By రంగావఝుల భరద్వాజ…….. టాలీవుడ్ లో చాలా మంది నాట్యతారలు మెరిసారు. అందులో అడపాదడపా హీరోయిన్ రోల్స్ చేసిన వాళ్లూ ఉన్నారు. అయితే వ్యాంపిష్ రోల్స్ వేస్తూనే మధ్యలో పూర్తి స్థాయి హీరోయిన్ పాత్రలు చేసిన తారల్లో ఎల్.విజయలక్ష్మి, హలం కుంచెం ప్రత్యేకంగా కనిపిస్తారు.
హలం వ్యాంప్ రోల్స్ చేస్తూనే ఓ సూపర్ డూపర్ హిట్ మూవీలో హీరోయిన్ గానూ చేసింది. ఆ తర్వాత కారక్టర్ రోల్స్ లోనూ అదరగొట్టింది.
డెబ్బై దశకం మధ్యలో హలం తెరంగేట్రం చేసింది. అప్పటికి బాలీవుడ్ లో హెలెన్ చాలా పాపులర్ డాన్సర్. బహుశా అలా ఉండేలా హలం అనే పేరు పెట్టుకున్నారు అని అనుకునేవారు ఆ రోజుల్లో.
Ads
అయితే అది జస్ట్ ఊహ మాత్రమే. తన అసలు పేరే హలం. కొంచెం విచిత్రంగా ఉంది కదూ…నిజం.
హలం అంటే నాగలి అని అర్ధం. హలం తండ్రి శ్రీనివాసరావు హేతువాది. గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతం నుంచి తమిళనాడు తిరువళ్లూరులో సెటిలైన ఫ్యామిలీ అది. హలం కు ఓ సిస్టర్ ఉన్నారు. ఆవిడకు కలం అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే ఆవిడ ఉపాధ్యాయురాలిగా స్థిరపడ్డారు. ఇక హలం కు ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు బలం.
అయితే … మిత్రుడు నరేష్ నున్నా చెప్పిన వివరాలు …
“బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో త్రిపురనేని రామస్వామి చౌదరి గారి అంతే వాసులు గుత్తా చలమయ్య గారి కుటుంబం- మొత్తం ఆరుగురు అన్నదమ్ములు (కేవలం 35 ఏళ్ల క్రితం జ్ఞాపకం ఆధారంగా చెబుతున్నానంతే)
గుత్తా చలమయ్య గారు విశిష్టాద్వైత పీఠం కూడా పెట్టారు. బహుశా గుంటూరు జిల్లా- కొల్లూరు ప్రాంతంలో-
ఆ ఆరుగురిలో నాల్గవ వారు- గుత్తా శ్రీనివాసరావు గారు. వారి అమ్మాయి హలం.
ప్రత్యామ్నాయ సంస్కృతి పేరిట గోరా గారు లవణం…. సమరం…. నియంత…. అని పేర్లు పెట్టినట్టు- శ్రీనివాసరావు గారు కూడా హలం…. కలం…. బలం…. అని పెట్టారు.
బహుశా…. పుష్పగిరిలో సెటిల్ అయిన చివరి వారైన గుత్తా రాధాకృష్ణ గారి పౌత్రి గుత్తా జ్వాల అనుకుంటా (ఇది మాత్రం 35 ఏళ్ల నాటి గుర్తు కాదు) “
జ్యోతిలక్ష్మి వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత… ఇంకా జయమాలిని పూర్తిగా స్పీడ్ అందుకోక ముందు ఉన్న సంధి కాలంలో అంటే సుమారు 1972 ప్రాంతాల్లో హలం నాట్యతారగా ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయ్యింది.
సినిమాల్లో ఐటెమ్ సాంగ్ ఉంటే హలం కు ఛాన్స్ దక్కేది.
ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్సే సాధించింది. ఎన్.టి.ఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి అగ్ర హీరోలందరితోనూ డాన్స్ చేసింది.
హలం అనగానే బాపు సినిమాల్లో ఉంటుందే ఆ అమ్మాయి అనేస్తారు చాలా మంది. అంతగా బాపు రమణలకు నచ్చేసింది హలం. ముత్యాలముగ్గు సినిమా ప్రారంభం కావచ్చు. ఆ తర్వాత దాదాపు బాపు తీసిన చాలా సినిమాల్లో హలం మంచి పాత్రలతో పాటు నాట్యకత్తె వేషాలూ వేసింది. ఆడియన్స్ ను మెప్పించింది.
అయి బాబోయ్ అలా చూస్సేశారేంటండీ…ఆఫీసరు గారి భార్య ఇద్దరు పిల్లల తల్లి అనే రావుగోపాల్రావు డైలాగు గుర్తొచ్చేస్తుంది కదూ హలం పేరెత్తగానే. ఏదో డాన్స్ రకంగా ఉంటేనూ అని నసుగుతూనే హలంతో సన్నిహితంగా వెళ్లి దెబ్బతినేస్తాడు ముక్కామల. ఆయనకు కాంట్రాక్టరు వేసిన వల హలం అనే విషయం తెల్సే లోపలే… ఎంతటి రసికుడివో తెలిసెరా అంటూ పాడేస్తుంది హలం.
ముత్యాలముగ్గులోనే ముక్కామలను బెదిరించే ఓ సీన్ అద్భుతంగా రాశారు రమణగారు. దేవుడి నగలు తేకపోతే ఉరిశిక్షే అని వార్నింగ్ ఇస్తాడు రావుగోపాల్రావు ముక్కామలకి. అప్పడు ఎవరూ మీరే ఏత్తారా అని అమాయకంగా అడుగుతుంది హలం. కాదు శ్రీ కోర్టువారు అంటాడు రావుగోపాల్రావు. అని … నిన్ను కరుసు రాసేసి అదీడి ఖాతాలో జమేసి ఈ రెండు ఫొటోలూ జత పరిత్తే ఫినిష్షూ అంటాడు అలవోకగా.
హలం కూడా డైలాగ్ పూర్తిగా వినకుండా తలూపుతూ .. బటానీలు తింటూ … అలాగా అనేస్తుంది. ఆ సీన్ చూడండి. ఎంత నాచురల్ గా ఎంత అద్భుతంగా తీశారో మహానుభావులు.
ముత్యాలముగ్గులో హలం మీదొచ్చిన కాన్ఫిడెన్స్ వల్లో ఏవోగానీ బాపు గారు తన తదుపరి చిత్రం స్నేహంలోనూ హలంను కంటిన్యూ చేస్సేశారు. నిజానికి ఆ సినిమా హిందీ ఒరిజనల్ దోస్తీలో ఓ వృద్దురాలి పాత్ర అది. కానీ తెలుగులో దాన్ని ఓ మొగుడొదిలేసిన యంగ్ వైఫ్ గా మార్చి అక్కడ హలం ను పెట్టేశారు.
అప్పుడు అనిపించింది బాపును చూసి ఎంతటి రసికుడివో తెలిసెరా అని …హోటల్ నడుపుకుంటూ కొడుకును చదివించుకుంటూ… ఆత్మ గౌరవంతో జీవనం సాగిస్తూన్న హలం మీద ఆ ఊరి రౌడీ రావుగోపాల్రావు కన్ను పడుతుంది.
అతన్ని మాటలతోనే కట్టడి చేస్తూంటుంది. ఒరే ఆబోతోడా అనే సంబోధిస్తూంటుంది. రావు గోపాల్రావును ఎదిరించి నిలబడుతుంది. బాపు గారి తర్వాత సినిమా గోరంతదీపంలోనూ హలంది కీలక పాత్రే. అందులో ఓ విశేషం ఉంది. ఆరుద్రతో ఏకంగా హలం మీదో చిన్న పోయమ్మే రాయించేశారు బాపు రమణలు. మోహన్ బాబు కోసం పీబీ శ్రీనివాస్ అందంగా పాడేస్తాడు.
నువ్వుంటే కోలాహలం…
లేకుంటే హాలాహలం.
పట్టో విడుపో తేలాలంటే పదపోదాం సింహాచలం అంటూ .
నిజానికి బాపుగారి స్నేహం కన్నా ముందే తమిళ దర్శకుడు బాలచందర్ హలంతో హీరోయిన్ రోల్ చేయించారు. పైగా ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది కూడా. తెలుగులో పి.సాంబశివరావు డైరక్ట్ చేసిన రంభ ఊర్వశి మేనకలో కీలక పాత్రే చేయించారు. అయినా…హలం హీరోయిన్ గా కంటిన్యూ కాలేదు..
హలం పేరు వినగానే గుర్తొచ్చే మరో సినిమా మన్మధలీల. బాలచందర్ తీసిన తమిళ సినిమాకు తెలుగు అనువాదం. అందులో కమల్ హసన్ భార్యగా నటించి మెప్పించారు హలం.
నిజానికి ఆ సినిమా టైటిల్స్ లో హలం పేరు చూసి ఏ వ్యాంపో అనుకున్న వాళ్లు సినిమాలో ఆవిడ కారక్టర్ చూసి జడుసుకున్నారు. వుమెనైజర్ అయిన భర్తతో వేగే భార్యగా అద్భుతంగా నటించింది హలం. అందులో భార్యా భర్తల మీద అద్భుతమైన పాట ఒకటి ఉంటుంది. కుశలమేనా భామలంతా…అంటూ సాగే ఆ పాటలో కూడా హలం అభినయం అసాధారణంగా ఉంటుంది.
మన్మధలీలకూ శంకరాభరణానికీ ఓ పోలిక ఉంది. శంకరాభరణంలో నటించే నాటికి మంజుభార్గవి కూడా వ్యాంప్ కారక్టర్లు చేస్తోంది. ఐటమ్ సాంగ్స్ తో బిజీగా ఉండేది. మన్మధలీల నాటికి హలం పరిస్ధితి కూడా అదే. అయితే శంకరాభరణం రోజుల్లో మంజు భార్గవికి ఏ విధమైన రిస్టిక్షన్స్ పెట్టలేదట విశ్వనాథ్.
కానీ మన్మధలీల టైమ్ లో హలం కు మాత్రం బాలచందర్ నిబంధనలు విధించారట. ఈ సినిమా విడుదలయ్యే వరకు బయట ఐటమ్ సాంగ్స్ చేయద్దు అనేదే ఆ నిబంధన. స్వయంగా మంజుభార్గవే అప్పట్లో ఈ విషయం చెప్పింది.
హలం మంచి నటి అని చాలా సినిమాల్లో ప్రూవ్ అయ్యింది. బాపుగారి సినిమా మనవూరి పాండవుల్లో రామ్ భూపాల్ దొరవారి కుమారరత్నాన్ని లైన్ లో పెట్టే గడుసు మోడ్రన్ అమ్మాయి పాత్రలో జీవించేసింది హలం. ముఖ్యంగా నార్త్ ఇండియన్ గా నటిస్తూ…దగ్గర కొచ్చినప్పుడు తెలుగు మాట్లాడుతూ హుషారుగా చేసింది.
తొంభై దశకం నాటికే తెరమరుగైపోయిన హలం ఆ తర్వాతెప్పుడూ వార్తల్లోకి రాలేదు. ఒక చైనా దేశీయుడ్ని పెళ్లాడి సినిమాలకు గుడ్ బై చెప్పారనే వార్తయున్నూ … ఆవిడ భర్త బెంగుళూరులో ఏదో ఒక బార్ ఓనర్ అనిన్నీ మరో మిత్రుడు పల్లంరాజు గారు చెప్పారు.
నేనూ … (పెళ్లిపుస్తకంలో గుమ్మడిలా) రమణగారు కోతికొమ్మచ్చిలో ఎక్కడైనా ఈవిడకు సంబంధించిన ఆచూకీ చెప్తారేమో అని వెతికాను. కనిపించలేదు. ఏదో .. ఆ ఎంతటి రసికుడివో పాట గురించి తప్ప.
తను సినిమా రంగం నుంచి నిష్క్రమించినా…సినీ అభిమానులు మాత్రం తనను మరచిపోలేదు.
ఇది పాత పోస్టుకు కొద్దిగా రివిజను …
నేనూ రివిజనిస్టునే
Share this Article