Gopi Reddy Yedula ……. ‘దురాత్మీయ పరామర్శలు’
మనిషికి ఏదైనా ఆపరేషన్ కావడం మంచిది కాదు. అందునా మోకాలుకు అసలే కాకూడదు. నా మోకాలు అరిగింది అని ఎక్సరే చూసిన డాక్టర్లు చెప్పారు. దాన్ని రీప్లేస్ చేయాలి అనికూడా నొక్కి చెప్పారు. ఎందుకు అరిగింది అంటే మటుకు ఎవరూ సరైన కారణం చెప్పలేదు. డాక్టర్లు సరైన కారణం చెప్పలేదు అంటే మా ఆవిడ ఊరుకోదు. నా మెదడు మోకాలులో ఉంది అని మా ఆవిడకు ఏనాడో తెలుసు. అందుకని, నేనే ఓ కారణం చెప్పా.
‘మెదడు ఎక్కువగా వాడడం వల్ల ఇలా జరిగిఉండొచ్చు’ అని. ‘నీ మెదడు మోకాలులో ఉన్నమాట నిజం అయినప్పటికీ, దాన్ని వాడడం అనే కారణాన్ని నేను ఒప్పుకోను’ అని కొట్టిపారేసింది. ఎలా అరిగినా ఉన్న ఆ కాస్త మెదడును కూడా తీసేస్తున్నందుకు మా ఆవిడ సంతోషించింది. (కానీ, ఇంకో కొత్త మెదడును రీప్లేస్ చేస్తున్నారని, అది సూపర్ మెదడు లాగా పనిచేయబోతోందని నేను ఆవిడకు చెప్పలేదు)
Ads
నడుముకు ఎనస్తీషియా ఇచ్చి మోకాలు ఆపరేషన్ చేశారు. నాకు తెలుస్తూనే ఉంది. చుట్టూ 8 మంది ఉన్నారు. కాకపొతే నేను చూడకుండా ఓ పరదాను కట్టారు లగ్గం మీద పెండ్లి పిల్ల కనబడకుండా కట్టినట్టు. ఆపరేషన్ చేసుకుంటూ వాళ్ళు సినిమాల గురించి, వాళ్ళ ప్రేమ వ్యవహారాల గురించి, బోల్డన్ని సీరియస్ విషయాల గురించి డిబేట్ చేసుకున్నారు. నన్ను మర్చిపోయి నా మెదడును కాస్త అటీటు చేయగాల అని నేనే మధ్య మధ్యలో పిలిచి ఏదో అడిగేవాణ్ణి.
రెండు గంటల్లో ఆపరేషన్ చేసి నాకు శుభాకాంక్షలు చెప్పి సంతోషంగా వెళ్లిపోయారు. ఆపరేషన్ అయినంక రెండు మూడు వారాల్లో కాలు 90 డిగ్రీలు వంగాలట. 9 వారాలు అయినా 60 డిగ్రీలు కూడా వంగలేదు నాకాలు. ఏందయ్యా అంటే ‘నువ్వు ఫిజియో తెరఫి సరిగా చేయలేదు’ అని నన్నే దబాయించారు. ‘మరి ఇప్పుడేంది’ అంటే ‘అది వంగేంతమటుకు వంచుతూనే ఉండాలని’ చెప్పారు.
ఇంత జరిగినా నేనేమీ ఫీల్ కాలేదు. కానీ, నా మిత్రుల వల్ల పరిపరి విధాలా వాపోయిన. వాల్లుజేసిన నిర్వాకాలను మీకు జెప్పుతా. వారిని ఏమనాలో మీరే చెప్పాలి. ఇన్నాళ్లు ఓపిక పట్టీ పట్టీ ఇక ఉండలేక సభ్య సమాజంతో నా మనోవేదనను పంచుకోవాలనుకున్నా. ఓ మిత్రునికి ఇలా అయినప్పుడు మిత్రులనేవాళ్ళుంటే వచ్చి మందలిచ్చో, మందులిచ్చో, పండో ఫలమో, త్రుణమో ఫణమో ఇచ్చి పోవడం అనేది మన సాంప్రదాయం కదా. మరి నా మిత్రులు ఏంజేశారో చూడండి.
ఒకడొచ్చాడు. వస్తూ వస్తూ ఓ గుంపును వెంటేసుకొచ్చాడు. వాళ్లెవరో నాకు తెలియదు. ‘ఎలా ఉన్నవురా’ అని అడిగాడు. 10 సెకెండ్ల తరువాత వారి రాజకీయ విజ్ఞాన చర్చ చేసుకున్నారు. నేను కేవలం పారిపోవీలులేని ఓ అజ్ఞాన ప్రేక్షకుణ్ణి. ఓ గంట తరువాత టీ తాగి వెళ్ళిపోయాడు. పొతే పోయాడు. వచ్చేటప్పుడు ఓ పండో ఫలమో తెచ్చాడా అంటే, ఊఁహూఁ.
ఇంకోడొచ్చాడు. ఎవరిదో కారు ఖాళీగా పోతుంది కదా అని వీడొచ్చాడు. సేమ్ టు సేమ్. కారువాళ్ళతో సహా రావడం, టీ తాగడం, పరామర్శించడం, వెళ్లిపోవడం. వీడు పోయేవాడు పోక ‘నేను ఇటేపునుండి వచ్చారా, దారిలో ఏమీ దొరకలేదు’ అని ప్రేమగా నవ్వాడు. ‘పరామర్శ ముఖ్యంగానీ పండ్లూ ఫలాలదేముందిరా’ అని నవ్వాను. వాస్తవంగా నాకు వచ్చిన కోపంలో వాడు మాడి మసై పోవాలి.
ఇంకోడొచ్చాడు. నా బాల్య మిత్రుడు. వాని బాల్య మిత్రులతో కలిసి వచ్చాడు. చాలా సరదాగా మాట్లాడుకున్నాం. నాకు ఇలా అయినందుకు వాడు నిజంగా బాధ పడ్డాడు. వాడి చూపు అర్ధం అయ్యి ఇంట్లో ఉందికదా అని ఓ పెగ్గు ఆఫర్ చేశాను. వాడి బాల్య మిత్రులు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చూస్తుండగానే ఓ బాటిల్ అయిపొయింది. రెండో బాటిల్ ఓపెన్ చేస్తుంటే వద్దన్నారు. వద్దన్నారుగానీ తీసిందాకా వద్దంటూనే ఉన్నారు. ఇంకా సగం బాటిల్ ఉండగా ‘ఇక చాల్లేరా అసలే నువ్వు నొప్పితో బాధపడుతున్నావ్’ అని ముగించారు. పోతూ పోతూ ఆ బాటిల్ ను పట్టుకెళ్ళాడు. ‘దారిలో అవసరం పడుద్దిరా’ అన్నాడు. బాల్యమిత్రుడాయె. చూస్తూ చూస్తూ మర్డర్ చేయలేంగదా.
నేను ఫోన్ చూసేసరికి ఓ మితృడిది 15 నిమిషాలకింద మిస్డ్ కాల్ ఉంది. కాల్ బాక్ చేసిన. ‘యాడున్నవురా ఫోన్ తీయలేదు’ అన్నడు. ‘నేనేడుంటరా? ఇంట్లేనే ఉన్న’ అన్న. ‘అర్రే.. నేను, మన మిత్రుడు ఇద్దరం నిన్ను కలుద్దామనే వచ్చినం. నీ ఇంటి కింద ఉండి ఫోన్ చేసినం. నువ్వు ఫోన్ తీయకపోతే లేవేమో అని వెనక్కొచ్చినం’ అన్నడు. ‘యాడిదాకబోయిండ్రు’ అన్న. ‘బండ్లగూడ దాటినం’ అన్నడు. ‘బండ్లగూడ ఏమన్నా బంగ్లాదేశ్ లో ఉందా. ఎనక్కి రావొచ్చుగా’ అన్నా. ‘లేదులేరా ఓ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మళ్ళీ ఎప్పుడైనా వస్తాంలే’ అన్నాడు. సరేలే అనుకున్నా. ఓ గంట తరువాత వాళ్ళ ఇంపార్టెంట్ మీటింగ్ ఫోటోలు నాకు పెట్టారు. ఇక మండదాండి. బాధ అనిపించదాండి.
యింకోడున్నాడు. చిన్నప్పటినుండీ నా బాగు కోరినవాడు. వాడు రాలేదుగానీ ఫోన్ చేశాడు.’ఎలావున్నావురా’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వరంగల్లులో ఒకాయన పసరుకట్టు కడతాడనిచెప్పాడు. ఆయన ఫోన్ నంబర్ రాసుకునేదాకా వదలలేదు. ఆయన వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయో డాటా ఇచ్చాడు. ఓ అరగంట తరువాత టాటా చెప్పాడు.
అయితే అందరూ అలా ఉండరుగా. అసలైన మొనగాడొచ్చాడు. బాటిల్తోనే బందోబస్తుగా వచ్చాడు. వానెంట ఇంకో దోస్తుగూడా ఉన్నాడు. సంతోషం అయింది. ఫుల్లు కబుర్లతో ఖుషీ అయిన. సగం బాటిల్ కాగానే వాడు దానికి మూతబెట్టేశాడు. ఇంతకంటే ఎక్కువ వద్దురా ఆరోగ్యం పాడైద్దీ అన్నాడు. నాకు ఇంకా సంతోషం అయింది నా ఆరోగ్యంపట్లగూడా వీనికి శ్రద్ద ఉన్నందుకు. నేనుకూడా అంగీకరించాను. వాడు బాటిల్ను జాగ్రత్తగా సంచిలో పెట్టాడు. నేను తరువాత సర్దుతాలేరా అన్నా. వాడు నావైపు చూసి ‘లేదురా, ఇంకోన్ని పరామర్శించేది ఉంది, మల్లోటి యాడగొంటాం’ అని సంచిబట్టుకొని ‘జాగ్రత్తరా’ అనుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇంకోడు ఫోన్జేశాడు. ‘ఎలా ఉందిరా’ అన్నాడు. బానే ఉందిరా అన్నాను. ‘బానే ఉండడం ఏందిరా, నొప్పి బాగుందన్నావ్?’ అని ప్రేమగా మందలింపు టైపులో అడిగాడు. అవునురా అని నేను చెప్పడం మొదలెట్టాను. అర నిమిషం విన్నాక ‘ఐతెమాయెగని, నేను ఫలానావానికాడికి బోతున్న, వానికి ఫోన్జేసి పనిగావాలె అని చెప్పు’ అన్నాడు. నేను హర్ట్ అయి కాసేపు ఆగి ‘సరేరా’ అనాల్సొచ్చింది. ఈ ‘ఐతెమాయెగని’ ఏందండీ? నా నొప్పి వాడికి ఏమాత్రం లెక్కలేదా?. ఆ ముక్కేదో మొత్తం విన్నాక అనిసావొచ్చుగా?.
‘వస్తున్నాం’ అని ఫోన్ చేశారు ఇంకో బాచ్. లొకేషన్ షేర్ చేయమంటే చేశాను. ఓ గంట తరువాత ఫోన్ చేసి ‘నీ ఇంటి చుట్టుపక్కల్నే చూపిస్తుందిరా, కానీ, అడ్రస్ దొరకట్లేదు’ అని మొదలుబెట్టారు. ఓ నలభై అయిదు నిమిషాలు ఫోన్ లైన్లోనే ఉండి, వాళ్ళు ఇంటికి వచ్చిందాకా రూట్ చెబుతూనే ఉండాల్సి వచ్చింది. అసలుకథ ఏందంటే, వాళ్ళు వేరే పార్టీకి పొయ్యి వస్తుండ్రట. అందుకే అడ్రస్ దొరకలేదట. ‘ఎలాగూ ఈడిదాకా వచ్చాంగాబట్టి ఇగ నిన్నుగూడాజూస్తే ఓపనైపొద్దని బ్రహ్మం గాడు అనబట్టి వచ్చాంరా’ అని అన్నాడు. ఇందులో ఎమన్నా ప్రేమ ఏడ్చిందేమో నాకైతే అర్ధం కాలేదు.
ఇంకో బాల్యమిత్రుల బాచ్ ఉంది. వాళ్ళు అసలు చూడ్డానికే రాలేదు. ‘ఏందిరా’ అంటే ‘నిన్ను ఆ స్థితిలో చూడలేమురా, అందుకే రాలేదు’ అన్నారు. నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి వారి ప్రేమకు. కానీ, రోజూ సాయంత్రం ఈ బాచ్ కలవడం పార్టీ చేసుకోవడం. వాళ్ళు పార్టీ చేసుకోవడంలో నాకు ఎలాంటి అభ్యన్తరమూ లేదు. నేను పత్యం ఉంటే ఊరంతా పత్యం ఉంటుందా ఏమిటి. కానీ, వాళ్ళు ఎంజాయ్ చేసిన ఫోటోలు నాకు పెట్టడం ఎందుకు?. సాయంత్రం వాట్సాప్ ఓపెన్ చేయాలంటే భయమైతుంది.
‘నాకెందుకు పెడుతున్రురా’ అంటే, ‘అదేందిరా, మేము ఎంజాయ్ చేస్తే నువ్వు సంతోషపడవారా’ అని ఎదురు కొచ్చనింగ్. ఈ దగుల్బాజీ బాచ్ లో ఒకనికి ఓరోజు నేనే ఫోన్ చేసిన పాణం ఉగ్గబట్టలేక ‘యాడున్నవురా’ అని. ‘ఫలానాదగ్గర పార్టీ ఉంది వెళుతున్నారా’ అన్నడు. నేను కాసేపు ఏమీ మాట్లాడలేదు. ‘నాకు కుదరట్లేదు, నువ్వొక్కసారి మా ఇంటికిరారా నిన్ను పరామర్శించాలనుంది’ అని నిజంగానే బాధపడ్డడు తను రాలేకపోతున్నందుకు.
ఇక స్నేహానికి ప్రతిరూపాలైన, అందుకోసం ప్రాణాలిచ్చే స్నేహమూర్తులు కొందరు ఉన్నారు. ఉదాహరణకు బ్రహ్మం, వెంకన్న, కృష్ణమోహన్, నరసింహారావు, బొలఁగం శ్రీను, శంకర్, యాసిన్, రఘు, కూరెళ్ల శ్రీను, వేముల, సిద్దార్ధ, రాధాకృష్ణ, అనిల్ బత్తుల, యాకూబ్. వీరికి ఏమాత్రం వంకపెట్టలేను. జస్ట్ Unfriend చేయడం తప్ప.
‘మెదడు మోకాల్లో ఉన్నవాడికి అది మార్చకా తప్పదు, మిత్రులున్న వాడికి శోకమూ తప్పదని’ కృష్ణుడు చెప్పే ఉంటాడు కదా? ఇలాంటి గొప్ప మిత్రులున్నందుకు నేను గర్విస్తూనే కళ్లనీళ్లు కుమ్మరించాల్సొస్తుంది. (ఇవన్నీ గమనిస్తున్న మా ఆవిడ “నువ్వూ – నీ మిత్రులూ – మీ సక్కదనం” అనే గ్రంధం రాసింది. గ్రంథావిష్కరణకి మీరందరూ రావాలి)
Share this Article