పిచ్చి ముదిరింది, రోకలి తలకు చుట్టండి… అసలు ఉచితాలంటే, సబ్సిడీలంటే విముఖంగా ఉండే మోడీ ఫాలోయరేనా ఈ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ‘కట్టర్’… పెళ్లికానివాళ్లకు పెన్షన్ల పథకం ప్రకటించాడు… నిజానికి సామాజిక పెన్షన్లు ఎందుకు..?
ఎవరికైతే సామాజిక మద్దతు అవసరమో వాళ్లను ఆదుకోవడానికి ఈ పెన్షన్లు వర్తించాలి… అనాథలకు, ఆదాయం సరిపోని వారికి, ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నవారికి అవి భరోసాగా నిలవాలి… కానీ ఈ దిక్కుమాలిన పార్టీలు, నాయకుల పుణ్యమాని… ఈ పెన్షన్ల ఉద్దేశానికి, ఆచరణకు అర్థమే లేకుండా పోతోంది…
45 ఏళ్లు దాటగానే పెన్షన్ ఇస్తా అంటాడు ఒకాయన… ఫలానా వృత్తుల్లో ఉన్నవారికి పెన్షన్లు అని ప్రకటిస్తాడు మరొకాయన… నువ్వు 2 వేలు ఇస్తే నేను 3 వేలు ఇస్తా అంటూ ప్రత్యర్థికి సవాల్ చేస్తాడు ఇంకొకాయన… ఎవరికి ఏది తోస్తే అది… ప్రజాధనానికి వీళ్లు ధర్మకర్తలు కాదు, అధర్మకర్తలు… కేవలం వోట్ల కక్కుర్తితో వ్యవహరించే జ్ఞానశూన్యులు…
Ads
లేకపోతే పెళ్లికాని వాళ్లకు పెన్షన్లు ఏమిటి..? దివ్యాంగులకు, ఎయిడ్స్ వంటి వ్యాధిగ్రస్తులకు, పేదలకు, ఎవరూ లేని అనాథలకు, సొసైటీ చిన్నచూపు చూసేవాళ్లకు ప్రభుత్వం అండగా నిలబడితే ఓ అర్థం, పరమార్థం… పెన్షన్లేం ఖర్మ, కులాల పేరిట నేరుగా లక్షల సాయం కూడా స్టార్టయింది ఈమధ్య…
స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, మిక్సీలు, టీవీలు, పుస్తెలు… ఉచిత పథకాలు ఈ పరిమితులను కూడా చేధించుకుని, ఇప్పుడు బస్సు ప్రయాణాలు ఫ్రీ, 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ పథకాల దాకా వచ్చేశాం… ఇప్పుడు రాహుల్ గాంధీ 4 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించాడు కదా… (ఒక్క తెలంగాణలో మాత్రమే సుమా) ఇక కేసీయార్ దాన్ని ఎదుర్కొనడానికి పెన్షన్‌ను ఎంతకు పెంచేస్తాడో చూడాలిక…
ప్రజాధనాన్ని పొదుపు చేసి, అర్థవంతంగా ప్రాజెక్టులకు, రోడ్లకు, స్కూల్ భవనాలకు, ఉచిత వైద్యానికి, పేదల ఉన్నత విద్యకు వెచ్చించండీ అంటే చేతకాదు… నాణ్యమైన విద్యుత్తు, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అనేవి కలలో కూడా ఊహించరు, తలపెట్టరు… హర్యానా విషయానికి వస్తే… ఓ మౌలికమైన ప్రశ్న… పెళ్లికాకపోవడం పెన్షన్‌కు అర్హత ఎలా అవుతుంది..?
45 నుంచి 60 ఏళ్ల వయస్సువారు అర్హులట… సో, 45 ఏళ్ల వరకూ పెళ్లికాకపోతే ఇక జన్మలో వాళ్లకు ఎవరూ పిల్లనివ్వరు, పిల్లగాడు దొరకడు అని ప్రభుత్వం ఫిక్సయిపోయిందన్నమాట… ఇది సామాజిక మద్దతా..? లేక ఇక అసలు పెళ్లిచేసుకోకండిరా, ఇదుగో సర్కారు తరఫున ప్రోత్సాహకం అని చెబుతున్నట్టా..? పెళ్లి కాకపోవడానికి సవాలక్ష కారణాలుంటయ్… అన్నింటికీ ఇదే ‘అమృతాంజనా’..?
పాపం శమించుగాక… పెళ్లికాకపోతే ఖర్చు తప్పుతుందిగా, మరిక సర్కారీ మద్దతు దేనికి..? పెళ్లి కాకపోతే సొసైటీ చిన్నచూపు చూస్తుంది, జాలి ప్రదర్శిస్తుంది అనుకుందాం… దానికి ఇది ‘జిందాతిలిస్మాత్’ కాదు కదా… ధరలు మండిపోతున్నయ్… నిత్యావసరాల ధరలు మధ్యతరగతికీ మంటెక్కిస్తున్నయ్… పెట్రో, ఫార్మా ధరలు సరేసరి… ఇలాంటి పిచ్చి స్కీములు కాదురా బాబూ… అదుగో వాటి ధరలు తగ్గించండి… పోనీ, రేషన్ బియ్యంతోపాటు ఇంకొన్ని నిత్యావసరాల్ని చౌక ధరలకు పంపిణీ చేయండి… ప్చ్, ఇవి మాత్రం చేతకాదు మన నాయకగణానికి…
Share this Article