ఇప్పుడు ఈనాడు రిపోర్టర్ ఎవరైనా సరే… ఎంతటి పెద్దమనిషి ఇంటర్వ్యూకు వెళ్లినా సరే… జో బైడన్ అయినా సరే, ప్రధాని మోడీ అయినా సరే, రష్యా ప్రధాని పుతిన్, చైనా బాస్ జిన్‌పింగ్ అయినా సరే… ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న… ‘‘మార్గదర్శిపై జగన్ దాడులపై మీరేమంటారు..? ఖండిస్తారా..?’’
వీళ్లనే యాజమాన్యం మనసెరిగి నడుచుకునే ఉద్యోగులు అంటారు… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? మార్గదర్శి మీద జగన్ సర్కారు దాడుల తరువాత ఎవరు ఖండిస్తే వాళ్ల వార్తలు ఈనాడులో ప్రముఖంగా ప్రచురణకు నోచుకున్నాయి… మార్గదర్శి మీద దాడులు అనేవి ప్రపంచంలో ఏ పాలకుడూ పాల్పడని నీచత్వం అని చెప్పాలి చాలు…
పవన్ కల్యాణ్ అతిప్రత్యేక ఇంటర్వ్యూలు రెండు ఈనాడులో, జ్యోతిలో కనిపించాయి… సందర్భమేమిటో తెలియదు… ఐనా పవన్ జనంలోకి రావడమే ప్రత్యేకత… అదే సందర్భం… పైగా ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు మీద చర్చ సాగుతోంది ఏపీలో… పవన్ టీడీపీకి కావాలి, సో, ఈనాడుకు కావాలి, జ్యోతికి కావాలి…
Ads
నవ్వొచ్చిందేమిటంటే..? ఈనాడు నుంచి పవన్ ఇంటర్వ్యూకు వెళ్లిన ముగ్గురు అతిరథ జర్నలిస్టుల్లో ఒకరు ఇదే పవన్ నాయకత్వం వెలగబెట్టిన ప్రజారాజ్యంపై ఓ బ్యానర్ స్టోరీ రాస్తూ… జెండా పీకేద్దాం అని మొహం మీద కొట్టాడు… మరొకటి నవ్వొచ్చిందేమిటంటే… ఈమాత్రం ఇంటర్వ్యూకు అమరావతి నుంచి ముగ్గురు పేరుమోసిన జర్నలిస్టులు వెళ్లడం… ఆంధ్రజ్యోతిలో జస్ట్, కాకినాడ రిపోర్టరే ఒంటి చేత్తో లాగించేశాడు… ఈ రిపోర్టర్ ఆ ముగ్గురికన్నా చాలా జూనియర్ ఈనాడులో ఉన్నప్పుడు… (ఫాఫం, సాక్షి వేధింపులు తట్టుకోలేక, బయటపడి జ్యోతిలో చేరినట్టున్నాడు…)
సేమ్, మార్గదర్శి మీద ప్రశ్న అడిగారు, ఖండింపచేశారు, సబెడిటర్లు కళ్లకద్దుకుని బాక్స్ కట్టి పబ్లిష్ చేశారు… మిగతా ఇంటర్వ్యూ లోతు అంశాల్లోకి వెళ్లడం లేదిక్కడ… అంత లోతైన ప్రశ్నలు వీళ్లూ అడగరు, అడిగినా పవన్‌కు పట్టవు, జవాబులు చెప్పడు… 80 వేల పుస్తకాలు చదివిన ఆయన ఎక్కడ..? ఏదో పొట్టకూటి కోసం కొలువు చేసుకునే వీళ్లెక్కడ..! సాక్షాత్తూ రామోజీరావే ఇంటర్వ్యూ చేసినా ఈ ఇంటర్వ్యూ ప్రశ్నలు ఇలాగే ఉంటాయి… ఉండాలి… సో, ఆ క్లారిటీ కాకినాడ అప్పారావుకు ఉంది… అందుకే తనొక్కడే వెళ్లాడు, తూతూమంత్రం, తుమ్మకాయ మంత్రం అన్నట్టుగా లాగించేశాడు…
సరే, ఈ సోది పక్కనపెడితే నెటిజనం నుంచి నవ్వు పుట్టించే మరో విమర్శ వచ్చింది… జగన్‌ను పంపించేద్దాం అని చాలా పెద్ద బ్యానర్ హెడింగ్ పెట్టి… పంక్చర్ తీసినట్టు… లేదా దిష్టి తీసినట్టు… ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ సిలబస్ పెట్టబోతున్నట్టు జగన్ చెప్పడాన్ని ఈ పవన్ ఇంటర్వ్యూ పక్కనే పెట్టారు… ఈ ఇంటర్వ్యూ ఫాయిదా మొత్తం కొట్టుకుపోయింది ఆ చిన్న జగన్ వార్తతో… ఇదీ సోషల్ మీడియా విశ్లేషణ…
ఇదెలా తయారైందంటే… పక్కపక్కన హెడ్డింగులు చదివితే… ఓహో, ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ సిలబస్ పెడుతున్నాడట, అందుకని జగన్‌ను పంపించేయాలని పవన్ చెబుతున్నాడు అన్నట్టుగా తయారైంది… ఇది డెస్క్ తరఫున జరిగిన పొరపాటు… ఫస్ట్ పేజీలో ఏ వార్త ఎక్కడ పెడితే జనంలోకి ఎలా వెళ్తుందనే సోయి లేకపోవడం… ఏమో, ఈనాడు డెస్కుల్లో కూడా జగన్ కోవర్టులు ఉన్నారంటారా..?! ( ఈనాడు నుంచి పవన్ ఇంటర్వ్యూకు వెళ్లిన ముగ్గురిలోనూ సోషల్ బ్యాలెన్స్ చూసుకున్నట్టుంది… హహహ… ముగ్గురూ సమర్థులు, ప్రొఫెషనల్స్… జ్యోతి అప్పారావు కూడా… సో, ఈ కథనాన్ని సరదాగా తీసుకొండి ఫ్రెండ్స్…)
Share this Article