GPS: వాల్మీకి రామాయణం రాయడానికి ముందే అన్నదమ్ములయిన సంపాతి- జటాయువు పుట్టి ఉండాలి. సంపాతి- జటాయువు పెద్ద డేగజాతి పక్షులు. వాటి వేగానికి సాటిరాగల పక్షులే ఆకాలంలో ఉండేవి కావు. చిన్న పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఆ చెట్టుదాకా పరుగెత్తి వెళ్లి మళ్లీ వేగంగా వెనక్కు రావాలి- ముందు ఎవరొస్తారో చూద్దామా? అన్నట్లు ఒకరోజు జటాయువు సోదరుడు సంపాతితో సరదాగా పందెం వేసింది. సూర్యుడిదాకా వేగంగా వెళ్లి మళ్లీ భూమికి తిరిగి రావాలి- అని. సంపాతి సై అంది. అంతే ఒకరికంటే ఒకరు వేగంగా పైపైకి వెళ్లి సూర్య మండలం దాకా ఎగిరిపోయారు.
జటాయువు చిన్నవాడు కాబట్టి కొంచెం చురుకుగా ఉన్నాడు. దాదాపు సూర్యుడికి దగ్గరవుతున్నాడు. ఈలోపు సంపాతికి జరగబోయే ప్రమాదం కళ్లముందు కనిపించింది. వెంటనే వేగం పెంచి తమ్ముడు జటాయువును తన రెక్కలకింద దాచుకుని- పైకి వెళ్లే వేగం తగ్గించాడు. అప్పటికే సంపాతి రెక్కలు మాడి మసి అయిపోయాయి. స్పృహదప్పినా తమ్ముడిని రక్షించగలిగాడు. లేకపోతే జటాయువు బూడిద అయిపోయేవాడు. రెక్కలు లేక ఎగరలేక సంపాతి అంతెత్తు నుండి కింద తమిళనాడు గడ్డమీద మహేంద్రగిరి పర్వతసానువుల్లో పడిపోయాడు. జటాయువు గోదావరి తీరంలో దండకారణ్యంలో పడ్డాడు. ఆ తరువాత అన్నదమ్ములు ఒకరినొకరు కలవలేదు. కలుసుకునే అవకాశం రాలేదు.
Ads
రెక్కల్లేని సంపాతిని ఒక రుషి చేరదీసి వేళకింత ఆహారం పెట్టేవాడు. స్వామీ! పక్షికి రెక్కలే ప్రాణం. ఇంతకంటే చావు నయం- నాకెప్పటికి విముక్తి? అని అడిగితే…బాధపడకు- సీతాన్వేషణలో హనుమ ఇక్కడికి వస్తాడు. అప్పుడు నీ అనితరసాధ్యమయిన చూపుతో నువ్వు రామకార్యానికి మాటసాయం చేయి. దాంతో కాలిపోయిన రెక్కలు మళ్లీ వస్తాయి- అని అభయమిచ్చాడు. అలాగే హనుమ బృందం వస్తుంది. సీతమ్మ జాడ చెప్పగానే పోయిన రెక్కలు వస్తాయి. అయితే తన తమ్ముడు జటాయువు రావణుడితో పోరాడి మరణించాడన్న వార్త హనుమ, జాంబవంతులద్వారానే సంపాతికి తెలుస్తుంది.
రావణుడి కత్తికి రెక్కలు తెగిన జటాయువు రాముడికి సీతాపహరణ వార్త చెప్పడం కోసమే ప్రాణాలు ఉగ్గబట్టుకుని- రాముడి ఒడిలోనే కన్నుమూశాడు. రాముడే స్వయంగా జటాయువుకు అంత్యక్రియలు చేశాడు. కొన ఊపిరితో ఉన్న జటాయువును రాముడు లే! పక్షి! అంటే అదే ప్రస్తుతం సత్యసాయి జిల్లా లేపాక్షి అయ్యిందని శతాబ్దాలుగా ఒక కథనం. రాముడు తెలుగులో లే పక్షి ! అన్నాడా? అని ఒక వితండవాదం లేవదీశారు.
లేపాక్షి స్వప్న దర్శనం పేరిట బాడాల రామయ్య రాసిన ఒక పద్యకావ్యానికి విశ్వనాథ సత్యనారాయణ ముందుమాట రాస్తూ ఈ వితండవాదానికి సమాధానంగా చక్కటి వివరణ ఇచ్చారు. రామదాసు, త్యాగయ్యలు తెలుగులో మాట్లాడితే సమాధానమిచ్చిన రాముడు- రక్తపుమడుగులో పడి ఉన్న జటాయువును లే పక్షి! అని అనకుండా ఎందుకుంటాడు? అని. జటాయువును రాముడు కలిసిన చోటు ఇప్పటికీ లేపాక్షి పక్కన రెండుకిలోమీటర్ల దూరంలో దర్శనీయ స్థలం. పూజనీయ స్థలం. లేపాక్షి నంది పక్కన కొండమీద పెద్ద జటాయువు ప్రతిమను కూడా ఆమధ్య ఏర్పాటు చేయించారు.
భూమికి నాలుగు కోట్ల డెబ్బయ్ లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిదాకా వెళ్లగలిగిన సంపాతి- జటాయువులు ఈ యుగంలో, ఈరోజుల్లో లేవని మనం బాధపడాల్సిన పనిలేదు. తాజాగా అమూర్ డేగల జంట 361 రోజుల్లో 29వేల కిలోమీటర్లు ప్రయాణించింది. దేశాలు, ఖండాలు, మహా సముద్రాలు దాటి- చైనా నుండి దక్షిణాఫ్రికా దాకా వెళ్లి; మళ్లీ అదే గగనమార్గంలో మన మణిపూర్ కు వెనక్కు వచ్చాయి. వాటికి అమర్చిన శాటిలైట్ రేడియో ట్రాన్స్మిషన్ మొత్తం ట్రాకింగ్ ను రికార్డు చేసింది. ఒక్కోసారి నాలుగయిదు వేల కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించగలవు ఈ డేగలు. వీటి వేగం, దూరతీర ప్రయాణం ఇప్పుడు ప్రపంచానికి హాట్ టాపిక్.
త్రేతాయుగంలో రామకార్యానికి సంపాతి- జటాయువు నిరీక్షించి ఆ పని పూర్తి చేశాయి. కలియుగంలో ఈ ఆడ మగ డేగలు ఏ స్వామి కార్యానికి ముప్పయ్ వేల కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణించాయో ఎవరికెరుక?
అమూర్ పక్షులరా!
మీముందు భూగోళం చిన్నబోయింది. కొండలు కుచించుకుపోయాయి. మహాసముద్రాలు పిల్లకాలువలయ్యాయి. దూరం మీ రెక్కలకు వంగి సలాము చేస్తోంది!
పక్షులు ఇలా ఎంతెంత దూరమయినా…ఎన్నెన్ని ఖండాలనయినా…ఎన్నెన్ని సముద్రాలనయినా దాటి…మళ్లీ అదే దారిలో వెనక్కు రావడానికి- వాటి చిన్ని మెదడులో జి పి ఎస్ లాంటి మేధో వ్యవస్థ ఉందని తాజాగా కెనడాలోని ఒక యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. భూమికి అయస్కాంత శక్తి ఉన్న విషయం తెలిసిందే. భూమి అయస్కాంత శక్తితో పక్షుల మెదళ్లలో జి పి ఎస్ లాంటి వ్యవస్థ అనుసంధానమవుతుంది. మనం ఫోన్లో అవసరమయినప్పుడు జి పి ఎస్ ఆన్ చేసుకుని, అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకుంటున్నట్లే పక్షులకు కూడా మెదళ్లలో జి పి ఎస్ ను ఆన్, ఆఫ్ చేసుకునే శక్తి ఉండడాన్ని ఈ పరిశోధనల్లో కనుగొన్నారు. ఆకాశంలో గుంపుగా ఎగిరే వందల, వేల పక్షుల రెక్కలు ఒకదానికొకటి తగలకుండా ఒకే వేగంతో పక్క పక్కనే వెళ్లడంలో కూడా అంతులేని సైన్స్ ఉంది. ఎటు వెళుతున్నా ఒకదానికొకదానికి మధ్య ప్రసరించే కంటికి కనిపించని ఫ్రీక్వెన్సీ- తరంగ దైర్ఘ్యం, గాలి ఒత్తిడిలో కంపనల ఆధారంగా ఇది సాధ్యమవుతోంది. ఇది చెబితే భౌతిక శాస్త్రంలో రామాయణమంత పెద్ద సబ్జెక్ట్. పక్షులకు ఈ భౌతికశాస్త్రం చెప్పడం చేతగాకపోవచ్చు. కానీ యుగయుగాలుగా పక్షి రెక్కలో అంతులేని భౌతిక శాస్త్రం ఒదిగి ఉంది.
ప్రకృతిలో అన్నిటికీ వాటి జీవికకు అవసరమయిన అంతర్గత శక్తులు అద్భుతంగా, శాస్త్రీయంగా, అనితరసాధ్యంగా ఉన్నాయి- ఒక్క మనిషికి తప్ప!
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article