మరి ఐఐటీ అంటే మజాకా..? ఈజీగా పదో పన్నెండో ఫస్ట్ ర్యాంకులు, ఇరవయ్యో ముప్ఫయో సెకండ్ ర్యాంకులు ఉంటాయి… అంతెందుకు వంద లోపు అయిదొందల ర్యాంకులుంటయ్… అవసరమైతే వీటిని డబుల్ చేసుకోవచ్చు… ఒక విద్యార్థి ఒక్క కాలేజీలోె చదవాలని ఏమీ లేదు… కార్పొరేట్ ఇంటర్ అంటే నాలుగైదు కాలేజీల్లో చదవొచ్చు, అసలు చదవాల్సిన పని కూడా లేదు…..
ఈరోజు పత్రికలు చూస్తే అనిపించింది అదే… మన తెలుగు దినపత్రికలు యాడ్స్ కోసం, కస్టమర్లు-పాఠకులను ఎడ్డోళ్లను చేయడానికి ఒక్కోరోజు ఏడెనిమిది ఫస్ట్ పేజీలను ప్రింట్ చేస్తుంటారు కదా… అఫ్ కోర్స్, రాబోయే రోజుల్లో ప్రతి పేజీ ఫస్ట్ పేజీగా మాస్ట్ హెడ్ ప్రింట్ చేస్తారేమో కూడా తెలియదు… సేమ్, ఐఐటీ ర్యాంకులు కూడా అంతే…
నారాయణ కాలేజీ వాడు అయిదు ఫస్ట్ ర్యాంకులూ మావే అని ఓ యాడ్ పడేశాడు… పత్రికలు కళ్లకద్దుకుని, నీకాల్మొక్తం బాంచెన్ అనుకుంటూ పబ్లిష్ చేసేశాయి… నిజానికి వాటిల్లో ఒకటి ఫిమేల్ టాపర్, మిగతావి వేరే కేటగిరీలు… అందులోనూ ఒకే కేటగిరీలో నాలుగు ర్యాంకులేమిటో అర్థం కాలేదు… నిజానికి వాడికొచ్చిన ర్యాంకుల్లో అసలు ఓపెన్ కేటగిరీ టాపర్ లేనేలేడు… అతను శ్రీచైతన్య యాడ్‌లో ఉంటాడు… పేరు చిద్విలాస్‌రెడ్డి…
Ads
నిజానికి శ్రీచైతన్య గొప్పగా యాడ్స్ వేసుకోవాలి ఈసారి… కానీ అది చేతకాలేదు వాడికి… ఎహె, ఫస్ట్ ర్యాంకుల్లో నేనే ఫస్ట్ అన్నట్టుగా నారాయణ వాడు డబ్బులు విరజిమ్మి, టాంటాం చేసుకున్నాడు… టెక్నికల్‌గా తప్పు కాదు, కానీ శ్రీచైతన్య ర్యాంకుల మోతకన్నా నారాయణ మోత ఎక్కువైపోయింది… నిజమేమిటో పేరెంట్స్‌కు తెలియదు, తెలియనివ్వరు…
ఐనా ఈ ర్యాంకులకు బన్నీ ఎందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా యాడ్స్ చేయడం..? అసలు కార్పొరేట్ యాడ్స్ అన్నీ విద్యార్థుల పేరెంట్స్‌ను, స్థూలంగా సొసైటీని తప్పుదోవ పట్టించే తప్పుడు యాడ్స్… వాటిల్లో నిజానిజాలు ఎలాగూ బన్నీకి తెలియవు… మరెందుకు ఈ యాడ్స్‌లో నటించడం..? జనాన్ని మోసగించే ఈ ప్రకటనల్లో తనెందుకు పాత్రధారి కావడం..?
ప్రతి యాడ్ ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో కొన్ని ప్రమాణాలు ఉండనక్కర్లేదా..? ఎంతసేపూ డబ్బుల యవ్వారాలు తప్ప ఇంటర్ బోర్డుకు ఏమీ పట్టదా..? సరే, ఇది జాతీయ స్థాయి పోటీ పరీక్ష… మరి ఈ పరీక్షల్ని నిర్వహించే ఐఐటీలకు ఎందుకు పట్టదు..? ఎక్కడో గౌహతిలో ఉన్న ఐఐటీ వాళ్లకు ఈ తెలుగు పత్రికల యాడ్ నిర్వాకాలు ఎలా తెలుస్తాయి అంటారా..? మరి విద్యార్థుల పేరెంట్స్‌ను హౌలాగాళ్లను చేసే ఈ కార్పొరేట్ మోసానికి కళ్లెం ఎలా..?
ఇదిగో ఇదీ నిజమైన వార్త… జనానికి తెలియాల్సిన సమాచారం… దీన్ని పక్కన పెట్టుకుని యాడ్స్ చూడండి… అన్నీ తప్పుడు ప్రకటనలే… వాడెవడో వీళ్లందరికీ నేనే స్కూళ్లలో ఫౌండేషన్ వేశాను, నాదే ఘనత అంటాడు… ఇది మరీ దారుణం… ఎస్, మన తెలుగు పిల్లలు మెడికల్, ఇంజనీరింగ్, ఎందులోనైనా ప్రతిభ చూపిస్తారు, కానీ అది సరిగ్గా రిఫ్లెక్ట్ కాదు కార్పొరేట్ యాడ్స్‌లో… వాళ్ల అవసరానికి ఎక్కడెక్కడి ర్యాంకర్లనో తీసుకొచ్చి, మా విద్యార్థులే అని యాడ్స్ చేస్తుంటారు కొన్నిసార్లు…
ఈ నిర్వాకానికితోడు నారాయణ వాడి యాడ్ పైత్యం ఓసారి చూద్దాం… ఓ పక్కన మైక్రోస్కోప్‌లో పెట్టినా కనిపించే స్కోప్ లేని అక్షరాలతో ఓ డిస్‌క్లెయిమర్ ఉంటుంది… ఈ యాడ్‌లో తప్పులుంటే మా దృష్టికి తీసుకురండి అట… ఆ తీట కూడా పాఠకుడిది, సొసైటీది… వాడు మాత్రం నోటికొచ్చిన ర్యాంకులతో కమర్షియల్ యాడ్ వేస్తాడు… విద్యారంగంలో మనకు ప్రభుత్వాలు, పరిపాలన లేదు కాబట్టి నడుస్తోంది వాడి హవా… మేధోసమాజం ఎంత మొత్తుకుంటున్నా సరే, ఈ ప్రచార పైత్యం ఇలాగే కొనసాగుతున్న తీరు అసలు విషాదం…
అసలు నిజానికి ఎంత మంది పేరెంట్స్‌కు తెలుసు… జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌కు నడుమ తేడా..? 1, 1, 1, 1, 1 అంటూ అయిదు ఫస్ట్ ర్యాంకులు ప్రకటించేస్తే వాటిల్లో తేడా ఏమిటో ఎందరికి తెలుసు..? పర్సంటైల్స్, వెయిటేజీలు, మెయిన్స్, అడ్వాన్స్‌డ్, ఎంసెట్, నీట్, జేఈఈల నడుమ తేడాలు ఎందరికి తెలుసు..? కార్పొరేట్ దోపిడీదారు దయ- మన ప్రాప్తం అన్నట్టుగా వాడి యాడ్స్ చూసి, అందరమూ గొర్రెదాటుగా మందలుమందలుగా వాడి వెనుక నడవడమేనా..?
Share this Article