కొన్ని స్టెప్పులు చిరంజీవి వేస్తుంటేనే తెరపై భలే కనిపిస్తయ్… కొన్ని డైలాగులు బాలకృష్ణ పలుకుతుంటేనే అదిరిపోతయ్… కొన్ని ఫైట్లు ఏ రాంచరణో, ఏ జూనియర్ ఎన్టీయారో, ఏ ప్రభాసో చేస్తుంటే వాటి ‘పంచ్’ ఓ రేంజులో ఉంటుంది… కానీ అఖండ డైలాగులు సునీల్ పలికితే… వానా వానా వెల్లువాయే స్టెప్పులు బెల్లంకొండ వేస్తే… ఛత్రపతి ఫైట్లు అల్లరి నరేష్ చేస్తే… చేయకూడదని కాదు, బాగుండదని కాదు…
కానీ ఓ కామెడీ స్టార్ సీరియస్ స్టార్‌గా రూపాంతరం చెందే క్రమం ఓ బ్లాస్ట్‌లా ఉండాలి… అప్పుడే జనంలో ఆ మార్పు రిజిష్టరవుతుంది… ఆ స్టార్ పాత ముద్రలు పగిలిపోయి కొత్త చిత్రం ఆవిష్కృతం అవుతుంది… అల్లరి నరేష్ కెరీర్‌కు సంబంధించి ఆ మార్పు సోసో… అదేదో మారేడుమిల్లి ప్రజానీకం గానీ, ఈ తాజా ఉగ్రం గానీ తన స్విచ్ ఓవర్ ప్రయత్నాలకు పెద్దగా ఉపయోగపడిందేమీ లేదు… ఎందుకంటే..?
ఒకేసారి అఖండ డైలాగులు, ఛత్రపతి ఫైట్లు, చిరంజీవి డాన్సులు, జూనియర్ పాటలు నరేష్‌కు సెట్ కావు… మరీ ఉగ్రం సినిమాలో కొన్నిసార్లు నవ్వు పుట్టిస్తాయి కూడా..! అంత పేలవమైన ప్లానింగ్… ఓసారి ఫైట్ చేస్తున్నప్పుడు హిజ్రాల మీద డైలాగులు దంచుతుంటే నిజంగా నవ్వే వచ్చింది… ఓ మాస్ హీరో డైలాగులకు కూడా ఓ రిథమ్ ఉంటుంది… పిచ్, టోన్, టైమింగ్, మొహంలో ఉద్వేగం వంటివి డైలాగులు పేలాయా లేదా నిర్దారిస్తయ్…
Ads
సరే, ఓ కామెడీ స్టార్ ఏదో సీరియస్ జానర్ వైపు అడుగులు వేస్తున్నాడు, డిస్కరేజ్ చేయకూడదు అనుకుంటే… పాటలు బాగా లేవు, బీజీఎం బాగా లేదు… హీరోయిన్ మిర్నాకు నటించే స్కోప్ లేదు… అసలు కథే అంతంతమాత్రం… ఓ కమర్షియల్ హీరోగా మారిపోవాలనే సంకల్పాన్ని తప్పుపట్టలేం… కానీ ఉగ్రం వంటి సినిమాలతో, ఈ పేలవమైన కథనాలతో, అంటే ప్రజెంటేషన్‌తో నరేష్ రెగ్యులర్ హీరో కావడం కష్టం… అసలు సినిమాలో పెద్ద మైనస్ హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్…
పోనీ, ఓ పెద్ద నెట్‌వర్క్‌ను టార్గెట్ చేసి కొట్టాలంటే, ప్రేక్షకుడు కన్విన్సయ్యే రీతిలో స్క్రీన్ ప్లే, సీన్ల రూపకల్పన జరిగి ఉండాలి… అదీ లోపించింది… నరేష్ ఓ సీరియస్ పాత్రలోకి విజయవంతంగా ప్రవేశించాలంటే ముందుగా ఆ పాత్ర డిక్షన్, కేరక్టర్ సరిగ్గా అర్థం చేసుకుని, కాస్త రిహార్సల్ చేయడం అవసరం… అదీ లోపించినట్టు సినిమా చూస్తుంటే అర్థమవుతుంది… తన ఫైట్లు, తన డైలాగులు పలుచోట్ల నవ్వు పుట్టిస్తాయి దేనికి అంటే… అది నరేష్ తప్పుకన్నా, మనం నరేష్‌ను ఇంకా కొత్త భిన్నమైన పాత్రల్లోకి చూడటం అలవాటు పడటం లేదని అర్థం… అలా చూపించలేకపోతున్నారని అర్థం…
ఏదో ఫ్రాక్చర్ అనే ఇంగ్లిష్ సినిమా నుంచి ఈ సినిమా కథను కాపీ కొట్టినట్టు సోషల్ పోస్టులు కొన్ని చెబుతున్నయ్… కాదు, మన హిట్-2, యశోద వంటి తెలుగు సినిమాలే కొన్ని గుర్తొస్తున్నయ్ అని కొందరి వ్యాఖ్యానం… కాపీలు, అనుకరణలు, అనుసరణలు గట్రా లేకుండా తెలుగు సినిమా కథలేమున్నయ్ పెద్దగా… కాబట్టి దాన్ని క్షమించినా సరే, ఆ కథనైనా సరిగ్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది… అన్నట్టు, టైటిల్ జస్టిఫికేషన్ కోసం అంత లెంతీ యాక్షన్ క్లైమాక్స్ అక్కర్లేదు మిస్టర్ డైరెక్టర్… సీరియస్ ఫేజులో ఈ యాక్షన్ పార్ట్ సినిమాను నాసిరకంగా మార్చేసింది…
తెలుగు సినిమాల్లో ఓ దరిద్రం కనిపిస్తుంది… బోలెడు మోడరన్ గన్స్, మెషిన్ గన్స్ ఉన్నా సరే, ఓ పెద్ద సుత్తి పట్టుకుని హీరో రౌడీలను ఇరగబాదుతూ ఉంటాడు… ఈ సినిమాలో కూడా హీరో బైక్‌పై వెళ్తుంటాడు… అకస్మాత్తుగా విలన్ కనిపించగానే బైక్ కింద పడేసి పరుగు తీస్తూ వెంటపడతాడు… హేమిటో… నరేషా… సీరియస్ జానర్ల వైపు అడుగులు పడటం లేదు… ఉగ్రం కూడా అంతే…!!
Share this Article