ఎమ్మెల్యే సుధీర్ కుమార్ ను నక్సల్స్ విడుదల రోజు ఏమైందంటే … జర్నలిస్టు లను అడవిలోకి ఎందుకు తీసుకు వెళ్తున్నదీ ఎస్పీ చెప్పాక …. నీ ప్రాణం నీకు ముఖ్యం … బాస్ దేవుడు కాదు……… జర్నలిస్ట్ జ్ఞాపకం
——————————–
ఇదీ విషయం, సార్ రమ్మంటున్నారు వస్తారా ? అని పోలీస్ కానిబుల్ చెప్పగానే ఎగిరి గంతేశాము . నలుగురం జర్నలిస్టులం ఆ కానిస్టేబుల్ వెంట నడిచాం .
Ads
1991 మే నెల .. నక్సల్స్ ప్రభావం ఉదృతంగా ఉన్న రోజులు అవి . నక్సల్స్ తమ డిమాండ్ల కోసం శాసన సభ్యులను , అధికారులను ముమ్మరంగా కిడ్నాప్ చేస్తున్న రోజులు అవి. మాజీ కేంద్రమంత్రి పి శివశంకర్ కుమారుడు మలక్ పేట శాసన సభ్యులు పి . సుధీర్ కుమార్ ను హైదరాబాద్ నగరం నడి బొడ్డులో , పట్టపగలే నక్సల్స్ కిడ్నాప్ చేశారు .
(పట్టపగలే అని ఏదో అలా ఫ్లోలో రాసేస్తాం కానీ నగరం నడి బొడ్డున ఐతేనేం ఓ కొసకు ఐతే నేం , పట్టపగలు ఐతే నేం , ఉదయం ఐతేనేం కిడ్నాప్ కిడ్నాపే ) . దింతో రాష్ట్రమంతా ఉద్రిక్త వాతావరణం . అప్పుడు కేంద్రంలో , రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే . పి శివశంకర్ అంటే కాంగ్రెస్ లో కీలక వ్యక్తి . సుధీర్ కుమార్ శాసన సభ్యులు . దాంతో నక్సల్స్ ఎందుకు కిడ్నాప్ చేశారు , ఎక్కడ ఉంచారు అనే ఆసక్తి సహజమే . అందరిలానే మెదక్ జిల్లా జర్నలిస్ట్ లం ఏమవుతుందా ? అని ఎదురు చూస్తున్నాం .
ఇలాంటి సమయంలో నక్సల్స్ సుధీర్ కుమార్ ను కిడ్నాప్ చేసి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అడవుల్లో పెట్టారని , అడవికి దగ్గరగా ఉన్న ఒక సర్పంచ్ ఇంట్లో వదిలి పెట్టారు అని సమాచారం . అడవికి సమీపంలో ఉన్న ఆ సర్పంచ్ ఇంటికి వెళుతున్నాను , మీరూ వస్తారా ? అని అప్పటి మెదక్ జిల్లా పోలీస్ సూపరిండెంట్ నండూరి సాంబశివరావు జర్నలిస్ట్ ల వద్దకు కానిస్టేబుల్ ను పంపించారు . 91 ప్రాంతంలో జర్నలిస్ట్ లకు ఫోన్ , వాహనం వంటి సౌకర్యాలు అంతంత మాత్రమే . అలాంటి సమయంలో తన కారులో సుధీర్ కుమార్ వద్దకు తీసుకువెళతాను అని ఎస్పీ చెబితే , పరిగెత్తకుండా ఏ రిపోర్టర్ అయినా ఎలా ఉంటారు .
*****
ఎస్పీ , ఆయన గన్ మెన్ , జర్నలిస్టులం… సంగారెడ్డి నుంచి కారులో నర్సాపూర్ వైపు ప్రయాణం . ఇంత క్లిష్ట సమయంలో ఎస్పీ పెద్ద మనసుతో తన కారులో తీసుకువెళుతున్నందుకు మనసులోనే ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పుకున్నామో . అడవికి , వెళ్ళాల్సిన చోటుకు చేరువ అవుతున్నాం అనగా…. ఎస్పీ ‘‘నేను మిమ్ములను నాతో పాటు ఎందుకు తీసుకువెళుతున్నానో తెలుసా’’ అని అడిగితే మా కోణంలో మేం సమాధానం చెప్పాము . మా సౌకర్యం కోసమే మీరు తీసుకువెళుతున్నారు అని కోరస్ గా పలికాం . అయన పోలీసు నవ్వు నవ్వి … పోలీసు నవ్వు అంటే ఏమిటో తెలియదు కానీ, బాగుందని వాడేస్తున్నాను .. భైరాన్ సింగ్ షెఖావత్ ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, ఆయన అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో హోమ్ మంత్రి దేవేందర్ గౌడ్ ఇద్దరూ ఓ సభలో పాల్గొన్నారు . దేవేందర్ గౌడ్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు . షెఖావత్ అది గమనించి ఏ ఉద్దేశంతో అన్నారో కానీ పోలీసు నవ్వు నమ్మడానికి వీలులేదని చమత్కరించారు …
మమ్ములను ఎందుకు తనతో తీసుకువెళుతున్నారో మేం చెప్పిన సమాధానం సరైనది కాకపోవడంతో ఎస్పీయే చెప్పారు . నర్సాపూర్ అడవుల్లో సుధీర్ కుమార్ ను నక్సల్స్ దాచారు . ఇంతకు ముందే దగ్గరలో ఉన్న సర్పంచ్ ఇంట్లో వదిలి వెళ్లారు అని సర్పంచు నుంచి ఫోన్ వచ్చింది . ఈ సమాచారం నిజం కావచ్చు , కాకపోవచ్చు . సుధీర్ కుమార్ ను వదిలామని చెబితే సాధారణంగా ఎస్పీ వస్తారు కదా ? ఎస్పీని టార్గెట్ చేసేందుకు ఇలా తప్పుడు సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంది .
నక్సల్స్ సర్పంచును పట్టుకొని ఈ మాట చెప్పమంటే చెబుతాడు, అదేం పెద్ద కష్టం కాదు . నేను కారులో వస్తున్నాను అని నన్ను టార్గెట్ చేయవచ్చు . కారులో నాతో పాటు జర్నలిస్ట్ లు ఉన్నారు అంటే , నాతో పాటు మీరూ పోతారు , తమకు చెడ్డ పేరు వస్తుంది అని టార్గెట్ చేయకుండా వదిలి వేయవచ్చు .. ఒకవేళ దాడి చేసినా నాతో పాటు నేనూ, మీరూ అందరం పోతాం, దీని వల్ల జనానికి నక్సల్స్ పట్ల సానుభూతి పోతుంది అంటూ ఎస్పీ చెప్పుకుంటూ పోతుంటే … హమ్మ ఎస్పీ అని అడవిని చేరుకున్నాక వణికి పోయాం …
*****
ఎస్పీ ఉహించినట్టుగా ఏమీ జరగలేదు .. ఊరులోకి ప్రవేశించాక సర్పంచు ఇల్లు చేరాక సుధీర్ కుమార్ , సర్పంచు కొంతమంది గ్రామస్తులతో కలిసి మాకు ఎదురుగా వచ్చారు . చేతిలో ఉన్న కెమెరాతో ఆ సమూహాన్ని తీసిన ఫోటో మరుసటి రోజు డక్కన్ క్రానికల్ , ఆంధ్రభూమి మొదటి పేజీ అలంకరించింది . ఎస్పీ కూడా సంతోషపడ్డారు ఆ ఫొటోలో తన కృషి కూడా రికార్డ్ అయిందని … నండూరి సాంబశివరావు తెలివైన వారు .
ఎస్సి హాస్టల్స్ కు సంబంధించి ఓ వార్త… అపుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది . చంద్రబాబు , ప్రతిభాభారతి శాసన సభ్యుల బృందంతో వచ్చి నారాయణఖేడ్ హాస్టల్ వద్ద ఆందోళన… అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టా రెడ్డి… ‘‘నేను అత్యాచారం చేశాను అని ఆరోపించి ధర్నా చేశారు కదా, అది నిరూపించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళవద్దు’’ అంటూ ఆయన ఆందోళన … ఉద్రిక్తత .
ఎస్పీ రెండు వైపులా వారిని తోసేశాడు . ఆయనకు కొంత సేపటి తరువాత అనుమానం వచ్చింది . విపక్షానికి చెందిన బాబు , ప్రతిభా భారతి వంటి వారిని తోసేశాను . మీడియా ఏమైనా వ్యతిరేకంగా రాస్తుందా అని…. కొద్దిసేపటి తరువాత పిలిచి, పరిస్థితి చేయి దాటి పోయేట్టుగా ఉందని ఇరు వర్గాలను తోసేశాను . నేను చేసిన దానిలో తప్పు ఏమైనా ఉందా ? అని అడిగితే లేనే లేదని సమాధానం చెప్పాము . విభజన తరువాత నండూరి సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ డిజిపి అయ్యారు …
*****
జర్నలిస్ట్ అనే వాడికి వార్తలకు సంబంధించి విపరీతమైన ఆకలి ఉంటుంది . ఎస్పీ అనే కాదు సాధారణ ప్రభుత్వ ఉద్యోగికి జరగరానిది ఏదైనా జరిగితే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆడుకుంటుంది . పూర్తి కాలం జీతం. ఇంట్లో వారికి గ్రూప్ వన్ నుంచి వారి వారి హోదా మేరకు ఉద్యోగం ఇస్తారు . మనిషిని తీసుకు రాకపోవచ్చు కానీ ఆర్థికంగా లోటు లేకుండా చేస్తారు . మరి జర్నలిస్ట్ పోతే ?
కనీసం నివాళి కూడా ఉండదు . అతని మరణంతో ఖాళీ అయిన స్థానం కోసం అంత్యక్రియలు పూర్తి కాకముందే ప్రయత్నాలు జరుగుతాయి . ఆఫీస్ వాళ్ళు కూడా ఆ ఖాళీలో ఎవడిని భర్తీ చేయాలి అని చూస్తారు కానీ ,.. అతని మరణం వల్ల వాళ్ళింటో ఏర్పడే ఖాళీని గుర్తించరు . ఇది అమానుషం కాదు, అత్యంత సహజం .
చాల్లే, జర్నలిస్ట్ లు అంటే ఏదో త్యాగ జీవులు అని రాస్తున్నారు .. మాకు తెలియదా వారి సంగతులు అనిపించడం కూడా అత్యంత సహజం . ఇల్లు కడుతున్నా బెదిరింపులు , ఇసుక వ్యాపారం చేస్తున్నా బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు . కొందరు అరెస్టయ్యారు . కొందరు దర్జాగా అలా బ్లాక్ మెయిల్ చేస్తూ బతికేస్తున్నారు అనుకుంటున్నారా ? అలా అనుకోవడంలో అస్సలు తప్పు లేదు . ఇలాంటి కేసులు ఎన్నో నాకూ తెలుసు .
ఇలాంటి వారు లెక్క లేనంత మంది ఉన్నారు . ఇదీ నిజమే . అలా కాకుండా చేసే వృత్తికి పరిమితమై బతుకుతున్న వారూ అంతకన్నా ఎన్నో రేట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇదీ కూడా నిజమే . ఎన్నో సౌకర్యాలు ఉండే ఎస్పీ స్థాయి అధికారి తాను పోతే ఎలా అని ఆలోచించినప్పుడు , నువ్వు పోతే కుటుంబం అనాధ అవుతుంది అని తెలిసిన జర్నలిస్ట్ ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి …?
*****
నిజామాబాద్ లో ఓ జర్నలిస్ట్ ఎన్‌కౌంటర్ వార్త సేకరణ కోసం పోలీసులతో పాటు బస్సులో వెళ్లారు . కిందికి దిగడమే ఆలస్యం నక్సల్స్ తూటాలకు బలయ్యారు . శ్రీకాకుళంలో ఏనుగుల దాడులు సర్వసాధారణం . ఏనుగుల గుంపు ఊరి మీద పడి బీభత్సం సృష్టిస్తుంటే ఆంధ్రప్రభ స్థానిక విలేఖరి ఫోటో తీశారు . కెమెరా ఫ్లాష్ తనపై పడగానే ఏనుగు అతన్ని వెంబడించి తొక్కి చంపేసింది . తాను ప్రెస్ డ్యూటీ చేస్తున్నాను అని అతని మనసులో ఉంటుంది . దాని ప్రకారమే ముందుకు వెళ్తాడు . కానీ ఏనుగుకు అది తెలియదు అనే విషయం మనకు తెలియాలి .
బాస్ ఆదేశించాడు, ఏమైనా చేసేద్దాం, ఏమీ కాదు అని అనుకోవద్దు. బాస్ దేవుడు కాదు . ప్రకృతి దేవుడు . అన్నీ ప్రకృతి నియమాల ప్రకారం జరుగుతాయి . మన బాస్ చెప్పినట్టు జరగవు . ఓ మీడియా కింగ్ స్టూడియోకు అద్వానీ వచ్చినప్పుడు చాలా ఏళ్ళ క్రితం ఓ కెమెరా మెన్ మీడియా కింగ్ ను , అద్వానీని కెమెరాలో బంధిస్తూ తనను తాను మరిచి పోవడంతో హెలికాఫ్టర్ రెక్కలకు బలయ్యాడు . వృత్తిని దైవంగా భావించాలి, అదే సమయంలో తన కోసం ఎదురు చూసే కుటుంబం ఉంటుందని గ్రహించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి . ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంటే తిట్టు కాదు ఎరుకలో ఉండడం అని…..— బుద్దా మురళి
Share this Article