‘‘నేనే భారీ ప్రాజెక్టుల డిజైన్లు గీస్తా, కాంటూరు లెవల్స్ లెక్క తీస్తా, నేనే బిల్డింగుల ప్లాన్లు గీస్తా, నేనే బడ్జెట్ రాసిస్తా, నేనే కృష్ణాజలాల కోసం కోర్టులో వాదిస్తా…’’ వంటి మాటలేమీ మాట్లాడలేదు తమిళనాడు సీఎం స్టాలిన్…. ‘‘కంప్యూటర్ కనిపెట్టింది నేనే, సెల్ ఫోన్ తీసుకొచ్చింది నేనే…’’ వంటి డొల్ల మాటలూ మాట్లాడలేదు… ఆర్థిక శాఖకు త్యాగరాజన్‌ను మంత్రిగా చేశాడు… జైశంకర్‌ను మోడీ విదేశాంగ మంత్రిని చేసినట్టు… బీఈ, ఎంటెక్, ఎంబీఏ చదివిన మాజీ ఇండియన్ సర్వీస్ అధికారి అశ్వినీ వైష్ణవ్‌ను రైల్వే మంత్రిని చేసినట్టు…!
త్యాగరాజన్ తక్కువ వాడేమీ కాదు… 1936లో మద్రాస్ ప్రెసిడెన్సీకి పీటీ రాజన్ అనే ముఖ్యమంత్రి ఉండేవాడు… జస్టిస్ పార్టీకి చివరి అధ్యక్షుడు ఆయన… అదుగో, ఆయన కొడుకు పీటీఆర్ పళనివేల్ రాజన్… ఆయన తమిళనాడు స్పీకర్‌గా, మంత్రిగా కూడా చేశాడు… ఆయన కొడుకు ఈ పీటీఆర్ త్యాగరాజన్… ఈయన Lawrence School, Lovedale లో స్కూలింగ్… తరువాత తిరుచిరాపల్లి (తిరుచ్చి) రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఇప్పుడు ఎన్ఐటీ)లో కెమికల్ ఇంజనీరింగ్ చేశాడు… తరువాత అమెరికా… State University Of New York, Buffalo లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడు… అక్కడే పీహెచ్‌డీ కూడా… MIT Sloan School Of Management లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశాడు… ప్రధాన సబ్జెక్టు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్… పెద్ద పెద్ద సంస్థల్లో కీలకమైన ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ వ్యవహారాలు చూసినవాడే…
Ads
అమెరికన్ యువతి మార్గరెట్‌ను పెళ్లి చేసుకున్నాడు… ఆమె కూడా ఇంజనీరే… పెళ్లి తరువాత, మీనాక్షి అని పేరు కూడా మార్చుకుని తమిళతనాన్ని ఓన్ చేసుకుంది, ఆ కల్చర్‌లో ఒదిగిపోయింది… Lehman Brothers Holdings లో… తరువాత Standard Chartered Bank లో మంచి పొజిషన్లలో పనిచేశాడు త్యాగరాజన్… ఇంత ఉపోద్ఘాతం దేనికీ అంటే… తను ఇప్పుడు తమిళనాట కలకలం సృష్టిస్తున్నాడు…
ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నా మలై డీఎంకే, అన్నాడీఎంకే అవినీతిపరులైన నాయకుల ఆస్తులు, సంపాదనను వరుసగా బయటికి చెబుతున్న తీరు తెలిసిందే కదా… అసలే అవి సంచలనం రేపుతున్నాయి… డీఎంకే 500 కోట్లకు పరువు నష్టం దావాలు కూడా వేసినట్టు వార్తలొచ్చినయ్… సరే, తను ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, తనదైన శైలిలో ‘రాజకీయం’ చేస్తున్నాడు… ‘కడుక్కోవడం’ ఇక ఆ ద్రవిడ పార్టీల ఖర్మ… అయితే ఒకే ఒక ఏడాదిలో స్టాలిన్ అల్లుడు శబరీశన్, కొడుకు ఉదయనిధి 30 వేల కోట్లు సంపాదించారట…
ఈ ఆర్థికమంత్రి పీటీఆర్ త్యాగరాజన్ ఎవరితోనో ఈ సంపాదన గురించి అన్నట్టు ఓ ఆడియో వైరల్ అయిపోయింది ఇప్పుడు… సొంత పార్టీ నేత, అందులోనూ ఆర్థికమంత్రి అలా మాట్లాడటం స్టాలిన్‌కు మింగుడుపడకుండా మారింది… కానీ కిమ్మనడం లేదు… ఈ శబరీశన్ ఎవరో తెలుసా..? స్టాలిన్ ఇద్దరు సంతానం… కొడుకు పేరు ఉదయనిధి… మంత్రి, సినీ నిర్మాత, హీరో… బిడ్డ పేరు సెంథామరై… ఆమెది ప్రేమవివాహం, ఆయన పేరే శబరీశన్…
కరుణానిధికి ముగ్గురు భార్యలు, ఆరుగురు పిల్లలు… వాళ్ల పరివారం… అందరికీ అధికారం అనుభవించాలనే కోరికే… బోలెడు పవర్ సెంటర్స్… అళగిరి, మారన్ అండ్ కో, కనిమొళి తదితరులన్నమాట… ఆమె చెన్నైలోనే ఓ సీబీఎస్‌ఈ స్కూల్ నడిపిస్తుంది… శబరీశన్ కూడా కరుణానిధి బతికి ఉన్నన్నాళ్లూ స్టాలిన్ రాజకీయ వ్యవహారాల్ని పట్టించుకునేవాడు కాదు, భార్య స్కూల్ వర్క్ చూసుకునేవాడు…
కరుణానిధి మరణం తరువాత స్టాలిన్ ముందుగా చేసిన పని పార్టీపై గ్రిప్… తన కుటుంబంలోని పవర్ సెంటర్స్ అన్నీ క్లోజ్ చేశాడు… పార్టీ వ్యవహారాలన్నీ తన ద్వారా మాత్రమే జరిగేలా చూశాడు… ఉదయ్ మీద ఆధారపడే స్థితి లేదు… అప్పుడు వచ్చాడు అల్లుడు శబరీశన్… అనేక వ్యవహారాల్లో అల్లుడి మీద ఆధాారపడాల్సి వచ్చింది స్టాలిన్‌కు… తనకంటూ ఓ నమ్మకస్తుడు కావాలి మరి… వ్యక్తిగతంగా శబరీశన్ కలుపుగోలు… అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ నేతలందరితోనూ బాగుండేవాడు…
గతంలో ఓ ఎన్నికల వ్యూహకర్తను తెచ్చాడు… కానీ ఫలం దక్కలేదు… దాంతో ప్రశాంత్ కిషోర్‌ను పట్టుకొచ్చి, కంట్రాక్టు మాట్లాడింది శబరీశనే… పేరుకు ప్రశాంత్ కిషోర్ అయినా ఎక్కువ ప్రచారవ్యూహం శబరీశన్‌దే… అన్నాడీఎంకే, బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క వోటు కూడా చీలిపోవద్దనే భావనతో లెఫ్ట్, కాంగ్రెస్ తదితర పార్టీలతో పర్‌ఫెక్ట్ కూటమిని ఏర్పాటు చేశారు… ‘స్టాలిన్ వస్తున్నాడు’ వంటి పాటలతో, వీడియో బిట్లతో సోషల్ మీడియాను విపరీతంగా వాడుకున్నారు…
బీజేపీకి తిక్కలేచింది… తనకు అలవాటైన రీతిలో పోలింగుకు అయిదారు రోజుల ముందు శబరీశన్ ఇల్లు సహా పలుచోట్ల ఐటీ దాడులు చేయించింది… డబ్బు పంపిణీ కూడా ఈ ఇంటి నుంచే జరుగుతోంది, కట్టడి చేయాలి అనేది బీజేపీ ప్లాన్… కానీ శబరీశన్‌కు బీజేపీ స్ట్రాటజీలు తెలుసు కదా… ఐటీ రెయిడ్లు చూసి నవ్వుకున్నాడు… డీఎంకేలో గందరగోళాన్ని క్రియేట్ చేయాలనుకున్నది బీజేపీ… కానీ ఐటీ రెయిడ్లు కూడా డీఎంకేకు ఉపయోగపడ్డయ్… అన్నాడీఎంకే, బీజేపీ కూటమి వోట్లు కన్సాలిడేట్ కాలేదు… వాళ్లకు సరైన ప్రచారకర్త కూడా లేడు… కానీ డీఎంకే కూటమి వోట్లు పక్కాగా కన్సాలిడేట్ అయ్యాయి… తెర వెనుక శబరీశన్… తెరపై స్టాలిన్… చివరకు… సీన్ కట్ చేస్తే… సీఎం కుర్చీపై స్టాలిన్..!
ఇప్పుడు ఆర్థికమంత్రికి స్పందించక తప్పడం లేదు… అందుకే తన పేరిట వైైరల్ అవుతున్న ఆడియో కల్పితం అని ట్వీట్ చేశాడు… అయితే ఇక్కడ ఓ విశేషం ఉంది… ‘‘ఆ ఆడియో క్లిప్ విడుదల చేసిన వాడిని విచారించడానికి చాలా సమయం తీసుకుంటుందని, అటువంటి వారిపై చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటే వచ్చే ప్రయోజనాలు, దాని కోసం తాను వెచ్చించే సమయంతో పోలిస్తే వేస్ట్ అన్నాడు… అంతే కాక, ఈ చర్య ఆ ఆడియో క్లిప్ కి అనవసరమైన ప్రచారం కూడా ఇస్తుందని చెప్పాడు… ఒక పరిధి దాటి ఇటువంటి క్లిప్‌లు వస్తే, తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను అని హెచ్చరించాడు…
అంటే… ఒకవేళ ఆ ఆడియో క్లిప్ నిజమేనని బయటకు తేలితే… ఫోరెన్సిక్ పరీక్ష దాన్నే నిగ్గుతేలిస్తే ఇటు ఆర్థికమంత్రితోపాటు అటు ముఖ్యమంత్రి కూడా ఊబిలో దిగబడినట్టే… అందుకే ఇలా తప్పించుకుంటున్నాడన్నమాట… ఆర్థికమంత్రి వెనుకంజ వేయడంతోనే ఆ ఆడియోలో మాటలు తనవే అనే నిజాన్ని పరోక్షంగా చెబుతున్నట్టు లెక్క… ఈ ఆడియో క్లిప్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నా మలై కూడా షేర్ చేశాడు… ఓ మాజీ ఐపీఎస్ అధికారి ఆయన… ఫేక్ ఆడియో షేర్ చేస్తే శిక్షలు ఏమిటో తనకు తెలుసు, ఐనా షేర్ చేశాడంటే… ఏదో ఉంది… ఈ ఆడియో క్లిప్ షేర్ చేయడంపై డీఎంకే ముఖ్యులు గప్‌చుప్… ఏ ప్రాంతీయ పార్టీని చూసినా ఇవే కంపు కథలు… ఈ విషయంలో నితిశ్, నవీన్ పట్నాయక్ మాత్రమే మినహాయింపు… అంతే…
Share this Article