Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ వస్తుందని ఎవరు చెప్పినా… ఎకసక్కేలతో వెక్కిరింపులు సాగేవి…

June 2, 2023 by M S R

Murali Buddha………   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళుతున్నాను .. తెలంగాణ రాష్ట్రంతోనే తిరిగి వస్తాను .. కోట్ల మందికి విశ్వాసం కలిగించి .. ఆత్మహత్యలను ఆపిన ఒక్క మాట……… జర్నలిస్ట్ జ్ఞాపకాలు…

————————-

అంతా అయ్యాక ఇప్పుడు ఏ టుంరీలు ఏమైనా మాట్లాడవచ్చు . కానీ తెలంగాణ రాష్ట్రం అంత ఈజీగా ఏమీ రాలేదు . ప్రతి క్షణం సస్పెన్స్ .. నరాలు తెగేంత ఉత్కంఠ … ఏమవుతుందో తెలియని భయం .. మరో వైపు మాఫియా మీడియా …

సాధారణంగా బ్రేకింగ్ న్యూస్ మనకు తెలిసినవే .. బ్రేకింగ్ న్యూస్ కాకుండా అతికించే న్యూస్ ఒకే ఒక్కటి .. అది ఎంతో మంది ప్రాణాలు తీసింది .. భయపెట్టింది .

Ads

ఒక్క మాట.. ఔను, ఒకే ఒక్క మాట.. పోయే ప్రాణాలను నిలబెట్టింది … మాటకు ఎంత శక్తి ఉంటుందో నిరూపించిన మాట అది . మీడియా ప్రచారం వల్ల సర్వత్రా నిరాశ ఆవహించిన సమయం అది.. ఆత్మహత్యలు మళ్ళీ మొదలైన సమయం.. ఆ సమయంలో తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ వస్తుంది అని తాను చెప్పదలుచుకున్నది చెప్పి … ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళుతున్నాను, తెలంగాణ రాష్ట్రంతోనే తిరిగి వస్తాను అని పిడికిలి బిగించి ఆత్మవిశ్వసంతో పలికారు .

ఆ విలేఖరుల సమావేశంలో నేనూ.. సిడబ్ల్యూసి నిర్ణయం అయిపోయిన తరువాత నాకు ఎప్పుడూ తెలంగాణ రాదేమో అనే అనుమానం కలుగలేదు . కానీ మీడియా ప్రచారంతో భయాలు పెంచారు . మీడియా సమావేశం ముగించి కిందకు వచ్చాక కెసిఆర్ గారికి అదే చెప్పాను .. ఆత్మ విశ్వాసంతో మీరు చేసిన ప్రకటన బాగుంది . టివిల వల్ల భయం పెరిగింది . మీ ప్రకటనతో తెలంగాణ కోరుకుంటున్న వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది అని ….

******

16 డిసెంబర్ 2013న రాష్ట్ర విభజనకు సంబంధించి డ్రాఫ్ట్ బిల్లును అప్పటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు . అంతకు ముందే సిడబ్ల్యూసి నిర్ణయం అయిపొయింది . కేంద్ర మంత్రి మండలి ఆమోదం అయిపోయింది . డ్రాఫ్ట్ బిల్లు రాష్ట్రపతికి పంపడం అయిపోయింది . సంప్రదాయం ప్రకారం అసెంబ్లీకి పంపించారు . అభిప్రాయం కోసమే తప్ప అసెంబ్లీ నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదు . ఆంధ్ర ప్రాంత శాసన సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉండడం తెలంగాణలో తక్కువ సంఖ్య కావడం వల్ల బిల్లు వీగిపోతుంది అని ముందే తెలుసు . ఐతే అసెంబ్లీలో బిల్లు వీగిపోగానే తెలుగు మీడియా హడావుడి అంతా ఇంతా కాదు . బ్రేకింగ్ న్యూస్ స్థానంలో టివిలు పగిలిపోయేంత శబ్దంతో.. ఆంధ్ర తెలంగాణ రెండింటిని అతక బెడుతున్నట్టు చూపిస్తూ హడావుడి చేశారు .

ఆ రోజు అసెంబ్లీ ముగియగానే లాబీ నుంచి బయటకు వస్తే మెట్ల వద్ద న్యాయ నిపుణులు జంధ్యాల రవిశంకర్ జర్నలిస్ట్ లతో ఇక ఇప్పుడేమవుతుంది అని చెబుతున్నారు . అసెంబ్లీ తీర్మానమే అత్యున్నతం అన్నట్టుగా సాగుతుంది ఆయన వాదన . ఎక్కువ మంది జర్నలిస్ట్ లు అదే కోరుకుంటున్నందున ఆసక్తిగా వింటున్నారు . కొంతసేపు విని నేను ‘‘అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలను అతక బెట్టేస్తారా ?’’ అని కొంత వెటకారంగా అడిగాను .

అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే అడిగారు , ఆ అభిప్రాయం అనుకూలం కావచ్చు వ్యతిరేకం కావచ్చు అని కేంద్రం చెబుతున్నప్పటికీ మీడియా ప్రచారం వల్ల మరికొన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి . ఆ సమయంలోనే కెసిఆర్ సాయంత్రం తెలంగాణ భవన్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళుతున్నాను . తెలంగాణలోనే తిరిగి వస్తాను అని అటు నుంచే ఢిల్లీ వెళ్లి .. నిజంగా తెలంగాణ సాధించిన తరువాతనే హైదరాబాద్ లో అడుగు పెట్టారు . తిరిగి వచ్చాక ఆ రోజు ఒక్క NDTV తోనే మాట్లాడారు . మాకు కాంగ్రెస్ తోనే పోటీ, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరం అయితే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని కెసిఆర్ చెప్పారు . ప్రధాన ప్రత్యర్థికే మద్దతు ఇవ్వడానికి సిద్దపడడాన్ని NDTV ఆశ్చర్యంగా చూసింది .

*****

మల్లిక్ కార్టూన్ ఒకటి … కెసిఆర్ పక్కన ఉంటే ఒక వ్యక్తి పదిహేను రోజుల్లో తెలంగాణ వస్తుందట అని కిందపడి దొర్లుతూ నవ్వుతుంటాడు . మల్లిక్ కార్టూనిస్ట్ కాబట్టి తన మనసులోని అభిప్రాయాన్ని కార్టూన్ రూపంలో ప్రదర్శించారు . తెలంగాణ వస్తుంది అని కెసిఆర్ చెప్పినప్పుడు చాలా మంది నాయకులు ఇలానే ఎకసెక్కాలు ఆడేవారు . ఢిల్లీ నుంచి నాకు సిగ్నల్స్ ఉన్నాయి , తెలంగాణ ఏర్పడుతుంది అని కెసిఆర్ చెబితే చాలా మంది కాంగ్రెస్ నాయకులు తెలంగాణ భవన్ లో టవర్లు ఏమైనా ఏర్పాటు చేశారా అని జోకులేశారు . సిడబ్ల్యూసి తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకోలేదు . అనేకసార్లు సమావేశాలు జరిగాయి . సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోకపోతే ‘‘తుస్సుమన్న సిడబ్ల్యూసి సమావేశం’’ అని కొమ్మినేని చేసిన కామెంట్ గుర్తుంది . తీరా సిడబ్ల్యూసిలో తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే , ఎవరినీ సంప్రదించకుండా హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు అని ధ్వజమెత్తారు .

****

కెసిఆర్ తో మాట్లాడితే తెలంగాణ వస్తుంది అని నమ్మకం కలుగుతుంది . బయటకు వెళ్లి ఎవరితో మాట్లాడినా తెలంగాణ రాదు అనిపిస్తోంది అని జర్నలిస్ట్ మిత్రుడు అనేవాడు . బాగ్ లింగంపల్లి వద్ద 1969 ఉద్యమకారుల సమావేశం జరిగింది . గద్దర్ పాల్గొన్నారు . తెలంగాణ వస్తుందా ? అని అడిగితే ఆంధ్ర నాయకుల లాబీ సామాన్యమైనది కాదు . రానివ్వరు అని చెప్పారు . యుద్ధ నౌకలు , అప్పుడు ఉద్యమంలో కీలక స్థానాల్లో ఉన్న నాయకులను సకల జనుల సమ్మె సమయంలో అడిగితే రాదు అన్నట్టుగానే మాట్లాడేవారు . ఒక్క కెసిఆర్ మాత్రం ఉద్యమ సన్నాహక సమావేశాలు నుంచి చివరి వరకు తెలంగాణ వస్తుంది .. ఎలా వస్తుందో చెప్పేవారు …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions