హే బ్యాట్ మ్యాన్! Brotherly Bat:
“ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలె
విహరణము సేయసాగె గబ్బిలమొకండు
దాని పక్షాని లంబున వాని చిన్ని
యాముదపు దీపమల్లన నారిపోయె”
“ఆ అభాగ్యుని రక్తంబు నాహరించి
యినుపగజ్జెల తల్లి జీవనము సేయు!
గసరి బుసకొట్టు నాతని గాలిసోక
నాల్గు పడగల హైందవ నాగరాజు”
Ads
“కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి
స్వార్థలోలురు నా భుక్తిననుభవింత్రు
కర్మమన నేమొ? దానికీ కక్షయేమొ?
ఈశ్వరుని చేత ఋజువు చేయింపవమ్మ!”
“ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుః
ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెదుకు విదల్పదీ భరత మేదిని ముప్పది మూడుకోట్లదే
వత లెగబడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులారునే?”
“వాని తలమీద బులిమిన పంకిలమును
గడిగి కరుణింప లేదయ్యె గగనగంగ”
“ఆలయంబున నీవు వ్రేలాడు వేళ
శివుని చెవి నీకు గొంతచేరువుగ నుండు
మౌని ఖగరాజ్ఞి! పూజారిలేని వేళ
విన్నవింపుము నాదు జీవిత చరిత్ర!”
“ఎంత కోయిల పాట వృథ యయ్యెనో కదా!
చిక్కు చీకటి వనసీమలందు,
ఎన్ని వెన్నెలవాగు లింకి పోయెనో కదా!
కటిక కొండల మీద మిటకరించి,
ఎన్ని కస్తూరి జింక లీడేరెనో కదా!
మురికి తిన్నెల మీద పరిమళించి,
ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనో కదా!
పండిన వెదురు జొంపములలోన,
ఎంత గంధవహన మెంత తంగెటి జున్ను
ఎంత రత్నకాంతి ఎంత శాంతి
ప్రకృతి గర్భమందు! భగ్నమైపోయెనో
పుట్టరాని చోట పుట్టుకతన”
కొన్ని శ్లోకాలు, పద్యాలు, పాటలకు అర్థం వెతుక్కోవడం కంటే…వాటిని వింటే చాలు…వాటికవిగా భావాన్ని ఆవిష్కరిస్తాయి. గుర్రం జాషువా పద్యాలు అలాంటివి. ప్రతిపదార్థ, టీకా తాత్పర్యాలు చెప్పడం ఒక సంప్రదాయం కాబట్టి చెప్పాలి- అంతే.
ఆధునిక పద్య సాహిత్యంలో జాషువా హిమాలయమంత ఎత్తు ఎదిగినవాడు. ఛందస్సు, యతి, ప్రాసల మధ్య గంగా ప్రవాహంలా సాగిపోయే జాషువా పద్యాలు చదవని, కనీసం వినని సాహిత్యాభిమానులు ఉండరు. తెలుగులో అనేక సందర్భాలకు జాషువా పద్యపాదాలు వాడుక మాటలయ్యాయి. శ్మశానానికి భస్మ సింహాసనం మీద పట్టాభిషేకం చేయించినవాడు జాషువా. సాలీడు పురుగు నోట్లో దాగిన మర మగ్గాల దారాలకు అక్షర ధారను అరువిచ్చినవాడు జాషువా. చిటారు కొమ్మన ఎండు గడ్డితో అల్లిన పక్షి గూడులో తెలుగు పద్యాన్ని ఊయలలూపినవాడు జాషువా. పిరదౌసి కవిని తెలుగు వీధుల్లో తిప్పినవాడు జాషువా. తాజ్ మహల్ అందానికి తెలుగు వన్నెల వెన్నెల పద్యాలతో వెలుగులద్దినవాడు జాషువా.
జాషువా కావ్యాల్లో అన్నీ ఆణిముత్యాలే. ప్రత్యేకించి “గబ్బిలం” కావ్యం సామాజిక సమస్యలపై ఎక్కుపెట్టిన అక్షరాస్త్రం. ప్రారంభంలో ఉన్న పద్యాలన్నీ జాషువా గబ్బిలం కావ్యంలోనివే.
గబ్బిలం ముక్కు, మొహం ఉన్న చీకటి ముద్ద అట. ఆలయంలో తలకిందులుగా వేలాడేవేళ…పూజారి లేనివేళ…దేవుడికి తన గోడు విన్నవించాలని ఒక అభాగ్యుడు గబ్బిలాన్ని వేడుకుంటున్నాడు.
అంటరానివాడికి ప్రతీకగా గబ్బిలాన్ని తీసుకుని జాషువా అల్లిన ఈ కావ్యం గుండెలను పిండేస్తుంది. ఆయన గబ్బిలం కావ్యానికి ఏడెనిమిది దశాబ్దాల వయసు దాటిన ఈ వేళ ఆ సమస్యలను ఎంతవరకు దాటి రాగలిగాము? అని సమీక్ష చేసుకోవాలని అందులో గబ్బిలం అడుగుతూ ఉంటుంది.
గుడ్డు పెట్టకుండా పిల్లలను కనే క్షీరదాల జాతికి చెందిన ఒకే ఒక పక్షి గబ్బిలం భూమ్మీద దాదాపు ఆరు కోట్ల సంవత్సరాలుగా ఉంది. రాత్రిళ్లు చీకట్లో వేగంగా ఎగిరే గబ్బిలాలు నోటి నుండి కీచుమని ఒకరకమయిన శబ్దం చేస్తాయి. ఆ శబ్ద తరంగం వెనక్కు వచ్చి దాని చెవుల్లో పడుతుంది. ఎదురుగా అడ్డు ఉందా? లేక ఎగరడానికి అనువుగా ఉందా? అన్నదాన్ని అలా సెకెనులో వెయ్యోవంతులో అది పసిగడుతుంది. చెబితే మన మెదళ్ళకు ఇదో పెద్ద అల్ట్రా సోనిక్ సౌండ్ రిఫ్లెక్షన్ సైన్స్ థియరీ. దానికి అదొక ఆట. అదే దాని వేట. అదే దానికి కట్టని కోట.
ఆ శబ్దభేది విద్యతో కళ్లు పొడుచుకున్నా కానరాని చీకట్లో గబ్బిలం వేటకు బయలుదేరి చిన్న చిన్న పురుగులను, క్రిములను నోట్లో వేసుకుని బతికేస్తూ ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు రెండువేల రకాల గబ్బిలాల్లో ఎక్కువభాగం మనకు ఉపయోగపడేవే అని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఆధారాలతో నిరూపించారు. వారి పరిశోధన ఫలితాల వివరాలతో అనేక అంతర్జాతీయ సైన్స్ పత్రికల్లో వ్యాసాలు వచ్చాయి. ఊళ్ళల్లో దోమలు, హానికారక క్రిములను గబ్బిలాలు ఆహారంగా తినడంవల్ల మన ఆరోగ్యాలకు మంచి జరుగుతుందట. తోటల్లో మామిడి, కొబ్బరి, జీడిమామిడి చెట్లపై గబ్బిలాలు వాలడం వల్ల పరపరాగ సంపర్కం జరిగి దిగుబడి పెరుగుతుందట.
గబ్బిలాలు ఇక ఎంతమాత్రం అశుభం కాదు. ఇక మనం పరవశించి పాడాల్సిన పాట-
“కమ్మాన్! కమ్మాన్!
హే బ్యాట్ మ్యాన్!
కళ్లావి? కురులావి? రెక్కలావి?”
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article