ఒక్క ఆంధ్రజ్యోతి మినహా మొత్తం తెలుగు మీడియా కేసీయార్ కాళ్ల దగ్గర పాకుతున్న దృశ్యం చాన్నాళ్లుగా కనిపిస్తూనే ఉంది… 111 జీవో ఎత్తివేత ఎంతటి పెద్ద రియల్ ఎస్టేట్ స్కామో, ఎందరు అధికార పార్టీ నేతలు వందల ఎకరాల్ని చెరపట్టారో ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ వార్త కళ్లకుకడుతోంది… 650 ఎకరాలు, 600 ఎకరాలు అట… గత ఏడాదే ఒక ఎంపీ వందల ఎకరాలు కొన్నాడట… అంటే జీవో 111 ఎత్తివేతపై అధికార పార్టీ ముఖ్యులకు స్పష్టమైన సమాచారం ఉందన్నమాటే…
కర్నాటక ప్రజలు అవినీతి బీజేపీని అడ్డంగా ఛీత్కరిస్తే… అబ్బే, తెలంగాణలో అలా జరగదు అంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు… అంతేతప్ప ఇక్కడ అవినీతి లేదని అనవు… అనలేవు… ప్రతి ఎమ్మెల్యే ఓ దేశ్‌ముఖ్‌గా మారిపోయి, ప్రతి నియోజకవర్గంలోనూ బోలెడు కథలు… అన్నింటికీ తాత వంటి 111 జీవో ఎత్తివేత… ఒక్క మీడియాకు కూడా ఈ నిర్ణయం వెనుక అసలు అవినీతి మర్మం పట్టలేదు… సరే, అదంతా పక్కన పెడితే… చీటికీమాటికీ ప్రతి విషయానికీ కేసీయార్‌పై ఆడిపోసుకునే ప్రతిపక్షాలు ఈ కీలక బాగోతంపై ఎందుకు మాట్లాడటం లేదు..? ఎందుకు వీథుల్లోకి రాలేదు..?
ఇన్నాళ్లూ కాళేశ్వరం అవినీతి మాట పదే పదే వినిపించిన బీజేపీ ఇప్పుడు కాళేశ్వరం మాట మాట్లాడటం లేదు… కేసీయార్‌ను జైలుకు పంపిస్తాం అని పదే పదే కూసిన బీజేపీ పెద్ద తలకాయలు ఇన్నేళ్లలో సాధించింది ఏముంది..? ఏమీ లేదు… అంతెందుకు..? ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈరోజుకూ అరెస్టు చేయలేదు… విచారణకు రావడానికి నాకు తీరికలేదుపో అనగానే సీబీఐ అన్నీ మూసుకుని కుయ్ కుయ్ అంటోంది… బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డే అంటున్నాడు… బీఆర్ఎస్, బీజేపీ గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని…
Ads
111 జీవో పరిధిలో భూములున్న మారాజులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు… పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, వందల ఎకరాలు… ఏ పార్టీ దీనికి అతీతం కాదు… అందుకే కిక్కుమనడం లేదు… ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం 111 జీవో పరిధిలోని ప్రాంతాలకు మళ్లుతుంది… ఏదో నామ్‌కేవాస్తే రాజకీయ పార్టీలు ఈ జీవో ఎత్తివేతను ఖండించినా… ప్రకృతి వనరుల్ని ప్రభుత్వమే ధ్వంసం చేసే నిర్ణయం తీసుకున్నా… ప్రధాన రాజకీయ పక్షాలు కిమ్మనవు… ఎందుకంటే, బేసిక్‌గా అన్ని పార్టీలూ ఒకటే… నాయకులందరూ ఒకటే…
నిజంగా ఏ ఉన్నత స్థాయి న్యాయస్థానమో సూమోటోగా తీసుకుని, తమ పర్యవేక్షణలో గనుక దర్యాప్తు చేయిస్తే… కళ్లు చెదిరే నిజాలు బయటికొస్తాయి… కానీ ఆశించవచ్చా..? జర్నలిస్టులు కాసింత ఇంటి జాగా కోసం 14 ఏళ్లుగా పోరాడుతున్నారు… సుప్రీం సానుకూల తీర్పు ఇచ్చినా అది మాత్రం సెటిల్ చేయడు కేసీయార్… కానీ తమ నేతల అనుచిత లబ్ది కోసం ఏకంగా ప్రకృతి వనరుల రక్షణకు ఉద్దేశించిన 111 జీవోకు పాతరేశాడు… డబ్బుతోనే జాతీయ రాజకీయాల్లో గాయిగత్తర లేపుతాననే సంకల్పం ఉన్న కేసీయార్‌కు చాలా స్పష్టత ఉంది… ఆ దిశలో ఆఫ్టరాల్ జర్నలిస్టులు చేసేదేముంది..? యాజమాన్యాలే సరెండర్ అయిపోయాక..!! అందుకే తన పార్టీ లీడర్ల కోసం ఏదైనా చేస్తాడు… జర్నలిస్టులకు ఏమీ చేయడు…!!
అంతెందుకు…? డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరిట బోలెడు రాజకీయ లబ్ధి పొందిన కేసీయార్ ఇప్పుడు దాన్ని అటక మీద పారేసి, కాస్త డబ్బు ఇస్తాం, మీ ఇల్లు మీరే కట్టుకొండి అంటున్నాడు… పెట్రోల్ ధర, కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, కౌలు రైతులు, పేపర్ లీకేజీలు… ఏది చూసినా తెలంగాణ జనానికి ఒరిగేదేమీ లేదు, వాతలు తప్ప… ధనిక ఆసాములు, బీఆర్ఎస్ బీటీ బ్యాచ్ లీడర్లకు లబ్ది తప్ప…! దాదాపు 6 లక్షల కోట్ల అప్పులో మునిగిన ధనిక రాష్ట్రం కదా ఇది… మహారాష్ట్రలో ఏదో శిక్షణ ఇప్పిస్తున్నది కదా పార్టీ… ఆ శిబిరాల్లో ‘‘తెలంగాణ మోడల్’’ అంటే ఏమని చెబుతారో…!!
Share this Article