మొత్తానికి మళ్లీ ఈటీవీయే ఈవిషయంలో చాలా నయం… ఈ చానెల్‌లో పాడుతా తీయగా గానీ, స్వరాభిషేకం గానీ నాణ్యత ప్రమాణాలు పడిపోయినా సరే, హుందాగా నడిపిస్తున్నారు… కాస్త సంస్కారం కనిపిస్తోంది… సినిమా సాంగ్స్ కంపిటీషన్ షోలలో జీతెలుగు జీసరిగమప షో ఎవరూ దిగజారనంత నీచస్థాయికి వేగంగా వెళ్లిపోతుండగా… హేయ్, నేనేం తక్కువ, నేనూ వస్తున్నాను ఉండు అంటూ ఆహా ఇండియన్ ఐడల్ షో కూడా పోటీకి సై అంటోంది… వీళ్లకు సిగ్గూశరం లేదా అనడక్కండి ప్లీజు… అవి ఉంటే ఏ వినోద మీడియా ప్లాట్‌ఫారాల్లోనూ క్రియేటివ్ టీమ్స్‌లో పనిచేయలేరు… నిష్ఠురంగా ఉన్నా సరే ఇదే నిఖార్సయిన నిజం…
జీసరిగమపలో సింగర్స్ పాడుతుంటే నేపథ్యంగా గ్రూప్ డాన్సులు, జడ్జిల వెధవ్వేషాలు (శైలజ ఒక్కతీ మినహాయింపు), మరీ ప్రత్యేకించి అనంతశ్రీరాం మహా పైత్యం, రకరకాల ధీమ్స్ అంటూ ఎపిసోడ్ల వారీగా చిల్లర పైత్యాలు, కంటెస్టెంట్లకు వేషాలు, నడుమ వెగటు జోకులు, స్టెప్పులతో జీసరిగమప ‘మహా చిల్లర’ స్థాయికి వెళ్తున్న సంగతి చూస్తున్నాం కదా… జాలిపడుతున్నాం… ఆ చానెల్‌కూ సబ్‌స్క్రిప్షన్ పే చేస్తున్నందుకు…
కాస్తోకూస్తో థమన్, కార్తీక్ సారథ్యంలో ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు షో బాగుంది కదాని నిమ్మళిస్తుంటే… నో, నో, అలా సంబరపడనిస్తామా, నాన్సెన్స్, మాకూ చిల్లర వేషాలు వేసే తెలివి ఉంది, టేస్ట్ ఉంది అనుకుంటూ ఈ షో బాధ్యులు కూడా వేగంగా వచ్చేస్తున్నారు… తాజా ప్రోమో దానికే అద్దం పడుతోంది… వచ్చేది టాలీవుడ్ థీమ్ అట… చెత్త… పాడేవి టాలీవుడ్ పాటలే కదా, మళ్లీ కొత్తగా టాలీవుడ్ థీమ్ ఏమిటి..? జడ్జిలకు, కంటెస్టెంట్లకు పలు సినిమాల్లోని ప్రధాన పాత్రల వేషాలు వేయించడం ఎందుకు..?
Ads
ఎవరు ఏ పాట తీసుకుంటే…, దానికి తగిన వేషం వేయాలట… దరిద్రపు టేస్ట్… దీనికి తగినట్టు గీతామాధురి చెత్త ధోరణి… పోయినసారి చెప్పుకున్నాం కదా, ఓ కంటెస్టెంట్ పాట పట్ల అవగాహన లేని జడ్జిమెంట్ చెప్పి, సంగీత ప్రియులతో థూ అనిపించుకుంది… ఈసారీ అంతే దేవసేన వేషం వేసుకుని, ఆ వేషం సినిమాలో వేసిన అనుష్క సిగ్గుపడే రీతిలో నడిచొచ్చిన గీతామాధురిని చూస్తే మనమీద మనకే జాలి వేస్తుంది… ఆహా ఓటీటీని సబ్‌స్క్రయిబ్ చేసుకున్నందుకు… చేతిలో తుపాకీతో థమన్ తుపాకీీరాముడిలా భలే కనిపించాడు…
శృతి అని అమెరికా నుంచి వచ్చింది ఓ డాక్టర్ గాయని తెలుసు కదా… చాలా బాగా పాడుతోంది… టాప్ 5 జాబితాకు అర్హురాలు… ఈసారీ బాగానే పాడింది… కార్తీక్, థమన్ మెచ్చుకున్నారు… అలా తను కూడా మెచ్చుకుంటే తన తెలివికి చిన్నతనం కదా, అందుకని గీతామాధురి ఏదో లోపించింది అనేసింది… సేమ్, గత ఎపిసోడ్‌లో ప్రణతికి చెప్పినట్టే… ఏం లోపించిందో తెలియదు, పైగా తను గాయని, ఫలానాచోట తప్పులు దొర్లాయి అని చెప్పాలి కదా… ఆ తెలివి కూడా లేదు ఆమెకు…
ఆమె నోటికొచ్చింది చెబుతూ ఉంటే… ఫాఫం, ఈమెను జడ్జిగా తీసుకున్నారేమిటో చెప్మా అన్నట్టు శృతి జాలిగా చూస్తోంది ఆమె వైపు… అంతేమరి, వచ్చే సీజన్‌కు ఈ గీతకన్నా ఇంకా చిన్న గీతను జడ్జిగా తీసుకుంటే సరి… అప్పుడు ఈ గీతే పెద్ద గీత అవుతుంది… గొప్పదవుతుంది…!!
Share this Article