పార్ధసారధి పోట్లూరి …… టెర్రర్ ఇండస్ట్రీకి ప్రతినిధిగానే గుర్తిస్తాను – EAM జైశంకర్ ! పాకిస్థాన్ నుండి భారత దేశానికి వచ్చి మరీ ఘోరంగా తిట్టించుకున్నాడు బిలావల్ భుట్టో ! అదేదో ఎవరూ తిట్టకపోతే కూలి ఇచ్చి మరీ తిట్టించుకున్నట్లుగా ! ప్రస్తుతం గోవాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ [SCO] కి సంబంధించి విదేశాంగ మంత్రుల సమావేశాలు జరుగుతున్నాయి !
SCO సమావేశాలకి పాకిస్థాన్ ని ఆహ్వానించాలా వద్దా అనే అనేక తర్జన భర్జనల తరువాత చివరికి ఆహ్వానించాలి అనే నిర్ణయం తీసుకొని, ఆ విషయాన్ని పాకిస్థాన్ కి తెలియచేసారు మన అధికారులు ! ప్రస్తుతం పాకిస్థాన్ విదేశాంగ శాఖని వెలగబెడుతున్న పాకిస్థాన్ పప్పుగా ప్రసిద్ధిగాంచిన బిలావల్ భుట్టో జర్దారీ భారత్ లోని గోవాకి ప్రయాణం అవ్వాలని అనుకొన్నదే తడవుగా… పాకిస్థాన్ లోని మత పెద్దల దగ్గర నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది భారత్ కి వెళ్ళడానికి వీలు లేదంటూ ! పోనీ పాకిస్థాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అయిన హీనా రబ్బాని ని పంపించాలి అనుకున్నా అనవసరంగా హీనా రబ్బానీ కి మైలేజ్ ఎందుకు ఇవ్వాలి అనుకోని, చివరకి బిలావల్ భుట్టో జర్దారీ భారత్ వచ్చేశాడు నిరసనలు,హెచ్చరికలని లెక్క చేయకుండా !
ఇక గోవాలో సమావేశానికి వచ్చిన బిలావల్ భుట్టో జర్దారీకి ఘన స్వాగతం లాంటి ఏర్పాట్లు ఏవీ చేయలేదు మన EVM జై శంకర్ ! నో షేక్ హాండ్ ! చేతులు కలపడం లాంటిది ఏదీ చేయలేదు జై శంకర్ . ఒక నమస్కారం పెడుతూ [ఎంతయినా మన అతిధి కాబట్టి ] వేదిక మీదకి ఆహ్వానించారు జై శంకర్ !
Ads
సరే ! ఇలాంటి సమావేశాలలో మామూలుగా జరిగే చర్చలు వాదోపవాదాలు షరా మామూలుగా జరిగిపోయాయి ! SCO సభ్య దేశంగా పాకిస్థాన్ చేసేది, చేయగలిగేదీ ఏదీ లేదు అన్న సంగతి అందరికీ తెలుసు కాబట్టి కాసేపు పిచ్చాపాటి కబుర్లకే పరిమితం అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం.
ఈ సమావేశంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో G-20 దేశాల సమావేశం శ్రీనగర్ లో జరపబోవడం మీద ఆక్షేపణ తెలిపాడు. దీని మీద స్పందిస్తూ మన విదేశాంగ మంత్రి జైశంకర్ కాశ్మీర్ లో G-20 దేశాల సమావేశం ఎలాగూ జరుగుతుంది కానీ మీరు ఎప్పుడు ఆక్రమిత కాశ్మీర్ ని మాకు అప్పచెప్తారో చెప్పండి ముందు అంటూ ఘాటుగా ఎదురు ప్రశ్న వేశారు !
జై శంకర్ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో SCO సమావేశానికి రావడం మీద విలేఖరులు అడిగిన ప్రశ్నకి జవాబు ఇస్తూ ఆయన SCO సభ్య దేశం తరుపున ఇక్కడ సమావేశానికి వచ్చారు తప్పితే అంతకంటే ఎక్కువ ఏమీ లేదు అని అన్నారు ! కాకపోతే బిలావల్ భుట్టోని టెర్రర్ పరిశ్రమని ప్రమోట్ చేసే వ్యక్తిగా మాత్రం గుర్తిస్తాను అని జస్ట్ పూచిక పుల్లని తీసేసినట్లుగా తీసేశారు జై శంకర్ బిలావల్ భుట్టో ని !
కాశ్మీర్ సమస్య మీద భారత్ పాకిస్థాన్ లు కూర్చొని సమస్యని పరిష్కరించుకొనే అవకాశాలు ఉన్నాయా ? అంటూ విలేఖరులు అడిగిన ప్రశ్నకి జై శంకర్ బదులిస్తూ ఒక పక్క పాకిస్థాన్ టెర్రరిజంని ఎగుమతి చేస్తూ, మరో వైపు మన దేశంతో చర్చలు చేయమని ఎవరు అడుగుతారు ? అసలు పాకిస్థాన్ పరపతి ఏమిటి ప్రపంచదేశాలలో ? పాకిస్థాన్ పరపతి రోజు రోజుకీ దిగజారిపోతున్నది ప్రపంచదేశాలలో, వాళ్ళ డాలర్ రిజర్వ్ కంటే వేగంగా ! మనం టెర్రరిజం యొక్క బాధితులం, అలాంటిది అదే టెర్రరిజాన్ని ఎగుమతి చేసే దేశంతో చర్చలు ఎలా చేయగలుతాము ? అంటూ విలేఖరులకి ఎదురు ప్రశ్నలు సంధించారు జై శంకర్ !
విలేఖరులు అడిగే ప్రశ్నలకి జై శంకర్ సమాధానాలు చెపుతుంటే పాపం బిలావల్ భుట్టో జర్దారీ [ ఈ మాయ రోగం పాకిస్థాన్ లో కూడా ఉంది, అదెలాగంటే బెనజీర్ భుట్టో కొడుకు కాబట్టి భుట్టో మరియు ఆసిఫ్ జర్దారీ కొడుకు కాబట్టి జర్దారీ… వెరసి అసలు పేరు బిలావల్ తో భుట్టో జర్దారీ లు కలిపేసుకున్నాడు ] ముఖం చూస్తే అసలు అతను నవ్వుతున్నాడో లేకపోతే బాధపడుతున్నాడో లేక రెండు ఎక్స్ప్రెషన్స్ ని కలిపి ప్రకటిస్తున్నాడో అర్ధం కాలేదు. నా వరకు నాకు అయితే మూడేళ్ళ క్రితం అమరావతి శాసనసభలో ఎలుకలు పట్టడం కోసం కోటి రూపాయలు కేటాయించారు అధ్యక్షా అని అంటున్నప్పుడు చంద్రబాబు ఎక్స్ప్రెషన్స్ గుర్తుకు వచ్చింది అంటే నమ్మండి ! SCO సమావేశాలు గోవాలో జరుగుతుండగానే మరోవైపు బిలావల్ భుట్టోతో ఇంటర్వ్యూ చేశాయి రెండు మీడియా సంస్థలు. మొదటిది THE HINDU అయితే రెండో వారు రాజ్ దీప్ దేశాయ్ !
ఇక చూడండి రేపటి నుండి పాకిస్థాన్ మీడియాలో డిబేట్లు మొదలవుతాయి ! బిలావల్ భారత్ వెళ్ళి హెచ్చరికలు చేశాడు అంటూ ! నిజమే అలా ప్రచారం చేసుకోక పోతే అక్కడి టెర్రర్ గ్రూపులు ఊరుకోవు కదా ? పాపం ! నేను రాకుండా విదేశాంగ సహాయ మంత్రి హీనా రబ్బాని పంపిస్తే బాగుణ్ణు అని అనుకొని ఉంటాడు బిలావల్ ! ఇప్పటి వరకు భారత దేశ చరిత్రలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రిని ఇంతలా తలంటిన మన విదేశాంగ మంత్రి లేరు ఒక్క జైశంకర్ తప్ప! జై శంకర్ మాట తీరు ఎలా ఉంటుంది అంటే అనే మాటలు చాలా డిప్లొమాటిక్ గా ఉంటాయి కానీ అవతలి వాళ్ళకి మాత్రం అవి జీర్ణం కావు మరియు తిరిగి సమాధానం చెప్పేట్లుగా ఉండవు !
Share this Article