“దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు కానప్పుడే
వింతల్ మేన చరించనప్పుడె కురుల్ వెల్వెల్లఁ గానప్పుడే
చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!”
ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో అన్నీ గుర్తుంచుకోదగ్గ పద్యాలే. అందులో మంచి పద్యమిది. వయసుడిగి, కాటికి కాళ్లు చాచినప్పుడు కాకుండా…పళ్లూడిపోవడానికి ముందే, శరీరం పట్టుదప్పకముందే, ఒంట్లోకి నానా రోగాలు ప్రవేశించకముందే, మన శరీరం మనకే వింతగా అనిపించడానికంటే ముందే, తల ముగ్గుబుట్ట కావడానికంటే ముందే…కాళహస్తీశ్వరుడి కాళ్లు పట్టుకుంటే ప్రయోజనం ఉంటుంది కానీ…ఇవన్నీ అయ్యాక దేవుడెక్కడున్నాడో వెతుకుదామనుకుంటే…వెతకాలన్న ఆలోచన కూడా రాదు పొమ్మన్నాడు ధూర్జటి.
ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్నులు అని ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో రెండు రకాలు. సుంకాలు వేరు. ఇవన్నీ మాటగా పన్నులే కాబట్టి “దంత జ్ఞానం” అనడానికి వీలు లేదు. నిజానికి పన్ను మాట వ్యుత్పత్తి ప్రకారం “పట్టుకునేదే” పన్ను. పట్టు మాట చివర “ట్టు” భావార్థకంలో “న్ను” అయి “పన్ను” అవుతుంది. పన్ను- దంతం ఏకవచనం; బహువచనం- దంతాలు- పళ్లు.
Ads
పండు- ఏకవచనం; అనేక పండ్లు బహువచనం కూడా పళ్లు. ట్యాక్స్ ఏకవచనం- పన్ను; అనేక ట్యాక్స్ లు బహువచనం- పన్నులు.
“బడ్జెట్లో పళ్లు పెంచారు;
డాక్టర్ పన్నులు ఊడబెరికాడు;
బండి మీద పన్నులు బాగాలేవు…”
లాంటి మాటలు సాధారణంగా వాడుకలో ఉండవు. ప్రభుత్వంతో పాటు పంటి డాక్టరు, వీధిలో బండిమీద పళ్లమ్మేవారు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వేసే పన్నుల గురించి చెప్పాల్సి వస్తే…పన్నూడగొట్టుకోవడానికి ఏ మాట అయితే ఏమి? అనుకుని సర్దుకుపోవడం తప్ప చేయగలిగింది ఉండదు. ఏది చెల్లించే పన్నో, ఏది నోట్లో పన్నో, ఏది మాగిన పండో సందర్భాన్ని బట్టి మనకు తెలిసిపోతూ ఉంటుంది.
ఇంతకంటే తెలుగు వ్యాకరణం, వ్యుత్పత్తి అర్థం, అన్వయాల గురించి తెలుసుకుంటే పళ్లు రాలుతాయి కాబట్టి ఇక్కడికి వదిలేయడం మంచిది.
వ్యాకరణం తెలియకపోయినా…నోట్లో పళ్లు ఉన్నా…లేకున్నా ప్రభుత్వాలకు పన్నులు మాత్రం కట్టాల్సిందే. అప్పుడు ఆ సమాసం పన్ను జ్ఞానం లేదా పన్నుల జ్ఞానమే అవుతుంది. సంపన్నులే పన్నులు కడతారనుకోవడం భ్రమ. ఆపన్నులు కూడా పరోక్ష పన్నులు కడుతూ ఉంటారు. సంపన్నులు, ఆపన్నులు ఇద్దరికీ పన్నులు కామన్. పళ్లూడగొట్టి పన్నులు వసూలు చేసుకోవడం కూడా కామన్.
వీటన్నిటికీ ప్రతీకాత్మకంగా ఒక వయసు వచ్చాక నోట్లో పై దవడ, కింది దవడల్లో రెండు పక్కలా మొలుచుకుని వచ్చేవే జ్ఞాన దంతాలు. జ్ఞానం ఉన్నవారికి, లేనివారికి సమానంగా భగవంతుడు సృష్టి నిర్మాణంలో భాగంగా సహజంగా ప్రసాదించినవే ఈ జ్ఞాన దంతాలు. కొంతకాలానికి లోకజ్ఞానం ఎక్కువై…ఈ జ్ఞాన దంతాలు ఉపయోగం లేనివి అయిపోతాయి. కొండొకచో జ్ఞాన దంతాలు అసలు దంతాలతో గొడవపడుతూ ఉంటాయి. రెండిటి మధ్యా సరిహద్దు గట్ల పంచాయితీలు, అస్తిత్వ పోరాటాలు మొదలవుతాయి. ముందొచ్చిన పాల పళ్ల కంటే వెనకొచ్చిన జ్ఞాన దంతాలే వాడి. దాంతో ఒక దుర్ముహూర్తాన పంటి నొప్పి మొదలవుతుంది. పంటి డాక్టరు దగ్గరికి వెళితే జ్ఞాన దంతాలను తొలగించుకోవాల్సి వస్తుంది. జ్ఞాన దంతాలను తొలగించుకున్నవారిని లోకం అజ్ఞానులుగా పరిగణిస్తుందేమో అనుకుని చాలా మంది జ్ఞాన దంతాల జోలికి వెళ్లరు.
జ్ఞానం అమూర్త వస్తువు. కంటికి కనిపించదు. అంగట్లో దొరకదు. జ్ఞానానికి పరిమితులుంటాయి. అజ్ఞానానం అపరిమితం. అనంతం. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అడుగడుగునా అజ్ఞానమే ఉంటుంది కాబట్టే…
సుప్రభాతమంతా చెప్పి…చివర…
“అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే!” అజ్ఞానంతో నేను చేసిన అనేకానేక తప్పులను క్షమించు! క్షమించు! అని మన చెంపలు మనమే వాయించుకుంటున్నాం.
“ఎన్నడు విజ్ఞానమిక నాకు విన్నపమిదె శ్రీ వేంకటనాథా!” అని అందుకే అన్నమయ్య గుండెలు బాదుకున్నాడు.
భాషలో-
పన్ను- పళ్లు;
పండు- పండ్లు- పళ్లు;
పన్ను- పన్నులు (ట్యాక్స్)
గందరగోళంగా ఉండడానికి-
చెల్లించే పన్నులు గజిబిజిగా ఉండి అర్థం కాకపోవడానికి ఏదో అంతర్గతంగా సంబంధం ఉండి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే…జ్ఞాన దంతాలు రాలగొట్టుకోవాలి.
జ్ఞానం ఎవరికీ ఊరికే రాదు.
కానీ- జ్ఞాన దంతాలు మాత్రం ఎవరికయినా ఊరికే వస్తాయి.
జ్ఞాన దంతాలు తీయించుకోవాలంటే మాత్రం డబ్బులు చెట్లకే కాయాలి!
తల్లి పులి తను కన్న పసి కూనలను నోటితో పట్టుకుని ఒక చోటనుండి మరో చోటుకు ఎలా తీసుకెళుతుందో…అంత జాగ్రత్తగా వ్యాకరణం భాషను పట్టుకోవాలని సిద్ధాంతీకరించాడు సంస్కృత వ్యాకరణ సూత్రకారుడు పాణిని. పదునయిన కోర పళ్లతో గట్టిగా గుచ్చితే పులి పిల్ల చచ్చిపోతుంది. వదులుగా ఉంటే నోట్లో నుండి జారి కింద పడిపోతుంది. ఇది తెలియక కోట్ల మంది తమ కోర పళ్లతో పసి కూన భాషను గట్టిగా కొరికి హత్య అయినా చేసి ఉండాలి. లేదా అసలు గట్టిగా పట్టుకునే పళ్ల బిగువు లేక భాషను వదిలేయనయినా వదిలేసి ఉండాలి.
“ఒసేయ్ నాలుకా!
నువ్ నానా మాటలు మాట్లాడి…ఏమీ ఎరగనట్లు లోపలికి వెళ్ళిపోతున్నావ్…
లోకం నా పళ్లను ఊడగొట్టి…చేతికిస్తోంది” అని నోరు ఒకరోజు గుండెలు బాదుకుందని ఒక సామెత లాంటి హెచ్చరిక.
అలాంటి మహా గొప్ప దంతాలను మనం గౌరవించాల్సినంతగా గౌరవిస్తున్నామా?
చేతులకు, మెడకు, వేళ్ళకు, నడుముకు, బంగారు, వజ్రాభరణాలు వేసి ఎంతగా అలంకరిస్తున్నాం? గౌరవిస్తున్నాం?
ఇంత గొప్ప దంతాలకు మేలిమి వజ్రాల తొడుగు చేయించుకున్నాడు గుజరాత్ సూరత్ లో ఒకాయన. దానికి ఎన్ని లక్షలు, కోట్లు ఖర్చయి ఉంటుందన్నది జస్ట్ అర్థం లేని అకెడెమిక్ డిబేట్.
“నవ్వితే నీ సొమ్మేమి పోతుంది? ముత్యాలు రాలుతాయా?”
అని సామెత దెప్పి పొడుస్తుంది.
ఈయన నవ్వితే నిజంగానే సొమ్ములు పోతాయి. ఈయన పొరపాటున పగలబడి, విరగబడి నవ్వితే…నిజంగానే నోట్లో నుండి వజ్రాలు రాలిపడతాయి!
వజ్రం ఎప్పటికీ ఈయన నోట్లో నిలిచి ఉంటుంది.
“పలుకే బంగారమాయెనా కోదండపాణి!”
అని త్యాగయ్య చాలా పొదుపుగా మోడరేట్ గా అతి తక్కువ మోతాదులో మిల్లీ గ్రాముల్లో మాటలను తూచి తూచి బంగారు లోహాన్ని వాడుకున్నాడు.
ఈయన అంతకు మించి వాడాడు కాబట్టి…
“పలుకే వజ్రమాయెనా సూరత్ సామీ!”
అని మనం పరవశించి దంతాలంకార వజ్ర గీతాలు పాడలేమో!
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article