Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రామ రామ… 24 వేల శ్లోకాల్లో వాల్మీకి ఎప్పుడైనా ఆదిపురుష్ అన్నాడా..?

June 17, 2023 by M S R

ఓం రౌత్ విరచిత ఆదిపరుష రామాయణం

శివుడికి ఆదిభిక్షువు, ఆది యోగి, శివపార్వతులకు ఆది దంపతులు అన్న పేర్లు విన్నాం. కన్నాం. ఇప్పుడు రాముడికి ఆదిపురుష్ అని సినిమావారు పేరు పెట్టారు. వాల్మీకి రామాయణం ఆధారంగానే ఆదిపురుష్ సినిమా తీశామని ప్రకటించుకున్న నేపథ్యంలో, “యత్ర యత్ర రఘునాథ కీర్తనం…తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్” అని రామకీర్తన జరిగే ప్రతిచోటా నీరు నిండిన కన్నులతో, ముకుళిత హస్తాలతో ఆంజనేయస్వామి వచ్చి… అందరికన్నా  వెనుక వరుసలో కూర్చుని… అందరికన్నా ముందు లేచి వెళతాడన్న ప్రమాణం ప్రకారం ఆదిపురుష్ ఆడే ప్రతి థియేటర్లో ఒక సీటు ఖాళీగా ఉంచుతామని ప్రకటించిన నేపథ్యంలో భక్తులకు, భాషాభిమానులకు కొన్ని సందేహాలు.

1. వాల్మీకి రామాయణం ఏడు కాండలు… 24 వేల శ్లోకాల్లో రాముడిని “ఆదిపురుష్” అని ఎక్కడన్నా అన్నారా? ఎవరన్నా విన్నారా?

Ads

2. “రామ” అన్న మాట తెలుగులోకి వస్తే ప్రథమావిభక్తి ఏకవచనం “డు” చేరి…మొదట రామ-డు అయి… చివరికి “రాముడు” అవుతుంది.

3. “ఆదిపురుష్” అయినా అంతే. ఆదిపురుషుడు కావాలి. అర్థం సంగతి దేవుడెరుగు… హిందీ పేరు మార్చకుండా అలాగే నెత్తిన పెట్టుకోవాలని ఉద్దేశపూర్వకంగానే చేసి ఉంటే… తెలుగు పురుష్ …ష్…అనుకుని మౌనంగా ఉండడం తప్ప చేయగలిగింది లేదు.

4. “శివుడి హృదయం విష్ణువు; విష్ణువు హృదయం శివుడు” అని పరమ ప్రమాణమయిన మంత్రమే ఉంది కాబట్టి ఇద్దరూ ఒకటే అనుకున్నా… ఆ కోణంలో రాముడిని త్యాగయ్య లాంటి వారు ఓంకార స్వరూపుడిగా, పరబ్రహ్మంగానే చూశారు.

5. రాముడిని పురుషోత్తముడని, మర్యాదా పురుషోత్తముడని యుగయుగాలుగా అంటున్నాం. హిందీవారు ఆదిపురుష్ అని అంటున్నారేమో మనకు తెలియదు.

6. “ఆదిపరుష్” “ఆదిమ మానవుడు” అని ఉంటే బాధపడాలి కానీ…ఎంచక్కా “ఆదిపురుష్” అనే కదా అన్నారు అనుకుని సంతోషించాలి.

7. ఇక్ష్వాకు కుల తిలకుడు, ఇనకుల చంద్రుడు, రామచంద్రుడు, రఘురాముడు, దాశరథి, శ్రీరామ్, కోదండరాముడు, అయోధ్య రాముడు, కౌసల్యా తనయుడు, సీతాపతి… ఇలా రాముడికి లెక్కలేనన్ని పేర్లు ఉండగా “ఆదిపురుష్” అన్న పేరు ఎంచుకోవడం వెనుక ఏ పౌరాణిక, మంత్రశాస్త్ర రహస్యాలున్నాయో, వాల్మీకి దారిలోనే వెళ్లామని చెప్పుకున్నవారికి కథాపరంగా రాముడిలో ఆదిపురుషుడు ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించాడో కూడా చెబితే బాగుండేది.

8. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఎక్కడయినా ఆదియోగి అంటే శివుడు. ఆది భిక్షువు అంటే శివుడు. ఎప్పుడు పుట్టాడో తెలియని అనే అర్థంలో విష్ణువును ఆదిపురుషుడు అంటున్నాం. ఎప్పుడు పుట్టాడో తెలిసిన రాముడికి కూడా అదే అన్వయమవుతుందని సినిమావారు అనుకుని ఉండాలి.

9. “వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్” అన్న శ్లోకానికి మగవారు కూడా మోహించే రాముడు అని లోకం తప్పుగా అర్థం చెప్పుకుంటున్నట్లే “ఆదిపురుష్” అన్వయంలో కూడా తప్పులో కాలేసి ఉండవచ్చు. ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలు అన్నప్పుడు “పురుష” అంటే మగవారు ఒక్కరే కాదు. మనుషులు అని అర్థం. అలా అందరూ చూడాలనుకునే మోహన రూపం రాముడిది అనే అర్థం తప్ప… పురుషులు మోహించే రూపం అని కానే కాదు. “వేదవేదాంత వేద్యాయ” “పుణ్యశ్లోకాయ” అన్న మాటలను సరిగ్గా వేదం ప్రతిపాదించిన పద్ధతిలో అర్థం చేసుకుంటేనే ఇందులో ఉన్న అంతరార్థం బయటపడుతుంది.

10. “ఏకం సత్ విప్రా బహుధా వదంతి”. ఉన్నది ఒక్క దేవుడే. వేరు వేరు రూపాల్లో, వేరు వేరు పేర్లతో చూస్తుంటాం. అంతే. రాముడిని ఆదిపురుష్ అంటే శివుడేమీ హర్ట్ కాడు… రాముడిని ఆది భిక్షువు అంటే విష్ణువేమీ అనుకోడు… అని అనుకుని ఆదిపురుష్ రచయిత, దర్శక నిర్మాతలు “సినీ అద్వైత సిద్ధాంతాన్ని” తెర మీద చూపించడానికి 500 కోట్లు గ్రాఫిక్స్ నోట్లో నీళ్లలా పోసి ఉంటే… వారి ఔదార్యానికి, హృదయ వైశాల్యానికి చేతులెత్తి నమస్కరించాలి.

11. “ఆదిపురుషా! అఖిలాంతరంగా! భూ దేవతా రమణ భోగీంద్ర శయనా!” అని వెంకటేశ్వర స్వామిలో విష్ణువును దర్శిస్తూ అన్నమయ్య కీర్తన రాసి పాడాడు. నేను దశరథుడి కొడుకును, నాపేరు దాశరథి అని రాముడే స్వయంగా చెప్పుకున్నా మనం ఆయన్ను “రామ నారాయణ” అని అంటూనే ఉన్నాం.   భద్రాద్రిలో రాముడి ప్రవర చెప్పేటప్పుడు రామచంద్రుడు, రామ నారాయణుడు అన్న పేర్లలో ఏ పేరు చెప్పాలన్న వివాదం తెలిసిందే. అలాగే ఆదిపురుషుడైన విష్ణువు మనిషిగా – రాముడిగా పుట్టి నేను మనిషిని అని ఆయనే చెప్పుకున్నా… మనం ఆదిపురుషా! అని పిలుస్తూనే ఉంటాం. ఈ కోణంలోనే రాముడికి ‘ఆదిపురుష్’పేరు సరిపోతుందని సినిమా వారు అనుకుని ఉండవచ్చు.

12. సీతమ్మ పాపిట పెట్టుకున్న “చూడామణి” అని వాల్మీకి చెబితే ఈ ఆదిపురుష్ కు అది చేతి గాజుగా కనిపించింది కాబట్టి… రాముడికి ఆదిపురుష్ అని పేరు పెట్టినా… రామ! రామ! అనుకుని సర్దుకుపోవడం తప్ప భక్తులు చేయగలిగింది ఏమీ ఉండదు!

13. తోలు వస్త్రాలు కప్పుకున్న(ఒంటికి నారచీరలు, జుట్టుకు మర్రిపాలు, చేతుల్లో ధనుస్సు, పలుగు పార, వెదురు బుట్ట, బొడ్లో కత్తి, భుజానికి అమ్ములపొది అని వాల్మీకి స్పష్టంగా చెప్పాడు) ఆదిపురుష్ మీసం మెలేసి పిలుస్తున్నాడు… వెళ్లండి. మీ ధైర్యమే మీకు శ్రీరామరక్ష!….……. -పమిడికాల్వ మధుసూదన్, 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions