ఇలా జగన్ బటన్ నొక్కుతాడు… అలా వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి చేరిపోతాయి… అనేక పథకాలతో లక్షల కోట్లను పంచిపెట్టిన జగన్ సర్కారుకు ఓ చేదు మరక ఈ కేసు… బటన్ సర్కారుకు ఈ అమానవీయ దృక్పథం ఏమిటనే ప్రశ్న మనల్ని విస్మయంలో పడేస్తుంది… ఈ కేసులో హైకోర్టు తీర్పును అభినందించాలని అనిపిస్తుంది… వివరాల్లోకి వెళ్తే…
చిత్తూరు జిల్లా, కుప్పం మునిసిపాలిటీ, గుల్లెపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రం… ఫిబ్రవరి 22న ఓ బాలిక మరణించింది… అంతకుముందు ఇదే కేంద్రంలో పంపిణీ చేసిన కోడిగుడ్డు తిని అస్వస్థతకు గురై, హాస్పిటల్‌లో చేర్చినా ఫలితం లేకుండా పోయింది… నిజానికి ఒక చెడిపోయిన కోడిగుడ్డు తింటే ప్రాణాలు పోతాయా..? అంత ప్రమాదకరమా..? అసలు ఆ బాలిక మరణానికి అదే కారణమా..? ఇవేవీ తేల్చుకునే ప్రయత్నం జరగలేదు… పత్రికల్లో వచ్చిన వార్తలను చదివి, స్పందించి, మానవహక్కుల కమిషన్ ఈ కేసు టేకప్ చేసింది…
కోడిగుడ్ల పంపిణీలో, మరణానంతర కారణాల అన్వేషణలో స్త్రీ శిశుసంక్షేమ శాఖ వెయ్యి శాతం నిర్లక్ష్యం ప్లస్ వైఫల్యం… విచారణ జరిపిన హెచ్ఆర్సీ ఈ జనవరి 31న ఓ తీర్పు వెలువరించింది… మరణించిన ఆ బాలిక తల్లిదండ్రులకు 8 లక్షల పరిహారం చెల్లించాలనేది తీర్పు సారాంశం… వాస్తవంగానే సదరు ప్రభుత్వ శాఖ లెంపలేసుకుని, పరిహారం చెల్లిస్తే సరిపోయేది… నిజానికి ఎంత పరిహారం చెల్లించినా సరే, ఆ బిడ్డ ప్రాణం తిరిగి తీసుకురాలేరు కదా…
Ads
ఈ శాఖకు మంత్రి ఉన్నారో లేదో తెలియదు… ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏం పనిచేస్తున్నారో సరైన సమీక్ష కరువైంది కదా… ఓ అమానవీయ నిర్ణయం తీసుకుంది… హెచ్ఆర్సీ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది ప్రభుత్వం… చేయకుండా ఉండాల్సింది… అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం ఏమని వాదించిందో తెలుసా..?
‘‘పరిహారం చెల్లించాలని హెచ్ఆర్సీ ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధం… ఈ కేసులో అధికారుల నిర్లక్ష్యం ఏమీ లేదు… జస్ట్, ఇదంతా యాక్ట్ ఆఫ్ గాడ్… అంటే దేవుడి నిర్ణయం, చర్య మాత్రమే…’’ ఇదీ రాష్ట్ర ప్రభుత్వ వాదన… మతిమాలిన వాదన… హైకోర్టు కూడా సీరియస్ కామెంట్స్ చేస్తూ… ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది…
‘‘ఈ వ్యాజ్యం వేయకుండా ఉండాల్సింది… దీనివల్ల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే మీ ప్రతిష్టే దెబ్బతింటుంది… మీడియా చూస్తోంది, గుర్తుంచుకొండి, జాగ్రత్తగా ఉండండి… నిజానికి హెచ్ఆర్సీ చెప్పిన 8 లక్షల పరిహారం తక్కువే… మేం ఓ కుక్కకాటు ఘటనలో గతంలో 10 లక్షల పరిహారం ఇప్పించాం… బాలిక మరణించాక పోస్ట్ మార్టం లేదు, ప్రతి అడుగులోనూ అధికారుల నిర్లక్ష్యం ఉంది…’’ అని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది… ఒకరకంగా జగన్ ప్రభుత్వానికి ఓ చెంపపెట్టు ఇది… జగన్ భయ్యా… వేల కోట్లను అలా కళ్లుమూసుకుని పంచిపెట్టడం కాదు, ఇదుగో ఇలాంటి కేసుల్లో మానవీయత ప్రధానం… ప్రభుత్వానికి మానవీయ ధోరణి అవసరం… ప్రతి మరణాన్ని దేవుడి నిర్ణయం అని వదిలేస్తే, మరి రాష్ట్రంలో పేదరికం కూడా దేవుడి నిర్ణయమే కదా, మరి వేల కోట్ల పంపిణీ దేనికి..? తేడా అర్థమవుతోందా..? హైకోర్టు తీర్పు ఆధారంగా కనీసం ఒక్క అధికారినైనా శిక్షించగలవా..? Can you..?
Share this Article