Siva Racharla……….. ఎవరీ పెద్దమనిషి?. నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, చిన్నారెడ్డి, బలరాం నాయక్, మల్లు రవి తదితరులు వెళ్లారు. ఆ ఫోటోల్లో ఒక పెద్దమనిషి నన్ను ఆశ్చర్యపరిచారు. అర్రే, ఈయన ఇక్కడ ఎలా?, ఎందుకు అని అనిపించింది.
మొదటి ఫొటోలో నుదురు మీద చిన్న కణితి ఉన్న పెద్ద మనిషిని చూడండి. చాలా తక్కువ మందే గుర్తు పడతారు. ఆయన ఎవరో తెలుసుకునే ముందు ఆయన వయస్సు ఎంత ఉంటుందో అంచనా వేయండి?. ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, వేల ఎకరాల భూస్వామి, రేస్ క్లబ్ చైర్మన్. ఈయన మనవడు హీరో వెంకటేష్ కూతురిని పెళ్లి చేసుకున్నాడు. సినిమా మనిషి కాదు , వ్యాపారవేత్త కాదు, ఫక్తు రాజకీయ నాయకుడు, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా , నాలుగు సార్లు ఎంపీగా గెలిచాడు. ఆయన చివరిసారి పోటీ చేసింది 1996లో , మరి ఇంకా లైమ్ లైట్ లో ఉన్నారా?
రామసహాయం సురేందర్ రెడ్డి
Ads
రామసహాయం కుటుంబం అంటే పూర్వ వరంగల్ జిల్లా డోర్నకల్, మహబూబాబాద్ ప్రాంతంలో పెద్ద పేరు. సురేంద్రరెడ్డి ముప్పై సంవత్సరాల వయస్సులో “మర్రిపెడ” సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ మధుసూదనరావుగారి మరణం వలన 1965లో జరిగిన ఉప ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచారు. తరువాతి ఎన్నికల్లో అంటే 1967లో కూడా ఎంపీగా గెలిచారు.
రామసహాయం కుటుంబం
డోర్నకల్ కు చెందిన రామసహాయం రాఘవరెడ్డి మరియు దామోదర్ రెడ్డి అన్నదమ్ములు. దామోదర రెడ్డికి పిల్లలు లేరు. రాఘవరెడ్డికి కొడుకు సురేంద్ర రెడ్డి కూతురు భారతి దేవి , మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేంద్ర రెడ్డి సోదరి భారతి దేవి డోర్నకల్ కే చెందిన నూకల రాంచంద్రారెడ్డిని వివాహం చేసుకున్నారు. నూకల రామచంద్రారెడ్డి డోర్నకల్ నుంచి 1957-1972 వరుసగా నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1972లో వెంగళరావు మంత్రి వర్గంలో ఆర్ధిక మంత్రిగా పనిచేస్తూ 1974 జూలైలో గుండెపోటుతో మరణించారు.
నూకల రామచంద్రారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మాజీ ప్రధాని పీవీ గారికి సన్నిహిత మిత్రుడు. కాంగ్రెస్ గ్రూపుల్లో నీలం సంజీవ రెడ్డి వర్గంలో ఉండేవారు. రామసహాయం సురేంద్రరెడ్డి వరంగల్ దగ్గరి వడ్డేపల్లి భూస్వాములు పింగిళి ఇంద్రసేనారెడ్డి కూతురును పెళ్లి చేసుకున్నారు. విజయపాల్ రెడ్డికి ఒక్కరే కూతురు. మూడు ఆస్తులు సురేంద్రరెడ్డికి కలిసొచ్చాయి. ఎన్ని వేల ఎకరాల భూమి ఉందో కచ్చితంగా చెప్పలేను కానీ ఏపీ ఎక్సప్రెస్ వీరి భూముల్లోనుంచి పది నిముషాలు పోతుంది అనేవారు.
ల్యాండ్ సీలింగ్ కు ముందు కనీసం నాలుగు వేల ఎకరాలు ఉండొచ్చు . నిజాం కాలంలో అడవిని కూడా ఫర్మానా ఇచ్చేవారు. ఇదే ప్రాంతం మహాబూబాబాద్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి కుటుంబానికి లక్ష ఎకరాల భూమి ఉండేదని చెబుతారు. అందులో 60 వేల ఎకరాలు అడవినే.
పింగిళి ఇంద్రసేనా రెడ్డి సోదరుడు విజయపాల్ రెడ్డి వరంగల్ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. మరో సోదరుడు సోదరుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. మరో సోదరుడు పింగిళి మధుసూదనరెడ్డి బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో తొలి విమానాన్ని ల్యాండ్ చేసిన పైలెట్, ఆయన నిజాం అధికారికి పైలెట్ గా ఉన్నారు . సురేంద్ర రెడ్డి సోదరి గద్వాల సంస్థానంకు చెందిన అతన్ని వివాహం చేసుకున్నారు.
రాజకీయ రంగ ప్రవేశం
ముప్పై సంవత్సరాలలోపే సురేంద్ర రెడ్డి మర్రిపెడ సమితి అధ్యక్షుడయ్యారు. 1965లో మహబూబాబాద్ ఎంపీ ఇటికాల మధుసూదనరావుగారు మరణించటంతో జరిగిన ఉప ఎన్నికలో మహబూబాబాద్ ఎంపీగా సురేంద్ర రెడ్డి గెలిచారు. 1965 నాటికి కాసు బ్రహ్మానందరెడ్డి గారి మంత్రి వర్గంలో రామసహాయం సురేంద్ర రెడ్డి బావ నూకల రామచంద్రారెడ్డి ఆర్ధిక శాఖ మంత్రిగా ఉండేవారు. 1965 ఉప ఎన్నికల్లో రామచంద్రారెడ్డి తన బావమరిది సురేంద్ర రెడ్డికి సులభంగానే కాంగ్రెస్ టికెట్ తీసుకొచ్చుకోగలిగారు. ఇక్కడ అమరజీవి ఇటికాల మధుసూదనరావు గారి గురించి ఒక మాట చెప్పుకోవాలి.
ఇటికాల మధుసూదనరావు
ఇటికాల మధుసూదనరావుగారు గొప్ప వ్యక్తి, క్విట్ ఇండియా ఉద్యమం, నైజాం, రజాకార్ల వ్యతిరేక పోరాటంలో క్రియాశీలక నేత. దాదాపు 12 సంవత్సరాలు ఉద్యమ జీవితం గడిపారు. అనేకసార్లు దెబ్బలు తిన్నారు, అది ఆయన ఆరోగ్యం మీద ప్రభావం చూపాయి. 1957 & 1962లో మహబూబాబాద్ నుంచి గెలిచారు. 1965లో అనారోగ్యంతో చనిపోయారు. ఇటికాల మధుసూదనరావుగారు కృషి వలెనే వరంగల్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ (REC) ఏర్పడింది.
సురేంద్రరెడ్డి రాజకీయ ప్రస్థానం
1965 ఉప ఎన్నికల్లో మహబూబా బాద్ ఎంపీగా గెలిచిన సురేంద్ర రెడ్డి 1967 లో మహబూబ్ బాద్ నియోజకవర్గం రద్దు కావటంతో వరంగల్ నుంచి పోటీచేసి మరోసారి ఎంపీగా గెలిచారు.
సురేంద్ర రెడ్డి పిల్లలు
సురేంద్ర రెడ్డికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. కొడుకు రఘురామిరెడ్డి. సురేందర్ రెడ్డి పెద్ద కూతురు అమెరికాలో ఉంటారు, హిందూ పత్రిక కుటుంబానికి చెందిన అతన్ని పెళ్లి చేసుకున్నారు. చిన్న కూతురు డాక్టర్ ఇందిరా అపోలో హాస్పటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు.
రఘురామిరెడ్డి , కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్మేట్ . రఘురామిరెడ్డికి రాజ్యసభ ఇప్పించాలని కిరణ్ కుమార్ రెడ్డి చాలా ప్రయత్నం చేశారు కానీ అధిష్టానం అంగీకరించలేదు .
చివరికి 2014 ఎన్నికల ముందు ఫిబ్రవరి నెలలో గవర్నర్ కోటాలో రఘురామిరెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. కానీ అప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్కు దూరం జరగటంతో గవర్నర్ కంతేటి సత్యనారాయణ, రత్నా భాయి, నంది ఎల్లయ్య పేర్లను మాత్రమే అంగీకరించి రఘురామిరెడ్డి పేరును ఎమ్మెల్సీగా తిరస్కరించారు. ఆ సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ నర్సింహన్ మీద పలు వాఖ్యలు చేశారు కానీ గవర్నర్ మాత్రం రఘురామిరెడ్డిని ఎమ్మెల్సీగా నియమించలేదు. ఆ విధంగా రఘురామిరెడ్డి రాజకీయ ఆశలు ఆవిరి అయ్యాయి.
సురేంద్రరెడ్డి బంధుత్వాలు
రామసహాయం సురేంద్రరెడ్డికి రఘురామిరెడ్డి ఒక్కడే కుమారుడు. రఘురామిరెడ్డికి వినాయక్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇద్దరు కొడుకులు.
రఘురామిరెడ్డి పెద్ద కొడుకు వినాయక్ రెడ్డి హీరో వెంకటేష్ కుమార్తె ఆశ్రిత ను వివాహం చేసుకున్నాడు. రఘురామిరెడ్డి చిన్న కొడుకు అర్జున్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డిని వివాహం చేసుకున్నాడు.
పొంగులేటి – రేవంత్ భేటీలో సురేంద్రరెడ్డి
రాజకీయ రీ-ఎంట్రీ?
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి రఘురామిరెడ్డిని పాలేరు నుంచి పోటీ చేపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. రామసహాయం కుటుంబ చరిత్రతో పాటు పొంగులేటితో బంధుత్వం ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. `నిన్నటి రేవంత్ – పొంగులేటి భేటీలో సురేంద్ర రెడ్డి కూడా పాల్గొనటంతో పొంగులేటిని కాంగ్రెస్ వైపుకు తీసుకురావటంలో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. రఘురామిరెడ్డి పోటీకి అంగీకరించకపోయినా లేక కాంగ్రెస్ అధిష్టానం అడ్డుపడినా వరంగల్ జిల్లా పాలకుర్తి నుంచి పొంగులేటి అల్లుడు, రఘురామిరెడ్డి కొడుకు అర్జున్ రెడ్డిని పోటీకి దించుతారన్న ప్రచారం కూడా ఉన్నది.
ఈమధ్య రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో పాలకుర్తికి చెందిన NRI ఝాన్సీరెడ్డి రాహుల్ ను కలిశారు. ఆ తరువాత పాలకుర్తిలో రోడ్ షో చేశారు. ఓటమి ఎరుగని సీనియర్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్ ను ఓడించాలన్న పట్టుదలతో రేవంత్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలు, ఆస్తులు పక్కనపెడితే రామసహాయం సురేంద్ర రెడ్డి హ్యాపీ మాన్ .హైద్రబాద్ రేస్ క్లబ్ ను అభివృద్ధి చేసి దాదాపు 35 సంవత్సరాలుగా దానికి చైర్మన్ గా ఉన్నారు. కొద్దికాలం హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు గోల్ఫ్ క్లబ్ కు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. బేగంపేటలో ఉన్న తాజ్ వివాంత స్థలం & షాపర్ స్టాప్ స్థలం సురేంద ర్రెడ్డి గారిదే . వరంగల్ కు చెందిన సీనియర్ నేతలు రెడ్యా నాయక్, బసవరాజు సారయ్య, వరద రాజేశ్వర రావు లాంటి వారు సురేంద్ర రెడ్డి శిష్యులే . ఎర్రబల్లి దయాకర్ రావు తండ్రి కూడా మొదట్లో సురేంద్ర రెడ్డి అనుచరుడే …
Share this Article