బాగా చదువుకున్నవాళ్లు రాజకీయ పదవుల్లో రాణించాలని ఏమీ లేదు… కానీ రాజకీయ పదవుల్లోకి బాగా చదువుకున్నవాళ్లు రావాలి… పారడాక్స్ ఏమీ కాదు… నిజమే… ఇప్పుడు ఈ చర్చ ఎందుకు నడుస్తున్నదంటే..? బాలాసోర్ రైలు ప్రమాదం తరువాత మంత్రి అశ్విన్ వైష్ణవ్ తూతూమంత్రం పర్యటనలకు వెళ్లి, శుష్క బాష్పాలు రాల్చి వెళ్లిపోలేదు… రెండురోజులుగా అక్కడే ఉన్నాడు… సహాయకచర్యల్ని, పునరుద్ధరణ పనుల్ని పర్యవేక్షిస్తున్నాడు… ఆ ఫోటోలు పత్రికల్లో కనిపిస్తున్నాయి…
వృద్ధులకు, జర్నలిస్టులకు రాయితీల్ని కత్తిరించేసిన తన పనితీరు మీద ఆల్‌రెడీ కొందరికి అసంతృప్తి ఉంది… కానీ ఒక విపత్తు వేళ, ఒక ఆపత్కాలంలో తన నిజమైన పనితీరు కనిపిస్తోంది… ఎవరీయన..? చాలామంది అడుగుతున్న ప్రశ్న… ఆసక్తికరమైన ప్రస్థానం తనది… ఓసారి చదవాల్సిన కథే… కేబినెట్ మార్పుల సమయంలో రెండేళ్ల క్రితం ‘ముచ్చట ఈ మంత్రిపై ఓ కథనం పబ్లిష్ చేసింది… దాన్ని మరోసారి నెమరేసుకుందాం…
మోడీ కేబినెట్ మార్పుల తరువాత… మా మోడీ సర్కారులో ఇప్పుడు ఇంతమంది బాగా చదువుకున్నవాళ్లు ఉన్నారు తెలుసా..? ఇదీ మా కేబినెట్ క్వాలిటీ అంటూ కాషాయ సెక్షన్ సోషల్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది… ఎస్, కాస్త చదువుకున్నవాళ్లు బాగానే కనిపిస్తున్నారు… కానీ చదువే అర్హత కాదు, ఇవేమీ అడ్మినిస్ట్రేటివ్ కొలువులు కావు… రాజకీయ పదవుల డైమెన్షన్స్ పూర్తిగా వేరు… ఇదే లెక్కన మనం మోడీ చదువునూ మన్మోహన్‌సింగ్ చదువునూ పోల్చగలమా..?
Ads
సో, మంచి చదువు నాయకుడికి అవసరమే, కానీ అదే అల్టిమేట్ కాదు…… ఈ చర్చకు ప్రధాన కారకుడు ఇప్పుడు అశ్విన్ వైష్ణవ్… యాభయ్యేళ్ల ఈ మాజీ ఐఏఎస్ అధికారి వయస్సు రాజకీయంగా రెండేళ్లు మాత్రమే, అలాంటిది ఏకంగా రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖలకు మంత్రి… ఏమిటింత ప్రాధాన్యం..? మోడీకి ఆయనపై ఎందుకంత గురి..? తను నిభాయించగలడా..? ఓసారి ఆయన నేపథ్యాన్ని చూద్దాం…
రాజస్థానీయుడు… బ్రాహ్మణుల్లోని బైరాగి శాఖకు చెందినవాడు… జోధ్‌పూర్‌లోనే ఇంజనీరింగు చేశాడు… ఈసీఈ బ్రాంచ్… తరువాత కాన్పూర్ ఐఐటీలో ఎంటెక్ చేశాడు… 1994 సివిల్స్‌లో 27వ జాతీయ ర్యాంకు కొట్టాడు… ఒడిశా కేడర్‌లో చేరాడు… బాలాసోర్, కటక్ కలెక్టర్లుగా చేశాడు… తను కలెక్టర్‌గా ఉన్నప్పుడే 1999 భారీ వరదలు… ఒడిశా తల్లడిల్లిపోయింది… వేల మంది మరణించారు, వేల కోట్ల ఆస్తుల ధ్వంసం… ఆ విపత్తువేళ అశ్విన్ పనితీరు సర్వత్రా ప్రశంసలు పొందింది…
ఒక అమెరికన్ నేవీ వెబ్‌సైటు సాయంతో తుపాను గమనాన్ని అంచనా వేస్తూ, చీఫ్ సెక్రెటరీకి కూడా ఆ సమాచారాన్ని, తన విశ్లేషణల్ని పంపిస్తూ… తుపాన్ తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్ని గుర్తించి, అక్కడి నుంచి జనాన్ని తరలించారు… తుపాన్ తరువాత పునరావాసం, పునర్నిర్మాణం విషయంలో అశ్విన్ వ్యవహారశైలిని జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ప్రత్యేకంగా అభినందించింది… ఐరాస కూడా ప్రశంసించిన ‘‘ఒడిశా విపత్తు అప్రమత్తత డాక్యుమెంట్’’ రచనలో అశ్విన్ పాత్ర కూడా ఉంది… డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు ఇప్పుడు ఆ డాక్యుమెంట్ మార్గదర్శి…
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు ఈ అధికారి పనితీరు సంపూర్ణంగా తెలుసు… వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు, ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రెటరీగా చేరాడు అశ్విన్… పనిచేసింది స్వల్పకాలమే అయినా పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మీద బాగా వర్క్ చేశాడు… వాజపేయి ప్రభుత్వంలో బాగా ప్రాధాన్యం కనిపించిన అంశాల్లో ఇదీ ఒకటి… తరువాత 2004లో బీజేపీ ఓడిపోయినా అశ్విన్‌ను వాజపేయి వదల్లేదు… తన దగ్గరే పర్సనల్ సెక్రెటరీగా పెట్టేసుకున్నాడు… (అప్పటి నుంచీ మోడీకి అశ్విన్ తెలుసు…)
రెండేళ్లు తనతోనే ఉండి, తరవాత మార్మగోవా పోర్టు ట్రస్టుకు డిప్యూటీ ఛైర్మన్‌గా వెళ్లాడు… అదొక అత్యంత పురాతన పోర్టు… 3, 4 వేల మంది ఉద్యోగులుంటే ఆరేడు వేల మంది పెన్షనర్లు… రెండేళ్లు చేసి, ఇక అమెరికా పెన్సిల్వేనియా వర్శిటీలో ఎంబీఏ చదవడానికి వెళ్లిపోయాడు… ఎంటెక్ ప్లస్ ఎంబీఏ ప్లస్ ఐఏఎస్…
అప్పుడే అయిపోలేదు… ఎంబీయే చదివి వచ్చాక ఐఏఎస్ వదిలేశాడు… GE Transportation ఎండీగా చేరాడు… Siemens వైస్ ఛైర్మన్‌గా చేశాడు… రెండూ ప్రిస్టేజియసే… 2012లో కార్పొరేట్ కొలువుల్ని వదిలేసి, Three Tee Auto Logistics Private Limited, Vee Gee Auto Components Private Limited పేర్లతో సొంతంగా గుజరాత్‌లో యూనిట్లు పెట్టేసుకున్నాడు… రెండూ ఆటోెమోటివ్ కంపెనీలే… అక్కడ మోడీతో మరింత సాన్నిహిత్యం పెరిగింది… మోడీ ప్రధాని అయ్యాక కూడా కొనసాగింది…
2019… మోడీ తనను రాజ్యసభ బరిలోకి దింపాడు… అభ్యర్థిగా ప్రకటించిన మరుసటిరోజు అధికారికంగా బీజేపీలో చేరాడు, చేరిన ఆరు రోజులకే రాజ్యసభ సభ్యుడయ్యాడు… నవీన్ పట్నాయక్‌కు అశ్విన్ అంటే అభిమానం కదా… తన మీద పోటీపెట్టలేదు… సపోర్ట్ చేసింది బిజూజనతాదళ్… (నవీన్ పట్నాయక్ చాన్నాళ్లు అశ్విన్‌ను ఒడిశా విపత్తు నియంత్రణ సలహాదారుగా అలాగే తన టీంలో ఉంచేసుకున్నాడు)… రాజకీయాల్లో చేరిన రెండేళ్లకే ఏకంగా రైల్వే, ఐటీ మంత్రి అయిపోయాడు… ఇదీ తన నేపథ్యం…
కలెక్టర్, పీఎంఓ, ప్రతిష్ఠాత్మక కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నత పదవులు, సొంతంగా తయారీ కంపెనీలు… సిస్టం ఏమిటో పూర్తిగా తెలిసినవాడు… గత పదవుల్లో రాణించినవాడు… ఇప్పుడు అత్యంత కీలకమైన రైల్వే శాఖలో సొంతంగా, కొత్తగా ఏం చేయగలడో చూడాలి… లక్షల ఉద్యోగులు, లక్షల మైళ్ల నెట్‌వర్క్, లక్షల కోట్ల బడ్జెట్… మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అది… పైగా ఐటీ అదనం… ఆల్ ది బెస్ట్ అశ్విన్ వైష్ణవ్…!
Share this Article