Murali Buddha…….. నన్నపనేని రాజకుమారి భయపడిన వేళ …. ఓ జ్ఞాపకం …… 83 తెలుగుదేశం బ్యాచ్ మహిళా నాయకులు రాజకీయాల్లో ఓ సంచలనం … ఈ బ్యాచ్ టీడీపీ ద్వారా వచ్చినా అన్ని పార్టీల్లో ఓ వెలుగు వెలిగారు . ఆంధ్రలోనే కాదు …. తెలంగాణలోనూ .. మూలాలు ఆంధ్ర ఐనా కాట్రగడ్డ ప్రసూన , గడ్డం రుద్రమ దేవి వంటి వారు తెలంగాణాలో ఆ కాలంలో వెలిగి పోయారు ..
భయం అనేది నా డిక్షనరీ లోనే లేదు అని బాలకృష్ణ లాంటి వారు సినిమా డైలాగులకు పరిమితం కానీ 83 బ్యాచ్ టీడీపీ మహిళా నేతలు ఆచరణలో చూపారు … వీరు టీడీపీ , కాంగ్రెస్ , ప్రజాస్వామ్య తెలుగు దేశం ఎక్కడున్నా పాలలో నీళ్లలా కలిసి పోయారు . ఆడపడుచు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగినంత ఈజీగా కాంగ్రెస్ టీడీపీ రెండూ తమ పుట్టిల్లులే అని స్వతంత్రంగా తిరిగే వారు . కాంగ్రెస్ లో ఉంటే టీడీపీలోకి, టీడీపీలో ఉంటే కాంగ్రెస్ అధికార కక్ష్య లోకి పాద రసంలా దూసుకెళ్లేవారు …
బాబు సీఎంగా ఉన్నప్పుడు… ఓసారి అసెంబ్లీ సమావేశాల్లో బాబు తన ఛాంబర్ వద్ద ఉన్నారు … ఎప్పటి మాదిరిగానే బీట్ రిపోర్టర్లు లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే, ఆపేసి ఎవరినీ అనుమతి ఇవ్వడం లేదని సెక్యూరిటీ ఆఫీసర్ అన్నారు … కొద్దిసేపటి తరువాత కొమ్మినేని , రాధాకృష్ణ వస్తే, వారినీ ఆపేసి, నాకు ఎవరైనా ఒకటే అన్నట్టు బడుగు జర్నలిస్ట్ ల వైపు సెక్యూరిటీ అధికారి విజయ గర్వంతో చూశారు …
Ads
సాయికుమార్ పొలీస్ డైలాగు అంత స్ట్రిక్ట్ గా కనిపించాడు ఆ అధికారి … అందరం ఛాంబర్ బైటే నిలబడ్డాం … ఇంతలోనే కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న రాజకుమారి దూసుకొచ్చి అక్కడో అధికారి ఉన్నాడు అనే ద్యాస కూడా లేకుండా పక్కకు తోసి ఛాంబర్ లోకి వెళ్లారు .. అధికారి మమ్ములను చూడనట్టే ఎటో చూడసాగాడు … లోపలికి ఎంత స్పీడ్ గా వెళ్లిందో అంతే స్పీడ్ గా ఆమె బయటకు వచ్చి , బయట పేపర్లతో ఏదో పని కోసం వచ్చిన వ్యక్తి చేయి పట్టుకొని లోనికి లాక్కెళ్ళింది … అధికారి జర్నలిస్ట్ లను చూసి ఓ వెర్రినవ్వు నవ్వాడు … ఆమె చదివింది ఐదో ఆరో తరగతి, కానీ మనకెవరికీ లేని ధైర్యం ఉంది . ఆమె దూసుకెళ్లినట్టు మనం ఎవరం దూసుకెళ్లలేం, లేం అని నేను అంటే ఓ నేత ఆమె చదువుకోలేదు కాబట్టే అలా దూసుకెళ్ల గలిగింది … అదే చదువుకొంటే మనలా ఇలా బయట ఉండేది అన్నారు …
ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి ఆమె టీడీపీలో చేరారు . 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీడీపీ అధికార ప్రతినిధిగా రోజూ తిట్ల దండకం … కాంగ్రెస్ అభిమానులకు అధికారంలోకి వచ్చాము అనే ఆనందం కూడా లేకుండా పోయింది … Ysr కు సన్నిహితంగా ఉండే రవి చంద్ బాగా ఆలోచించి మందు కనిపెట్టాడు … అప్పటికప్పుడు గంగా భవానిని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా నియమించేలా చేశారు …
ఇద్దరూ 83 టీడీపీ బ్యాచ్ మేట్స్ … క్లాస్ మేట్స్ , బ్యాచ్ మేట్స్ మాత్రమే కాకుండా ఒకే స్కూల్ లో రాజకీయ పాఠాలు నేర్చుకున్న వారు …. బంజారా హిల్స్ లో ఉన్న నన్నపనేని రాజకుమారి ఇంటి పైకి గంగా భవాని తన మహిళా అనుచరులతో కలిసి వెళ్లి దాడి చేసింది … దమ్ముంటే బయటకు రా తేల్చుకుందాం అని గంగా భవాని తొడగొట్టి సవాల్ చేశారు … అప్పటి వరకు సవాల్ చేయడం అంటే ఎవరి పార్టీ కార్యాలయంలో వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆవేశం తెచ్చుకొని తిట్టడమే , కానీ ఇలా ఓ మహిళా నేత ఇంటికి మరో మహిళా నేత అనుచరులతో వెళ్లి దాడి చేయడం అదే మొదటి సారి కావడంతో నన్నపనేని భయపడి పోయారు …
పెదరాయుడు సినిమాలో పెదరాయుడుతో అతని ఉద్యోగి ‘‘ఏదైతే చూడకూడదు అనుకున్నానో అది చూశాను అయ్యగారు’’ అన్నట్టుగా డైలాగును పైకి చెప్పక పోయినా మీడియాగా మనసులోనే ఆ డైలాగు చెప్పుకున్నాం … కొద్ది సేపటి తరువాత పోలీసులు వచ్చి పరిస్థితి అదుపులోకి తెచ్చారు . నన్నపనేని భయపడింది అదే తొలిసారి . ఒక మహిళా నాయకురాలిపై అనుచరులతో మరో మహిళా నేత దాడి చేయడం అదే మొదటి సారి అదే చివరి సారి …
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్టు …. రవి చంద్ నన్నపనేని అనే వజ్రాన్ని గంగా భవాని అనే వజ్రంతో ….. బురదలో ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసినా , పోలీసులను తల్లి బిడ్డ చెంపదెబ్బలు కొట్టినా బోలెడు ప్రచారం లభిస్తుంది మీడియాలో …పాత సిలబస్ తో రాజకీయం చేసే వారు ఇలాంటి వాటికి మురిసి పోతారేమో కానీ…. ప్రజలు మాత్రం ఈ రాజకీయాలను ఇష్టపడడం లేదు .. రాజకుమారి , గంగా భవానిల రాజకీయానికి కాలం చెల్లింది … వారికి ఎప్పుడో తెలిసింది . మిగిలిన వారికి ఎన్నికల తరువాత తెలుస్తుంది …
ఓసారి రాజకుమారి నన్నపనేని నవరత్నాలు అని తొమ్మిది పుస్తకాలు రాసి ఫైనల్ చేసే ముందు చూడమని ఇస్తే కొద్ది సేపు చూసి వెనుక వైపు కవర్ పేజీలో పెద్ద తప్పు ఉంది అన్నాను … ఏదీ ఏదీ అని అడిగితే ఆమె పుట్టిన తేదీ చూపా… అప్పుడు ఆమెకు 55 …. బుక్ లో 55 అని ఉంది … మీకు 40 ఏళ్లే కదా అంటే ఎంత మురిసిపోయారో …. ఇంకో ఆరు నెలల పాటు సోర్స్ గా ఉండేందుకు ఈ డోస్ పని చేస్తుంది అనుకున్నాను …
Share this Article