మొత్తం సౌత్ ఇండియా సినిమాను హిందీలోకి డబ్ చేసుకో… హిందీ ప్రేక్షకులు కూడా సంతోషంగా చూస్తారు… అది సౌత్ ఇండియా మూవీగానే చూస్తారు… కేజీఎఫ్, విక్రమ్, కాంతార, చార్లి, ఆర్ఆర్ఆర్, కార్తికేయ ఎట్సెట్రా సినిమాలు అన్నమాట… అదేసమయంలో ఈ ట్రెండ్‌ను తప్పుగా అర్థం చేసుకుని, సౌత్ ఇండియా మసాలాలు గుప్పిస్తే తప్ప హిందీ సినిమాను చూడరు అనుకుని, వాతలు పెట్టుకుంటే మాత్రం ఇటు సౌతూ సహించదు, అటు నార్తూ భరించదు… ఎస్, సల్మానుడి కొత్త సినిమా అందుకే రెంటికీ చెడ్డ రేవడి అయిపోయింది…
అటు దిక్కుమాలిన పఠాన్ వందల కోట్లను మింటింగ్ చేసుకోగా, షారూక్‌కు దీటైన పాపులారిటీ ఉన్న సల్మానుడు బోల్తా కొట్టాడు… పోతేపోనీ, సల్మాన్ సినిమా పాసయితే ఎంత, ఫెయిలయితే ఎంత..? కానీ మధ్యలో వెంకటేశ్ ఇజ్జత్ మరోసారి పోయింది… అసలే బూతులు, వెగటు సీన్లతో ఆ వెబ్ రానానాయుడితోనే తన పరువు పాతాళంలోకి దిగిపోయింది… ఇప్పుడు సల్మాన్ సినిమాలో సైడ్ కేరక్టర్‌తో పాతాళంకంటే కిందకు జారిపోయింది…
అసలు అది కాదు మనకు చిర్రెక్కించేది… నార్త్ వాడికి సౌత్ అంటే కేవలం మద్రాసే… వాడికి తెలిసింది కేవలం లుంగీ, సాంబార్… అందుకే ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ లుంగీలు… డాన్సులు లుంగీ డాన్సులు… పోనీ, వెంకటేశ్, రాంచరణ్‌కు తెలియదా తెలుగు అంటే, ప్రత్యేకించి తెలంగాణ అంటే లుంగీలు, సాంబర్ సంస్కృతి కాదని… వాళ్లు కూడా లుంగీలు పైకి మడిచి పిచ్చి స్టెప్పులు వేసి, తెలంగాణ పరువును కూడా తీసేశారు… బతుకమ్మ పాటలో గొబ్బెమ్మలు, లుంగీల ఇకారాన్ని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా…
Ads
తీరా సినిమా చూస్తే అదో రకరకాల పిచ్చిల మేళవింపులా ఉంది… గతంలో తమిళంలో హిట్టయిన వీరం సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్ కాటమరాయుడిగా తీశాడు… తన రేంజుకు కాటమరాయుడు ఫ్లాప్ కిందే లెక్క… కన్నడంలోనూ తీశారు 2019లో… అక్కడా పెద్దగా క్లిక్ కాలేదు… ఇప్పుడు అదే కథను సల్మానుడు తీశాడు… ఓ ముదురు బ్రహ్మచారి, ఎంతకీ పెళ్లిచేసుకోడు, హఠాత్తుగా ఏ పూజా హెగ్డేనో చూసి మనసు పారేసుకుంటాడు… కానీ పూజ అన్నకు అది నచ్చదు… అదే కథ… వందలసార్లు చూసేసి, చీదేసిన కథ…
చివరకు రివ్యూల తొలికోడి కూత ఉమైర్ సంధూ అయితే దీన్నొక పారాసెటమాల్ సినిమా అన్నాడు… సినిమా చూస్తుంటే మనకూ అదే అనిపిస్తుంది… పూజా హెగ్డేకు అన్నీ వరుస పరాజయాలే… మరొకటి జతచేరింది… సల్మాన్ కూడా ఎంతకూ ఓ విగ్రహం కళ్లద్దాలు పెట్టుకుని కదిలి వస్తున్నట్టుగా ఉంటాడు తప్ప వీసమెత్తు వేరియేషన్ ఉండదు… పైగా లుంగీలు ఎత్తిపట్టుకుని చేసే వెకిలి స్టెప్పులో మహిళా తారల్లాగా, మగ వ్యాంప్‌లాగా తొడల ఎక్స్‌పోజింగ్… నాలుగేళ్ల విరామం తరువాత ఇదీ సల్మాన్ నటించిన సినిమా పరిస్థితి…
పలుచోట్ల సీరియస్ సీన్లు సైతం కామెడీగా మారిపోయిన తీరు సినిమాపై జాలిని కలిగిస్తుంది… పాటలు సరిగ్గా లేక, బీజీఎం సరిగ్గా లేక, పాత్రల కేరక్టరైజేషన్ సరిగ్గా లేక, డైలాగులు సరిగ్గా లేక… సినిమాయే సరిగ్గా లేక సల్మాన్ చాలా నిరాశపరిచాడు… ప్చ్…
Share this Article