మోడీ గురించి అస్సలు వినలేదని 40 శాతం అమెరికన్లు చెప్పారట… అసలు ఆయనపై విశ్వాసం లేదని 37 శాతం మంది చెప్పారట… ఇది ఓ వార్త… ఇలాంటివి ఎక్కువగా కమ్యూనిస్టుల పత్రికల్లోనే కనిపిస్తుంటాయి… అమెరికా, ఇంగ్లండు తదితర ప్రాంతాల్లో కొన్ని దిక్కుమాలిన సర్వే సంస్థలు ఉంటాయి… ఇండియాను బ్యాడ్ లైట్‌లో చూపించేలా పలు సర్వేలను అవి ప్రకటిస్తుంటాయి… మన పత్రికలు కళ్లుమూసుకుని పబ్లిష్ చేసుకుని, చంకలు గుద్దుకుంటుంటాయి… ఒక ఉదాహరణ చెప్పుకుందాం…
క్వాలిటేటివ్ బెటర్ కంట్రీ పేరిట సర్వే చేస్తుంది ఓ సంస్థ… అది ఇండియాకన్నా సిరియా, టర్కీ, అఫ్ఘనిస్తాన్ వంటి నిత్య వలసల దేశాలను కూడా ఇండియాకన్నా బెటర్ ర్యాంకింగ్స్‌తో చూపిస్తాయి… అసలు పత్రికలు, టీవీలు ప్రభుత్వాలు చెప్పినట్టు నడిచే, నడవాల్సిన కొన్ని దేశాల పేర్లను ఇండియాకు ఎగువన చూపిస్తుంది ఓ సంస్థ… అసలు వాటి సర్వే ప్రాతిపదికలే చిత్రంగా ఉంటాయి… ఈ సంస్థల సర్వే నివేదికల్ని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, బీబీసీ వంటి ఇండియా వ్యతిరేక మీడియా టాంటాం చేస్తుంటాయి… ఆప్ వంటి పార్టీలు అలాంటి మీడియాకు యాడ్స్ ఇస్తూ, పెయిడ్ స్టోరీలు రాయించుకుంటూ నెత్తిన మోస్తుంటాయి…
తాజా వార్త గురించి చెప్పుకుందాం… నిజమే, మోడీ గురించి 40 శాతం మంది వినలేదు, సో వాట్..? వినాలని ఏముంది..? ఇండియన్ రూట్స్ ఉన్న బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ గురించి ఎందరు ఇండియన్లకు తెలుసు..? తెలియాలని ఏముంది..? పోనీ,మన ఆగర్భ శత్రువు పాకిస్థాన్ ప్రధాని ఎవరో ఎందరికి తెలుసు..? అసలు మోడీ గురించి తెలియదని 40 శాతం మంది అమెరికన్లు చెబితే, మళ్లీ 37 శాతం ఆయనపై నమ్మకం లేదని ఎలా అంటారు..? అసలు మోడీ పర్యటన సాగుతోంది సరే, అమెరికన్లందరికీ ఆయన గురించి తెలియాల్సిన అవసరం ఏముంది..?
Ads
ఇవ్వాళ ఇండియా అవసరం అమెరికాకు ఉంది… అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారిక సంస్థలు, వ్యవస్థలకు మోడీ గురించి తెలిస్తే చాలు… ఇదే సర్వే రిపోర్టులో 35 శాతం మందికి జర్మనీ చాన్సిలర్ గురించి తెలియదు, 26 శాతం మందికి ఇజ్రాయిల్ ప్రధాని, 24 శాతం మందికి ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా తెలియదు… తెలియకపోతే ఏమిటి అనేది అసలు ప్రశ్న… వారం రోజులు కష్టపడి 3676 మందిని సర్వే చేశారట… వీళ్లకు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ మాత్రం తెలుసట…
రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుల గురించి రోజూ మీడియాలో చదువుతుంటారు కాబట్టి, యుద్ధం జరుగుతోంది కాబట్టి తెలిసే ఉండవచ్చు… పక్కలో బల్లెం కాబట్టి చైనా అధ్యక్షుడి గురించీ తెలిసే ఉంటుంది… సర్వేలో ఉత్తరకొరియా అధ్యక్షుడి గురించి కూడా అడిగి ఉండాల్సింది… ఒకప్పుడు మోడీకి వీసా నిరాకరించిన దేశం ఈరోజు రెడ్ కార్పెట్ పరిచి, అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఎదురేగి స్వాగతం చెప్పడం అనేది అసలు విశేషం… మోడీ మొన్నటి ఎన్నికల్లో ట్రంపుకి మద్దతు పలికినా సరే, జోబైడన్ అదేమీ పట్టించుకోకుండా వర్తమాన ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో మోడీని హత్తుకోవడమే అసలు వార్త… ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి మనం రష్యా పక్కన నిలబడినా సరే అమెరికా అధ్యక్షుడు అలగడం లేదు… మన అవసరం అలాంటిది…
అసలు ఈ సర్వే విశ్వసనీయత ఎలా ఉన్నా… నిజమే అని భావించినా సరే, ఈ వార్తలో హైలైట్ చేయదగింది… 51 శాతం మంది అమెరికన్లు ఇండియా పట్ల సానుకూలత వ్యక్తం చేయడం…!! (51 శాతం మందికి ఇండియా తెలుసు, ఇండియా అవసరం తెలుసు, కానీ ప్రధాని ఎవరో తెలియదట… మనం ఈ సర్వేను నమ్మాలట…) 23 శాతం మంది ప్రపంచ రాజకీయాల్లో ఇండియా ప్రభావం పెరిగిందని చెప్పడం…!! మోడీ అంటే వ్యతిరేకత ఉండటంలో తప్పులేదు… ప్రత్యేకించి వామపక్షాలు, వాటికి సంబంధించిన మీడియాకు… కానీ ఇలాంటి తలతిక్క సర్వేలను నెత్తిన మోయడం దేనికి..?
ఇక అమెరికన్ మీడియా విషయానికొస్తే… ఎవరో మీడియా ప్రతినిధి మోడీని అడిగాడు… ఇండియాలో ముస్లిమ్స్ రైట్స్ గురించి… సరే, మోడీ ఏదో చెప్పాడు, అది వదిలేయండి… బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్ దేశాల్లో హిందువుల గతి ఏమిటని ఆ దేశాల ముఖ్యులను ఇదే మీడియా ప్రశ్నించిందా ఎప్పుడైనా..? అంతెందుకు..? ఇదే చైనా వీగర్ ముస్లిములను నరకయాతనకు గురిచేస్తోంది… జిన్‌పింగ్‌ను అమెరికన్ మీడియా ఈ ప్రశ్న వేయగలదా..? రోహింగ్యా ముస్లింల ఊళ్లను బర్మా సైనిక ప్రభుత్వం కాల్చేస్తోంది, లక్షల మంది వలసపోయారు, ఆ ప్రశ్నలను మీడియా వేయగలదా..? ఎవడో ఓ అమెరికన్ మీడియా వాడు ఏదో రాసుకుంటే దాన్ని మన మీడియా సంబరంగా నెత్తిన మోయడం ఏమిటి..? !
Share this Article