Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బిగ్‌బాస్ అని దుమ్ము దులిపాడు… ఎస్ బాస్ అంటూ దగ్గరయ్యాడు…

July 1, 2023 by M S R

రాజకీయాల్లో శాశ్వత కుడి భుజాలు  , ఎడమ భుజాలు ఉండవు…… బిగ్ బాస్ అని తాట తీశాడు … యస్ బాస్ అని దగ్గరయ్యాడు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు –

————————

2004 ఎన్నికలకు ముందు టీడీపీ బీట్ రిపోర్టర్లు సచివాలయంలో సీఎం పేషీ వద్దకు వెళుతుంటే కడప జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనాయకులు మాకు ఎదురుగా వచ్చారు . అవాక్కయ్యారా ? అనిపించేట్టుగా ఓ వార్త చెప్పారు . మైసూరారెడ్డి టీడీపీలో చేరుతున్నారు అనేది ఆ వార్త . కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అని అందరికీ తెలిసిన విషయం ఎంతో అనుభవం ఉన్న మైసూరారెడ్డికి తెలియదు అనుకోలేం.

Ads

ఎన్టీఆర్ వచ్చేంత వరకు మంగళసూత్రం కట్టను అని భీష్మించుకు కూర్చున్న రమేష్ రెడ్డి (నెల్లూరు )… శరీరం అంతా ఎన్టీఆర్ పేరు , బొమ్మలతో పచ్చ బొట్లు పొడిపించుకున్న శ్రీపతి రాజేశ్వరరావు… ఎన్టీఆర్ ను దించి బాబు బలప్రదర్శన కోసం నిజాం కాలేజీలో బహిరంగ సభలో ర్యాలీ ముందు భాగంలో వీరిద్దరు ఉండడం చూసిన అనుభవం … హోదా, పదవి , స్థాయి ఏదైనా కావచ్చు మనిషికి ఉండే లక్షణాలన్నీ మనిషికి ఉంటాయి అని చెప్పిన ఓషో సాహిత్యం ప్రభావం కొంత… దీనితో అన్నీ సాధ్యమే , దేనికీ అవాక్కు కావలసిన అవసరం లేదు అని భావించేవాడిని …

రాజకీయాల్లో కుడి భుజం , ఎడమ భుజం , అభిమాని , వ్యతిరేకి అనేవి ఏవీ శాశ్వతం కాదు . ఆయా కాలాల్లో అవసరాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి . ఐనా అంతకు ముందే బిగ్ బాస్ లేఖను బయటపెట్టి అసెంబ్లీలో బాబును వణికించిన మైసూరారెడ్డి టీడీపీలో చేరుతారు అనే విషయం కొద్దిగా అవాక్కు అయ్యేట్టు చేసింది . మైసూరారెడ్డి ఆంధ్రభూమి , డక్కన్ క్రానికల్ యాజమాన్యానికి సన్నిహితులు / ఆంధ్రభూమి టైటిల్ ఎలా ఉండాలో కూడా నిర్ణయించే / అభిప్రాయం చెప్పే స్థాయిలో ఉన్న వారు . మేనేజ్ మెంట్ కు సన్నిహితులు , హితులు . ఇలాంటి వారి విషయంలో వార్త రాయడంలో ఆచితూచి వ్యవహరించాలి . వార్త రాయక పోతే , అంత ముఖ్యమైన వార్త ఎలా మిస్ అయ్యావు అని తలంటుతారు . రాద్దాం అంటే నిజం కాకపోతే యాజమాన్యానికి కావలసిన వారు కాబట్టి ఇబ్బంది .

********

ఏదో ప్రాజెక్ట్ లో డబ్బులు ముట్టినట్టు అప్పుడు టీడీపీలో ఉన్న సముద్రాల వేణుగోపాలాచారి ఓ లేఖ రాశారు . ఆ లేఖలో బిగ్ బాస్ కు అమౌంట్ పంపినట్టు రాశారు . ప్రాంతీయ పార్టీల్లో బిగ్ బాస్ అంటే పార్టీ అధ్యక్షులు … ఆ లేఖను మైసూరారెడ్డి సంపాదించారు . ప్రాజెక్టులో డబ్బులు చేతులు మారాయని బిగ్ బాస్ ఎవరో తేల్చాలి అని శాసనసభ సమావేశాల్లో ఈ లేఖ బయటపెట్టి చంద్రబాబుకు చెమటలు పట్టించారు . బిగ్ బాస్ లేఖతో మైసూరారెడ్డి పాపులర్ అయ్యారు .

ఇది జరిగిన కొద్ది రోజులకు మైసూరారెడ్డి టీడీపీలో చేరుతున్నారు అని సమాచారం . నమ్మలేని నిజం ఒకటైతే , మేనేజ్ మెంట్ కు సన్నిహితులు అని మరో సమస్య . బ్యూరో చీఫ్ గా ఉన్న సిహెచ్‌వీఎం కృష్ణారావు మైసూరారెడ్డికి సన్నిహితులు… ఇది నిజమేనా అని విషయం చెబితే , బహుశా వారికి ఈ విషయం నాకన్నా ముందే తెలుసేమో … ఎటూ తేల్చకుండా, చేరితే చేరవచ్చు, ఏముంది అంటూ బదులిచ్చారు . ఎడిటర్ కు వెళ్లి విషయం ఇది .. మీరు రాయమంటే రాస్తాను , లేదంటే లేదు అని చేతులు దులుపుకున్నాను . ఎక్కడైనా ప్రతి ఒక్కడు సేఫ్ గేమ్ ఆడుతాడు . ప్రతి ఒక్కడులో నేనూ ఉంటాను .

****

ఓ శుభ ముహూర్తంలో ఎంవి మైసూరారెడ్డి టీడీపీలో చేరిపోయారు . టీడీపీ ఓడిపోతుంది అని ఆయనకు బాగా తెలుసు . మధ్యాహ్న సూర్యుడిలా వైయస్ఆర్ వెలిగిపోతుంటే నా పరిస్థితి ఏమిటీ ? ఈ మాట ఓసారి ఆయనే నాతో స్వయంగా అన్నారు . టీడీపీ ఓడిపోతుంది , వైయస్ఆర్ సీఎం అవుతారు అని తెలుసు . వైయస్ తో ఉన్న విభేదాల వల్ల టీడీపీలో చేరి రాజ్యసభ సభ్యత్వం పొందాలని ఆయన వ్యూహం . తనతో పడని వారిని వైయస్ ఎలాగూ అణిచివేస్తాడని భావించి మైసూరా ఈ నిర్ణయం తీసుకున్నారు . టీడీపీ ఓడిపోయాక బాబుకు బాగా సన్నిహితం అయ్యారు . ప్రతి కీలక సమావేశంలో ఉండేవారు . ప్రభుత్వ నిర్ణయాలను చీల్చి చెండాడుతూ పత్రికల్లో వ్యాసాలు రాసేవారు . మీరూ అలా ఉండాలి అని బాబు మిగిలిన నాయకులకు చెప్పేవారు .

లక్షకోట్ల నామకరణం…… జగన్ లక్ష కోట్లు మింగేశారు అని టీడీపీ నాయకులు కనీసం ఓ లక్ష సార్లయినా ఆరోపించి ఉంటారు . లక్ష కోట్లు అని నామకరణం చేసింది మైసూరా రెడ్డే . టీడీపీ ఓడిపోగానే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మైసూరారెడ్డికి అవకాశం ఇవ్వలేదు . బాబు తనను మోసం చేశాడని మీడియాలో వార్తలు . ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో రాజ్యసభ సభ్యత్వం కల్పించారు . ఆరేళ్ళ పదవీ కాలం ముగిశాక టీడీపీ నుంచి బయటకు వచ్చారు . జగన్ అవినీతిపై ఒక్కొక్కరు ఒక అంకె చెప్పారని , చివరకు రౌండ్ ఫిగర్ లక్ష కోట్లకు ఖరారు చేసినట్టు మైసూరారెడ్డి టీడీపీ నుంచి బయటకు వెళ్ళాక చెప్పారు . ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వెళ్లినా ఎంవి మైసూరారెడ్డి అనగానే కాంగ్రెస్ నాయకుడు అనే అనిపిస్తుంది …  – బుద్దా మురళి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions