ఓ దంపతుల కేసు… ఆయనకు అప్పటికే మూడు పెళ్లిళ్లు… ఏ మహిళతోనూ పడలేదు… అఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్పులు, ఎడాపెడా పెళ్లిళ్లు గట్రా వోకే కావచ్చుగాక… కానీ తను ఓ సత్యసంధుడిగా, తనతో విడిపోయిన మహిళ ఓ విలన్ అన్నట్టుగా ఆయన వెర్షన్ ఉంటుంది… కావచ్చు… ఆమె విలనే కావచ్చు, ఈయన ఓ ఆదర్శ పురుషుడే అనుకుందాం కాసేపు…
కాబోయే నాలుగో భార్యతో కలిసి ప్రెస్ మీట్లు పెట్టాడు… సైట్లు రాశాయి, యూట్యూబర్లు రెచ్చిపోయారు, అరవయ్యేళ్ల ముదురు మదనుడు అని కూడా రాశారు కొందరు… మెయిన్ స్ట్రీమ్ టీవీలు, పత్రికలు కూడా తప్పనిసరై నాలుగు ముక్కలు గీకాయి… నిజానికి అదే ఎక్కువ… ఆఫ్టరాల్ ఓ సినిమా నటుడి పెళ్లి, విడాకుల యవ్వారం ఇది… సెలబ్రిటీ కాబట్టి, జనం చదువుతారనే కక్కుర్తితో ఏదో ఒకటి రాయడమే తప్ప సొసైటీకి పైసా ప్రయోజనం లేని శుష్కమైన కథ…
అవును, సీనియర్ నరేష్, తను పెళ్లి చేసుకోబోయే పవిత్ర లోకేష్ కథే… పెళ్లి మాత్రం చేసుకోడు… దేనికి..? మూడో భార్య తాటతీస్తుంది కాబట్టి… విడాకులు గాకముందే పెళ్లి చేసుకుంటే పోలీసులు బొక్కలో వేస్తారు కాబట్టి… కానీ సహజీవనం మాత్రం చేయొచ్చు… మన భారతీయతకు ఎల్లప్పుడూ కిరీటం పెట్టే సుప్రీం చెప్పింది కదా… ఎవరు ఎవరితోనైనా తిరగొచ్చు అని… సో, పర్లేదు… కానీ నరేష్‌కు ఇది సరిపోలేదు… ఈ వయసులో ఏదో తోడు కోసం ఫాఫం పవిత్రను పవిత్రమైన హృదయంతో పెళ్లి చేసుకుంటే సదరు మూడో భార్య రమ్య రఘుపతి అడ్డుపడుతోంది, అంతు చూస్తానంటోంది… ఎంత అడుగుతుందో ఏమో గానీ… ఇష్యూ సెటిల్ కావడం లేదు… బజారులో… సారీ మీడియాలో కొట్టుకుంటున్నారు…
Ads
సరే, ఈ కథలో హీరోది నమ్మదగిన వాదనేనా..? ఆమె నిజంగా విలనేనా..? అనే వాదనను కాసేపు పక్కన పెడదాం… విషయం ఫ్యామిలీ కోర్టులో ఉన్నట్టుంది… ఇప్పటికే మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది… మీడియా తప్పనిసరై రమ్య వాదనను కూడా చెబుతోంది… దాంతో డబ్బున్న నరేష్‌కు చిర్రెత్తుకొస్తోంది… ఇలాంటి సందర్భాల్లో కొందరు తమ వాదనతో పుస్తకాలు రాస్తారు, మరీ తిక్క కేసులైతే తమ వాదనతో పత్రికల్లో యాడ్స్ ఇస్తారు… ఎట్సెట్రా…
కానీ నరేష్ రూట్ వేరు కదా… తన వాదనతో ఓ సినిమాయే తీసిపారేశాడు… ఈమధ్య బూతు సినిమాలు తీయడానికి ఎగబడిన ఎంఎస్‌రాజు దర్శకుడు… అంటేనే అర్థమైంది కదా ఈ సినిమా కథకు క్రెడిబులిటీ ఏమిటో… అనుకున్నట్టుగానే రమ్యను విలన్‌గా చిత్రీకరించాడు… తనదీ, తన కాబోయే నాలుగో పెళ్లాందీ అపూర్వ ప్రేమబంధంగా చూపించాడు… ఆమె కెరీర్ తొలినాళ్లను కూడా చూపించాడు… ఆమెనూ వదిలేసిన ఓ ప్రముఖుడు సినిమా వాడే… అతనూ విలనే… కథ ప్రకారం తప్పదు కదా మరి… ఈ ఇద్దరే శుద్దపూసలు…
ఫాఫం, రమ్య అసలు కోర్టుకు సకాలంలో వెళ్లి ఉంటే ఈ సినిమాకు అర్థంతరంగా ఇంట్రవెల్ పడి ఉండేది… ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది… సినిమా విడుదలై పోయింది… ఆమె సమాజంలో విలన్‌గా కనిపిస్తోంది ఇప్పుడు… మరి ఇప్పుడు ఆమె ఏం చేయాలి..? అసలు ఇలాంటి కేసుల్లో డబ్బులున్నయ్ కదాని నిందితులు కూడా పరమపవిత్రులుగా తమను తాము కీర్తించుకుంటూ, తమ వాదనను హైలైట్ చేస్తే, మరి ఎదుటి వాళ్ల వాదన సంగతేమిటి..?
డబ్బుంటే సరా..? సొసైటీ మీద తన వాదనను రుద్దవచ్చా..? ఎస్, ప్రతి నిందితుడికీ ఓ వాదన ఉంటుంది… కానీ అదే ఫైనల్ కాదు కదా… గాంధీని చంపిన గాడ్సేకూ ఓ వాదన ఉంది… ఓ పుస్తకం రాశాడు… అప్పట్లో తనకూ డబ్బుంటే గాడ్సే ఫైల్స్ అని తీసేసేవాడేమో… ఇప్పటికైనా మునిగిందేమీ లేదు… కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ నిర్మాతలు ఓ లుక్కేయవచ్చు… అయితే డబ్బుతో ఓ కథ జనం మీద రుద్ది, జనాభిప్రాయాన్ని ప్రభావితం చేయడం సబ్ జుడీస్ అవుతుందా..? ఏమో న్యాయనిపుణులే చెప్పాలి…
సినిమా సంగతికొస్తే… ఇది కల్పిత కథేమీ కాదు… నిజమైన కథే… కాకపోతే వన్ సైడ్ వెర్షన్… నటుడు నరేంద్రకూ ఆయన మూడో భార్య సౌమ్య సేతుపతికీ నడుమ సంబంధాలు అంత బాగా ఉండవు… (నరేంద్ర అంటే నరేష్, సౌమ్య అంటే రమ్య… మూడో పెళ్లాం…) ఇక్కడ రమ్య పాత్రలో వనితా విజయకుమార్ కనిపించింది… నరేష్ ఆశించిన విలనీని ప్రదర్శించింది… (నిజానికి మంచి నటే ఆమె… ఆమె నిజ జీవితంలోనూ బోలెడు పెళ్లిళ్లున్నయ్, అది వేరే కథ…)
నరేంద్రకు కన్నడ నటి, ఒకప్పటి హీరోయిన్ పార్వతి పరిచయమవుతుంది… (పవిత్ర అనే పేరు స్ఫురించేలా…)… వాళ్ల ప్రేమ చిగురించి మొగ్గ తొడుగుతుంది, పువ్వై పూస్తుంది… ఆమె మొదటి భర్త కన్నడ నటుడు, రచయిత ఫణీంద్ర (నిజ జీవితంలో సుచేంద్ర, ఇదీ అసలు పేరు స్ఫురించేలానే ఉంది…) తో ఆమెకున్న గొడవలు, రమ్యకూ నరేష్‌కూ నడుమ గొడవలు సినిమా కథ… సుచేంద్ర ఓ విలన్… రమ్య మరో విలన్… ఇంకా కథ లోతుల్లోకి వెళ్లడం అనవసరం…
విజయనిర్మల పాత్ర జయసుధ… కృష్ణగా శరత్ బాబు… అయితే వాళ్ల పాత్రలు చాలా పరిమితం… రమ్యా రఘుపతి మీద కక్షతో తీసిన సినిమా కాదని చెప్పాడు… మీడియా మీట్లలో ఏదేదో చెప్పాడు, పవిత్ర కూడా చెప్పింది… కానీ అబద్ధం… అచ్చంగా ఇది రమ్యను విలన్‌గా చూపించడానికి ఉద్దేశించిన సినిమా మాత్రమే… పలు సీన్లను ఎంఎస్‌రాజు బోల్డ్‌గా కూడా తీశాడు… అది తన టేస్ట్… సినిమాలో బాగున్నదీ అంటే అనన్యా నాగళ్ల… పవిత్ర యంగ్ వెర్షన్‌లో అందంగా ఉంది…
కేవలం తమ జీవితంలోని ఓ కేసు మీద ఏకంగా ఓ బయోపికే తీసేశాడు నరేష్… ఇది బయోపిక్కులకే ఓ కొత్త బాట… మరి అన్ని ఫ్యామిలీ కోర్టుల్లోకి కేసుల్లోనూ నిందితులు లేదా కక్షిదారులు తమ వాదనలను జనంలోకి తీసుకుపోవడానికి ఇలాంటి సినిమాల నిర్మాణాన్నే ఆశ్రయిస్తే..? మళ్లీ చెబుతున్నా… రమ్య గనుక తన బంధువు, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో తన వెర్షన్‌తో ఓ సినిమా తీయిస్తే… (ఆమెకు కూడా డబ్బుంది…) నరేష్, రమ్యల కథ మరింత రక్తికడుతుంది… మొత్తానికి ఇలాంటి సినిమాల వల్ల ఒరిగేదేమిటి అనేది ఓ పెద్ద ప్రశ్న… భలేవాళ్లే… సినిమాలంటేనే వినోదం… ఇదోతరహా వినోదం… తప్పు ఎవరిదైతేనేం, ఒప్పు ఎవరిదైతేనేం…!!
Share this Article