Nancharaiah Merugumala ……… తాత నెహ్రూ చేతికి ఎవరి వల్ల ‘సెంగోల్’ వచ్చిందో రుజువులు లేవు గాని… 1984లో ‘రాజీవ్ చేతికే రాజదండం’ అని శీర్షిక పెట్టిన ‘ఉదయం’…
1984 డిసెంబర్ చివర్లో ఎనిమిదో లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజునే నాటి ‘ఉదయం’ తెలుగు దినపత్రిక మొదలయింది. దేశంలో ఎన్నికలు జరిగిన 514 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను అప్పటి పాలకపక్షం కాంగ్రెస్ పార్టీకి 404 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పెద్ద కొడుకు రాజీవ్ గాంధీ తల్లి చావు తర్వాత ప్రధాని పదవి చేపట్టారు. ఆయన పదవిలో ఉండగానే ఈ ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో ఐదింట నాలుగు వంతుల మెజారిటీ కాంగ్రెస్ కు రావడంతో ఉదయం దినపత్రిక మొదటి రోజు మొదటి పేజీ ప్రధాన వార్త శీర్షికగా ‘రాజీవ్‌కే రాజదండం’ అని పెట్టారు… అప్పుడే కాంగ్రెస్ ఘనవిజయానికి ఇలా రాజరికకాలం నాటి రాజదండం అనే పదం వాడడం బాగోలేదని కొందరు వ్యాఖ్యానించారు.
ఈ విషయం ఇలా ఉంచితే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టు–1947 ఆగస్టు 15 రాత్రి మొదట నాటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ తాకగా, తర్వాత గంగా జలంతో శుద్దిచేసిన ‘సెంగోల్’ను ప్రథమ ప్రధాని పండిత జవాహర్ లాల్ నెహ్రూకు హిందూ పండిత–పురోహిత పూజారులు అందజేశారని వార్తలొచ్చాయి.
నెహ్రూ చేతికి ఈ సెంగోల్ జాతీయ నాయకుడు చక్రవర్తి రాజగోపాలాచారి సలహా, చొరవ వల్లే వచ్చిందనడానికి ఇప్పుడు లిఖితపూర్వక ఆధారాలు లేవని కాంగ్రెస్ నేతలు సహా పలువురు పాత్రికేయులు ధీమాగా చెబుతున్నారు. మరి దేశాన్ని ఎదురూ బెదురూ లేకుండా దాదాపు 17 సంవత్సరాలు ప్రధానమంత్రి హోదాతో పరిపాలించిన తాత జవహర్ నెహ్రూ చేతికి రాజదండం ‘సెంగొల్’ మౌంట్ బాటన్ సలహా వల్లే వచ్చిందనే ‘విషయం’ తెలియకుండానే ‘రాజీవ్ కే రాజదండం’ అని దాదాపు 39 ఏళ్ల క్రితమే ఉదయంలో శీర్షిక పెట్టాల్సింది కాదేమోనని ఇప్పుడు అనిపిస్తోంది.
బ్రహ్మరథం, రాజదండం వంటి మాటలు ఇప్పుడు ప్రజాస్వామ్య యుగంలో వాడొచ్చా అని కూడా ఆలోచిస్తే మంచిదేమో. ఏదేమైనా గత పాతిక ముప్పయి సంవత్సరాలుగా ఇతర తమిళ, రాజస్థానీ, మలయాళీ నగల కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కుంటున్న వుమ్మిడి బంగారు చెట్టి, వుమ్మిడి ఆంజనేయులు చెట్టి పేర్లతో జ్యూయలరీ దుకాణాలు నూరేళ్లకు పైగా నడుపుతున్న తెలుగు నేపథ్యం ఉన్న వుమ్మిడి చెట్టిలకు ఈ సెంగోల్ పుణ్యమా అని మంచి ప్రచారం లభించింది.
లలితా జ్యూయలరీ యజమాని ఎం.కిరణ్ కుమార్ జైన్ మాదిరిగా కోట్లాది రూపాయలు ఖర్చు చేయకుండానే కేంద్రంలోని బీజేపీ మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తదితర నేతల పరోక్ష తోడ్పాటుతో వుమ్మిడి కుటుంబాల బంగారు నగల దుకాణాలకు ఎనలేని ప్రచారం వచ్చిపడింది…
Share this Article