పార్ధసారధి పోట్లూరి …….. నువ్వు ఎంత ధనవతుడివి అయినా, నువ్వు ఎంత బలవంతుడువి అయినా, నువ్వు ఎంత తెలివి గల వాడివి అయినా, కాలమనే సర్పానికి చిక్కి నశించ వలసిందే!
రష్యా మునుపెన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నది. అయితే అది బయటి శక్తుల ప్రోద్బలంతో రష్యా అంతర్గత శక్తుల వల్ల జరుగుతున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఇదే దుస్థితి లో ఉన్నాడు! పుతిన్ ఉక్రెయిన్ లో నియమించిన వాగ్నేర్ గ్రూపు పుతిన్ కి ఎదురు తిరిగింది! ఉక్రెయిన్ లో రష్యా రెగ్యులర్ సైన్యం తో పాటు వాగ్నేర్ (Wagner Group) కూడా పోరాడుతున్నది!
అసలు వాగ్నేర్ గ్రూపు అంటే ఏమిటి? వాగ్నెర్ గ్రూపు అన్నది కిరాయి సైన్యం లేదా మెర్సీనరీస్ అంటారు. ఈ గ్రూపుకి నాయకత్వం వహిస్తుంది ఎవజనీ ప్రిగో జిన్(Yevgeny Prigozhin) . ప్రిగోజిన్ రష్యన్ పౌరుడు! కానీ రెగ్యులర్ రష్యన్ సైన్యంతో సంబంధం లేదు. ప్రిగోజిన్ ప్రవేట్ సైన్యం నిర్వహిస్తున్నాడు. ప్రిగోజిన్ కింద మొత్తం 30 వేల మంది పనిచేస్తున్నారు.
Ads
వీళ్ళకి డబ్బులు చెల్లించి పుతిన్ ఉక్రెయిన్ లో ఉపయోగించుకుంటున్నాడు. ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని పుతిన్ ఇస్తున్నాడు. మందులు, ఆహారం లాంటివి ప్రిగోజిన్ సమకూర్చుకోవాలి తనకి ఇచ్చే డబ్బుతో! గత మే నెల చివరి వారం వరకూ వాగ్నర్ గ్రూపు ఉక్రెయిన్ లోని బఖుముత్ (Bakhumut) ప్రాంతాన్ని రష్యన్ సైన్యంతో కలిసి చేజిక్కించుకొని తమ ఆధీనంలోకి తీసుకున్నది.
బఖుముత్ పోరాటంలో రష్యాకి చెందిన సైనికులతో పాటు వాగ్నర్ గ్రూపులో కూడా కొంత మంది చనిపోయారు. కానీ రష్యన్ సైనికులే ఎక్కువ సంఖ్యలో చనిపోయారు, ఈ సంఖ్య విషయం ఎవరికి తెలిసే అవకాశం ఉండదు! ఎందుకంటే రష్యన్ సైన్యం పోరాడుతున్న ప్రతీ చోటా ఒక ఎలక్ట్రిక్ దహన వాటిక ఉండే ట్రక్కులు కూడా ఉంటాయి. చనిపోయిన వాళ్ళని వెంటనే ట్రక్కులో వేసి కాల్చేస్తారు తప్పితే శవాలను బంధువులకి అప్పచెప్పడమ్ లాంటివి ఉండవు!
బఖుముత్ నుండి వెనక్కి రమ్మని పుతిన్ ఆర్డర్ ఇవ్వగానే ప్రిగోజిన్ అయిష్టంగానే వెనక్కి వచ్చాడు… రష్యా ఆధీనంలో ఉన్న దొంబాస్ లోకి వచ్చింది వాగ్నర్ గ్రూపు జూన్ నెల మొదటి వారంలో. అప్పటి నుండి రెండు రోజుల క్రితం వరకు ప్రిగోజిన్ కి చెందిన వాగ్నర్ గ్రూపు దొంబాస్ లోనే ఉంది. రెండు రోజుల క్రితం హఠాత్తుగా రష్యన్ భూభాగంలోకి ప్రవేశించి రష్యా దక్షిణ ప్రాంతంలో ఉన్న రోస్ట్ వ్ (Rostov-on-Don) పట్టణంలోకి ప్రవేశించి మొత్తం పట్టణాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు ప్రిగోజిన్! వాగ్నర్ గ్రూపు ధాటికి అక్కడున్న రష్యన్ సైనికులు తట్టుకోలేక లొంగిపోయారు కొద్ది గంటలలోనే!
రష్యన్ మిలటరీ బేస్ లు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ ప్రిగోజిన్ తన ఆధీనంలోకి తీసుకున్నాడు. రోస్టవ్ పట్టణంలో యుద్ధ ట్యాంక్ లు, ఆర్మర్డ్ వెహికల్స్ రోడ్లపైకి వచ్చి చెక్ పోస్ట్ లుగా మారిపోయాయి. ప్రజలు సూపర్ బజార్లలో నెలకు సరిపడా కొనేయడంతో సూపర్ బజార్లు కొన్ని గంటలలోనే ఖాళీ అయిపోయాయి. ప్రిగోజిన్ Rostov పట్టణ ప్రజల్ని ఉద్దేశించి సోషల్మీడియాలో ప్రకటన చేశాడు ఇలా…: నేను నా దేశ ప్రజల కోసమే పోరాడుతున్నాను. నా లక్ష్యం మాస్కో లో ఉన్న రష్యా రక్షణ మంత్రిని చంపడమే! నేను యుద్ధ వీరుడిని. నా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.
ప్రిగోజిన్ నేరుగా పుతిన్ పేరుని ప్రస్తావించకుండా మాస్కో అంటున్నాడు! పేరుకే రక్షణ మంత్రి తన టార్గెట్ అంటున్నాడు కానీ ప్రిగోజిన్ లక్ష్యం రష్యన్ అధ్యక్ష పదవి మాత్రమే!
పుతిన్ ప్రతిస్పందన ఎలా ఉంది? Well… పుతిన్ లో భయాందోళన స్పష్టంగా కనిపిస్తోంది! Rostov పట్టణం వాగ్నర్ గ్రూపు అధీనంలోకి వెళ్ళగానే పుతిన్ ప్రజలని ఉద్దేశించి మాట్లాడారు! రష్యన్ ప్రజలు భయపడాల్సింది ఏమీ లేదు. ప్రిగోజిన్ దేశ ద్రోహి. అతనిని ఎవ్వరూ నమ్మ్మవద్దు, సహకరించ వద్దు. ప్రిగోజిన్ ని అరెస్టు చేసి శిక్ష వేస్తాను.
నిజానికి ప్రిగోజిన్ ని పుతిన్ బాగా నమ్మాడు. అలాగే ప్రిగోజిన్ కూడా చాలా బాగా సహకరిస్తూ వచ్చాడు పుతిన్ కి. సిరియా అంతర్యుద్ధ సమయంలో రష్యన్ సైన్యం పాత్ర తక్కువ. దాదాపుగా వాగ్నేర్ గ్రూపు ఒంటి చేత్తో ISIS రెబెల్స్ ని ఎదుర్కొన్నది రష్యా తరుపున.
పుతిన్ భయానికి కారణాలు ఉన్నాయి. ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలటరీ ఆపరేషన్ (SMO) మొదలు పెట్టినప్పుడు తన రెగ్యులర్ సైన్యం పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో 2022 సెప్టెంబర్ లో వాగ్నర్ గ్రూపుకి కాంట్రాక్ట్ ఇచ్చాడు పుతిన్. ఆ కాంట్రాక్ట్ లో భాగంగా రష్యన్ ఆయుధ డిపోలతో నేరుగా యాక్సెస్ అయ్యే విధంగా అనుమతి ఇచ్చాడు పుతిన్. అంటే దీనర్థం ప్రిగోజిన్ కింద పనిచేసే కమాండర్లు నేరుగా రష్యన్ ఆయుధ డిపోలకి వెళ్లి తమకి కావాల్సిన ఆయుధాలని ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చినట్లు.
ఇది పుతిన్ దగ్గర ఉండే జనరల్స్ కి నచ్చలేదు. వాళ్ళ దృష్టిలో రష్యన్ అధికారిక సైన్యం కంటే కిరాయి సైన్యానికి పుతిన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు అనే అసూయని రగిల్చింది . బయట పడక పోయినా రక్షణ మంత్రికి ఇంకా ఎక్కువ కోపం ఉంది ప్రిగోజిన్ కి పుతిన్ ప్రాధాన్యత ఇవ్వడం మీద. చాలా సార్లు ప్రిగోజిన్ కి వ్యతిరేకంగా పనిచేశారు ఇద్దరు సైనిక జనరల్స్. వీళ్ళకి ఆదేశాలు జారీచేసింది రక్షణ మంత్రి షోయ్గు.
ఉక్రెయిన్ లో బుఖుమత్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటున్నప్పుడు వాగ్నర్ గ్రూపు మీద రష్యన్ దళాలు రాకెట్లు, హెలికాఫ్టర్ల తో దాడికి పాల్పడ్డారు. ప్రిగోజిన్ ఈ దాడికి ఆదేశాలు ఇచ్చింది రక్షణ మంత్రి అని ఆరోపిస్తున్నాడు. అయితే రక్షణ మంత్రి షోయ్గు దీనిని ఖండించాడు. ఇంత వరకూ నిజం ఉంది. కానీ నిరసనగా రష్యా తరుపున యుద్ధం చేయకుండా ఊరుకుంటే ఎవరికీ అనుమానం వచ్చేది కాదు. దొంబాస్ నుండి రష్యా దక్షిణ సరిహద్దు దాటడానికి ఎవరు సహకరించారు అన్నదే ప్రశ్న ! కిరాయి సైన్యానికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి అనుమతులు ఉండవు. వాళ్ళకి మిషన్ అప్పచెప్పిన ప్రాంతంలోనే ఉండాలి, కానీ ఏకంగా 200 km ప్రయాణించి దొంబాస్ నుండి రష్యా లోని రోస్టవ్ నగరంలో కి ఎలా ప్రవేశించింది వాగ్నర్ గ్రూపు?
చివరికి ప్రిగోజిన్ మాస్కో వరకు వెళ్ళకుండానే వెనక్కి వెళ్ళిపోయాడు. రోస్టవ్ నుండి మాస్కొ1000 km దూరంలో ఉంది. అంత దూరం 25 వేల మంది ప్రయాణించడం అదీ రష్యన్ హెలికాఫ్టర్ల దాడి నుండి తప్పించుకొని వెళ్లడం అంత సులువు కాదు. ప్రిగోజిన్ తప్పు చేశాడా? లేక తప్పు చేసేట్లుగా రెచ్చగొట్టారా?
ప్రిగోజిన్ వ్యూ హం ఎలా ఉంది అంటే తాలిబన్లు వారం రోజుల్లోనే ఆఫ్ఘనిస్థాన్ ని ఆక్రమించుకోవడానికి ముందు ఒక్కో ముఖ్య పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రిగోజిన్ వ్యూహం కూడా అలానే ఉన్నట్లుగా ఉంది. పుతిన్ భయపడలేదు అని ఎవరన్నా వ్యాఖ్య చేసే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే పుతిన్ మాస్కో నుండి సెయింట్ పీటర్స్ బర్గ్ నగరానికి తరలించి యుద్ధ ట్యాంక్ లని రోడ్లకు అడ్డంగా పెట్టి బ్లాక్ చేశారు అని….
Share this Article