పవన్ తొలి మాటతోనే నాయకుడు కాదనిపించింది … చిరంజీవి పవన్ పార్టీలతో అనుబంధం… జర్నలిస్ట్ జ్ఞాపకాలు
——–
ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉపన్యాసం కొద్దిగా చదివాక అన్నాదమ్ముల పార్టీలు , ఒక రిపోర్టర్ గా వాటితో అనుబంధాలు గుర్తుకు వచ్చాయి . పవన్ ఉపన్యాసం పూర్తిగా వినాలి అంటే తన అభిమాని అయినా కావాలి , వ్యతిరేకించే రాంగోపాల్ వర్మ అయినా కావాలి . లేదా ఆ వార్తను కవర్ చేయాల్సిన డ్యూటీ ఉన్న రిపోర్టర్ అయినా కావాలి . నేనూ ఈ మూడూ కాదు కాబట్టి పూర్తిగా వినలేక కొద్దిగానే విన్నాను .
Ads
అప్పటి వరకు పవన్ కళ్యాణ్ అంటే మా సినిమా రిపోర్టర్లు చూపించిన సినిమా తప్ప ప్రత్యక్షంగా అంచనా లేదు . పుస్తకాలు చదువుతాడు , మేధావి , మాజీ మావోలు , వరంగల్ మేధావి పవన్ వెనుక ఉన్నారు అంటూ సినిమా రిపోర్టర్ సినిమా చూపించేవాడు . అతను చెప్పిన దాన్ని బట్టి అంచనా వేసేవాడిని . అంతకు ముందు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం తరపున పవన్ ప్రచారం చేసినా చిరంజీవిపైనే తప్ప కుటుంబ సభ్యులపై పెద్దగా దృష్టి పెట్టలేదు . కాంగ్రెస్ నాయకులను పంచెలు ఊడదీసి కొట్టాలి అని పవన్ చెప్పిన సినిమా డైలాగు బాగా పాపులర్ . అంతే తప్ప అతని రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అని పెద్దగా దృష్టి పెట్టలేదు .
అన్నా దమ్ములు ఇద్దరి రాజకీయాలపై అవగాహన ఉంది . పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీ పెట్టి మైకు ముందు మాట్లాడిన మొదటి మాటతోనే ఇతను రాజకీయ నాయకుడు కాదు , రాజకీయాల్లో నిలబడలేడు అని చెప్పేశాను . పవన్ మిత్రుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘‘ఆ మాట వినగానే రెండు చేతులు జేబులో పెట్టుకొని అలా వెళుతూనే ఉన్నాను’’ అన్నట్టే ఉండింది నా పరిస్థితి .
****
14 మార్చ్ 2014 … తేదీ నెట్ లో చూశా . మరీ అంత బాగా గుర్తు పెట్టుకోలేను… సాయంత్రం సమయం . ఆంధ్రభూమి ఆఫీస్ లో అప్పుడు రెండే టివిలు ఉండేవి . సెల్ ఫోన్ లో టివి చూసే రోజులు కావు . ఎడిటర్ ఛాంబర్ లో టివి చూడలేక . ఇంజనీర్లు ఉండే చోట టివి ముందు గుంపుగా చేరిపోయాం . పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రకటన చేసే మీటింగ్ అది . హైటెక్స్ లో మీటింగ్ . వేదిక అంటూ ఏమీ లేదు . కార్పొరేట్ లుక్ . మైకు ముందు పవన్ ఒక్కరే ఉన్నారు . వేదికే లేదు . ఇక వేదిక మీద ఎవరుంటారు . ఈ పదేళ్ల కాలంలో పవన్ తో పాటు వేదికపై మరొకరు నాదెండ్ల మనోహర్ కనిపిస్తున్నారు. అంతే. అంతకు మించి మార్పు లేదు .
ఆ రోజు హైటెక్స్ లో అభిమానుల కోలాహాలం . పేపర్ ఆఫీస్ లో పని పక్కన పెట్టి గుంపుగా టివి ముందు చేరాం అంటే అక్కడ అభిమానుల సందడి ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించవచ్చు . ఆంధ్ర , తెలంగాణ అనే తేడా లేకుండా టివి ముందు చేరిన గుంపులో పవన్ అభిమానులే ఎక్కువ . పవన్ మైకు చేతిలోకి తీసుకోని చెప్పిన మొదటి మాట ఈ మీటింగ్ కు వచ్చే ముందు కూడా పార్టీ పెట్టాలా ? వద్దా ? అని ఆలోచించాను అన్నారు .
ఆ మొదటిమాట వినగానే ఇతను నాయకుడు కాదు , పార్టీ విజయం సాధించదు అని అంచనా వేశాను . మరో ఐదు నిముషాలు విని చాలు అనుకోని నాయకుడు , కాదు , పార్టీ గెలవదు అని అభిప్రాయం చెప్పాను . నువ్వు తెలంగాణ ఏర్పాటు కోరుకుంటున్నావు , పవన్ సమైక్యాంధ్ర అంటున్నాడు కాబట్టి నువ్వు అలానే అంటావులే అని తెలంగాణ మిత్రుడే అన్నాడు . పవన్ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించడం పెద్ద ఆశ్చర్యం కాదు , వింత కాదు , ఊహించని నిర్ణయం కాదు . దానికి దీనికి సంబంధం లేదు అన్నాను .
*****
పవన్ తొలి మాటతోనే ఒక అంచనాకు ఎలా వచ్చాను అంటే . రాజకీయాల గురించి ఎవరెన్ని నీతి సూక్తులు చెప్పినా .. రాజకీయాలు చాలా ఖరీదైనవి . ఒక వ్యక్తికి వ్యాపారం , వృత్తి , ఉద్యోగం , జీవనం ఎలానో ? రాజకీయ నాయకుడికి రాజకీయం అలాంటిదే . ఒక నియోజక వర్గంలో ఒక పార్టీ నుంచి సీరియస్ గా కనీసం ముగ్గురు టికెట్ ఆశిస్తారు . మూడు పార్టీలు అనుకుంటే కనీసం ఐదుగురు ఐదేళ్ల పాటు టికెట్ కోసం ఖర్చు చేస్తారు .
ముగ్గురికి మూడు పార్టీల నుంచి టికెట్ వస్తుంది . ఒక్కరు గెలుస్తారు . మిగిలిన వారి పెట్టుబడి వృధా అయినట్టే . రాజకీయం అంటే అంత రిస్క్ ఉంటుంది . మనం పాతిక వేల జీతానికే ఇంకో పత్రికలో చేరాలి అంటే… అది ఉంటుందా ? నాలుగు కాలాలు నడుస్తుందా ? జీతాలు ఇస్తారా ? అని పాతిక సందేహాలు వ్యక్తం చేస్తాం . అలాంటిది ఒక పార్టీ నుంచి నాయకుడు జనసేన లోకి రావాలి అన్నా , లేదా కొత్త వాళ్ళు తమ భవిష్యత్తును పణంగా పెట్టి జనసేనలోకి రావాలి అంటే వారిలో ఎంత విశ్వాసం కలిగించాలి . రేపు మనం అధికారంలోకి వచ్చేస్తున్నాం అనే విశ్వాసం కలిగిస్తే టికెట్ ఆశించే వాళ్ళు సమయం , డబ్బు వెచ్చిస్తారు . పార్టీ ప్రకటన చేసే నిమిషం వరకు పార్టీ పెట్టాలా ? వద్దా ? అని ఆలోచించే నాయకుడిని నమ్మి తమ భవిష్యత్తు పణంగా పెట్టి వచ్చేది ఎవరు ?
అభిమానులు వేరు , రాజకీయ నాయకులు వేరు . పవన్ కు ఎవరికీ లేనంత మంది అభిమానులు ఉన్నారు . నాయకులే లేరు .. ఆయన్ని ఇప్పటికీ రాజకీయ నాయకుడు అనుకునే వారు తక్కువ . ఐతే తొమ్మిదేళ్లు పార్టీని నడిపిస్తాడు అనుకోలేదు . ఐనా ఆయన ఒక్కరు తప్ప పార్టీ అంటూ ఏముంది ? వన్ మాన్ షో నడిపే పార్టీల్లోనూ చెప్పుకోవడానికి కొందరు నాయకులు ఉంటారు. జనసేనలో పవన్ తప్ప ఎవరూ లేరు . ఆయనకు నాయకుడిగా గుర్తింపు లేదు . ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు బాగా లేదు ? ఏం తప్పు చేస్తుంది ? ఆ పార్టీని ఓడించి, మిమ్ములను గెలిపిస్తే ఇంత కన్నా గొప్పగా ఏం చేస్తారు ? అది చెప్పగలగాలి. అంతే తప్ప నాకు జగన్ నచ్చలేదు కాబట్టి ఓడిస్తాను, ఇది శాసనం అంటే సినిమా డైలాగులకు బాగుంటుంది . జనం నమ్మి ఓటు వేయడానికి తమ భవిష్యత్తు మీ చేతిలో పెట్టడానికి ఆ డైలాగులు పని చేయవు . ప్రజలు వేరు, అభిమానులు వేరు . సినిమా వేరు, రాజకీయం వేరు .
****
2008 లో చిరంజీవి పార్టీ పెడతాడా ? పెట్టడా అని అనుకుంటున్న రోజుల్లో సతీష్ అని ఓ జర్నలిస్ట్ ఫోన్ చేశాడు . చిరంజీవికి సన్నిహితుడు మాక్సీ ఐ విజన్ కాసు ప్రసాద రెడ్డి మాట్లాడుదాం అంటున్నారు వస్తావా ? అంటే పరుగెత్తుకెళ్ళాను . బేగంపేటలో హాస్పటల్… అక్కడ అల్లు అరవింద్ నిలువెత్తు ఫోటో ఉంది . చిరంజీవి పార్టీ పెడితే ఎలా ఉంటుంది అని చాలా సేపు చర్చలు… అప్పుడు ఈనాడులో ఉన్న విజయ్ , ఆంధ్రజ్యోతి రిపోర్టర్ , నేనూ , సతీష్ . నలుగురం . సతీష్ ఏ పేపర్ అంటే అతనికి పేపర్ ఉండదు . ఏదో ఊరు పేరు లేని చిన్న పేపర్… కానీ అతనికి తెలియని నాయకుడు ఉండేవారు కాదు ఉమ్మడి రాష్ట్రంలో … చర్చలు రాయవద్దు అని కండిషన్ కానీ … మరుసటి రోజు అన్ని పత్రికల్లో చిరంజీవి పార్టీ పెడుతున్నట్టు ఈ చర్చల సారాంశాన్ని అందరూ రాశారు . చిరంజీవి పార్టీ పెడుతున్నట్టు మొదటిసారి చిరంజీవితో మాట్లాడి రాసింది సిహెచ్ వి ఏం కృష్ణారావు …
****
శోభానాగిరెడ్డి టీడీపీ శాసన సభ్యురాలిగా పరిచయం… చిరంజీవి పార్టీ పెట్టాక ప్రజారాజ్యం లో చేరారు . చిరంజీవి సన్నిహితులు గోపాల్ అని నిర్మాత నీతో మాట్లాడుతారు అని శోభానాగిరెడ్డి చెబితే బంజారాహిల్స్ లోని చట్నీస్ హోటల్ లో కలిశాను . అన్ని పార్టీల గురించి , వామపక్షాల గురించి గోపాల్ అనేక విషయాలు అడిగారు . ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవికి 30 వరకు సీట్లు రావచ్చు అని చెబితే, అంతేనా అని విస్తుపోయారు . అప్పుడు జ్యోతిలో 90 శాతం మహిళలు , 90 శాతం యువత చిరంజీవికే ఓటు అని ఏవేవో పిచ్చి పిచ్చి సర్వేలు వేశారు . వాటిని నమ్మకండి 30 వస్తే సక్సెస్ అన్నాను .
గజిని సినిమా కథ కొద్దిగా చెప్పాడు . తెలుగులో తానే తీసుకున్నట్టు చెప్పాడు . కథ చాలా వెరైటీగా ఉంది . సూపర్ హిట్ అవుతుంది అని చెప్పాను . ( హోటల్ లో టిఫిన్ బిల్లు ఆయనే కట్టారు ) గజిని సినిమా హిట్టయింది . చిరంజీవి పార్టీనే అట్టర్ ఫాప్ అయింది . అన్నిటికీ టైం ముఖ్యం . ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం లేని సమయం . చిరంజీవి వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం , కాంగ్రెస్ , టీడీపీ పరస్పరం ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి . బాబు హయాంలో వరుసగా ఐదేళ్ల కరువు , వై యస్ ఆర్ హయాంలో వర్షాలు , పథకాలు బాగా ప్రభావం చూపాయి . కాలం కాని కాలం విడుదల కావడంతో చిరంజీవి ప్రజారాజ్యం సినిమా ప్లాప్ అయింది .
ఎన్నికల తరువాత ప్రజారాజ్యం నుంచి గెలిచిన శాసనసభ్యులు చిరంజీవితో కాంగ్రెస్ లో కలుద్దాం, మీరు వస్తామంటే మీ నాయకత్వంలో కలుస్తాం, లేదంటే మేమే వెళ్లి కలిసి పోతాం అని ప్రతిపాదన … టీడీపీలో ఆఫీస్ సెక్రెటరీ ఏఎం రాధాకృష్ణ ఉండేవారు . ప్రజారాజ్యంలో చేరారు . చిరంజీవికి సన్నిహితులు . చిరంజీవి ఏం చేస్తే బాగుంటుంది అని పార్టీలో చర్చ… రాధాకృష్ణ అదే ప్రశ్న నన్ను అడిగారు . రాజకీయ పార్టీ అంటే అంతా రెడీ అయ్యాక వచ్చి నటించిపోవడం కాదు . చాలా ఓపిక ఉండాలి . ఓపిక ఉంటే పార్టీ నడపమనండి , భవిష్యత్తు ఉంటుంది . ఓపిక లేకపోతే కాంగ్రెస్ లో కలిపేస్తే రాజ్యసభ కేంద్రంలో మంత్రి పదవి అన్నాను .
ప్రజారాజ్యంను వైయస్ ఆర్ పెట్టించారు అని , చిరంజీవి పార్టీని అమ్మేశారు అని ఎవరికి తోచిన ప్రచారం వాళ్ళు చేస్తారు కానీ . చిరంజీవి కాంగ్రెస్ లో పార్టీని కలుపకపోతే శాసనసభ్యులే కలిపేసే వారు . వారి భవిష్యత్తు వారికి ముఖ్యం . రాజకీయాల్లో అన్నదమ్ములు ఇద్దరూ సూపర్ స్టార్లు , రాజకీయాల్లో అన్నాదమ్ములు ఇద్దరూ ఫెయిల్యూర్ స్టార్లు .. తమ్ముడేమో తన కోసం కాకుండా చంద్రబాబు కోసం తంటాలు పడుతున్నాడు అనిపిస్తోంది . రాజకీయాల్లో అంత నిస్వార్ధం వర్కౌట్ అవుతుందా ? — బుద్దా మురళి
Share this Article