండాలి’ అంటాడు మరొక సన్నివేశంలో.
* * * * * * * * * * *
ఇంతకూ, ఓయ్ స్టార్ హోటల్ రెస్టారెంట్ల బరిలో నిలబడిందా ? నిలబడి గెలిచిందా ?
గురువు పాల్ ను మించిపోయిందా ?
కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ నక్షత్రాల కాంతి ఓయ్ ను ఎక్కడిదాకా తీసుకుని వెళ్ళింది ?
ఆసక్తి ఉంటే చూడండి –
థాయిలాండ్ సినిమా ‘హంగర్’ – ‘నెట్ ఫ్లిక్స్’ లో !
‘ఓయ్’ గా వేసిన పిల్లతో ప్రేమలో పడకుండా వుండలేరు
‘అవునూ – ఈ సినిమా థాయ్ స్టార్ రెస్టారెంట్స్ కిచెన్ గురించి మాత్రమేనా …. బియాండ్ దట్ ఇంకా ఏమైనా చెప్పిందా ?’ అని ఆలోచనలో పడిపోతారు !
Share this Article