బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మతో సీకులు అమ్మించగలడు… మద్యం తో మీడియా, పార్టీల రాజకీయాలు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు –
—————————————–
మీకు చంద్రబాబు అంటే ఏమిటో అర్థం కావడం లేదు . ఆయన తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మ చేత సీకులు అమ్మించగలరు . నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారు . మనతో చెప్పిస్తున్నారు అంటూ చంద్రబాబు ముందే మాట్లాడేసరికి అంతా విస్తుపోయారు . సంక్షిప్తంగా చెప్పాల్సిందిచెప్పి కిందకు వచ్చాను . అది ప్రెస్ క్లబ్ లో సమావేశం . వేదికపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు , జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి , దేవులపల్లి అమర్ ఇంకా చాలా మంది హేమాహేమీలు … ఒక్కో జర్నలిస్ట్ మైకు ముందుకు వచ్చి, ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుంది కాబట్టి మద్యనిషేధం ఎత్తి వేయండి అని తన అభిప్రాయాన్ని చెబుతున్నారు . జర్నలిస్ట్ లు అందరూ మధ్య నిషేధం ఎత్తి వేయాలి అని మాట్లాడుతుంటే కోపం , ఆవేదన , చిరాకు అన్నీ కలిసి మైకు పట్టుకునేట్టు చేశాయి .
Ads
అభిప్రాయ సేకరణ అనేది ఉట్టి డ్రామా .. అసలు మద్య నిషేధ ఉద్యమమే పెద్ద రాజకీయ డ్రామా . ఆ డ్రామాకు ముగింపు పలకడానికి చంద్రబాబు అభిప్రాయ సేకరణ అనే డ్రామాకు శ్రీకారం చుట్టారు . జర్నలిస్ట్ లకు సంబంధించిన సమస్య కాకుండా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్రవ్యాప్తంగా జరిపిన ఏకైక ఉద్యమం మద్య నిషేధం . మద్యనిషేధం విధించాలి అని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించిన జర్నలిస్ట్ లు , నిషేధం ఎత్తివేయాలి అని ప్రెస్ క్లబ్ సమావేశంలో ఉత్సాహంగా ఎలుగెత్తి చాటడం చిరాకేసింది .
చంద్రబాబు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొన్న తరువాతే దానిపై ఆయన అభిప్రాయ సేకరణ జరిపి , అందరి అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెబుతారు . అది ఆయన స్టైల్ …. అంతకు ముందు ప్రముఖ సంఘసేవకురాలు మద్యనిషేధం కోసం ఆందోళన చేశారు . దాన్ని గుర్తు చేస్తూ బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మతో సీకులు అమ్మిస్తారు అన్నాను . అంత తీవ్రమైన కామెంట్ చేసినా బాబు మౌనంగానే విన్నారు . అప్పుడు వార్తలో ఉన్న జర్నలిస్ట్ జగన్నాధ నాయుడు నేనన్న మాటలు రాశారు . బాబు ఎలాగూ నిషేధం ఎత్తివేస్తారు , మనం ( జర్నలిస్టులం ) చెబితే ఎత్తివేశారు అనే పేరు మనకెందుకు అని నా అభిప్రాయం .
********
కాంగ్రెస్ ను అధికారం నుంచి దించేందుకు మద్యం అంశాన్ని వాడుకున్నారని , ఆ మద్య నిషేధ ఉద్యమం అందుకే జరిపారు అనేది బహిరంగ రహస్యం . ఐతే చివరకు ఎన్టీఆర్ ను బాబు దించేయడం వెనుక మద్య నిషేధ అంశం ఉంది అనేది ఓ బలమైన విమర్శ .. 1990 -91 ప్రాంతంలో నేను సంగారెడ్డిలో ఉన్నప్పుడు మద్యనిషేధ ఉద్యమం … రాజకీయాల్లోకి రావాలి అనుకొంటున్న బిఎన్ శాస్త్రి అనే ఓ బ్యాంకు ఉద్యోగి రాత్రి పార్టీలో రాజకీయాల్లోకి ఎలా రావాలి అని చర్చ . మెదక్ లో దేవయ్య అనే జర్నలిస్ట్ మద్య నిషేధం ఉద్యమం కోసం పెద్ద సభ పెడుతున్నాడు . రేపే వెళ్లు అని సలహా . రాజకీయ నాయకులు ఉద్యమాన్ని సీరియస్ గా తీసుకోలేదు కానీ అంతకు ముందు మందు అలవాటు ఉన్న దేవయ్య జిల్లాలో ఉద్యమాన్ని జరిపి, నాకు తెలిసినంత వరకు అప్పటి నుంచి ఇప్పటివరకు మందు ముట్టలేదు . ఈ సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలో మద్య నిషేధం ఉద్యమానికి జనానికి మందు పోయించి టీడీపీ వాళ్ళు లారీలో సభకు తరలించారు అని వార్త చదివాను .
*****
1994 ప్రాంతంలో గోదావరికి వరదలు . తెలంగాణ జర్నలిస్ట్ లకు కరువు వార్తలు , ఎన్ కౌంటర్ల వార్తలు , ఆకలి వార్తలు కవర్ చేసిన అనుభవం ఉంటుంది కానీ వరదల వార్తల అనుభవం తక్కువ . సమాచార శాఖ వాళ్ళు వాహనం ఏర్పాటు చేసి వరదల వార్తల కోసం ఏటూరు నాగారం తీసుకువెళ్లారు . ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే జైపాల్ రెడ్డి , ఈనాడు శ్రీ రామ్ , నేనూ ఇంకా కొందరం వెళ్ళాం . వరద ప్రవాహాన్ని దాటుకొంటూ స్థానికుడు ఒకడు నాటు పడవలో వస్తే ఆల్ ఇండియా రేడియో నుంచి వచ్చిన జైపాల్ రెడ్డి మైకు పెట్టి అడిగితే , వరదలు మునిగిపోతాం , తరలిస్తాం అని వీళ్ళు ఇలానే చెబుతారు, మాకు తెలియదా అన్నాడు . అంత వరదలోనూ సాహసోపేతంగా అతను నాటు పడవలో ఇటు వైపు ఎందుకు వచ్చాడు అంటే మద్యం కోసం … అతని మాటలు అందరం విన్నాం .
*****
అప్పటికి సారా నిషేధం అమలులో ఉంది . సంపూర్ణ మధ్య నిషేధం కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారని వరంగల్ జిల్లా నుంచి ఈనాడులో వార్తల ఉద్యమం . తొలుత ఈనాడు నెల్లూరు జిల్లాల్లో సారా నిషేధం కోసం ఉద్యమం జరిగింది . ఈనాడు శ్రీరామ్ అప్పుడు నెల్లూరు జిల్లా రిపోర్టర్ . ఈనాడు నెల్లూరులో ప్రారంభం అయిన సారా వ్యతిరేక ఉద్యమం రాష్ట్రమంతా వ్యాపించింది . మిగిలిన మీడియా అనుసరించక తప్పలేదు . ఈనాడు శ్రీరామ్ నెల్లూరు నుంచి వరంగల్ జిల్లాకు బదిలీ అయ్యారు . వరంగల్ ఈనాడులో సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమం మొదలైంది . నిజంగా ప్రజలు సంపూర్ణ మద్య నిషేధం కోసం ఉద్యమించారా ? అంటే నేనే కాదు ఆ శ్రీ రామ్ కూడా వరదలో కూడా మందు కోసం వచ్చిన వారిని చూశారు . ఎన్టీఆర్ ను అధికారంలోకి తీసుకురావడంలో మద్య నిషేధ ఉద్యమం కీలక పాత్ర వహించింది . అదే మద్యం ఆయన్ని అధికారం నుంచి దించేట్టు చేసింది అని ప్రచారం .
****
కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సారాయి నిషేధం విధిస్తే , ఎన్టీఆర్ సంపూర్ణ మద్య నిషేధం విధించారు . సంపూర్ణ నిషేధంలో స్టార్ హోటల్స్ లో మాత్రం మద్యం లభించేది . తరువాత బాబు సీఎం అయ్యారు . వైస్రాయ్ హోటల్ లోనే నిర్ణయం జరిగింది .. బాబు మద్య నిషేధం ఎత్తి వేస్తారు అని వార్తలు వచ్చాయి . కానీ బాబు రాగానే ఎన్టీఆర్ సంపూర్ణ నిషేధం అన్నారు కానీ అది సంపూర్ణం కాదు అంటూ స్టార్ హోటల్స్ లో కూడా నిషేధం విధించారు . అప్పుడే సంపూర్ణ నిషేధం ఎత్తివేయడం ఖాయం అనిపించింది . బాబు నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు . నిషేధం ఎత్తివేశారు .
ఈ మధ్య హౌసింగ్ సొసైటీ మీటింగ్ లో శ్రీ రామ్ కలిస్తే వరదలో నాటు పడవ మీద వచ్చి మందు కొనుక్కొని పోవడం , మీరేమో వరంగల్ కేంద్రంగా సంపూర్ణ నిషేధ ఉద్యమం అని రాయడం అంటూ సరదాగా గుర్తు చేసుకున్నాం . మంచి ఉద్దేశంతో మద్యానికి వ్యతిరేకంగా రాశాను . అలా జరిగింది అని గుర్తు చేసుకున్నారు .
*****
ఇంతా చెప్పి మీరు తాగుతారో లేదో చెప్పలేదు అని అనుమానమా ? మద్య నిషేధం కోసం రాష్ట్రవ్యాప్తంగా గొప్ప ఉద్యమం చేసిన టీడీపీ 2004 ఎన్నికలకు ముందు మీడియాకు మందు పార్టీ ఇచ్చింది . యల్ వి యస్ ఆర్ కే ప్రసాద్ అని మీడియా ఇంచార్జ్ మీరు తాగి తీరాల్సిందే అని పట్టు పట్టారు . 2004 ఎన్నికల్లో మీరు గెలవగానే తాగుతాను ప్రామిస్ అని గట్టిగా చెప్పాను . అతను గెలుస్తామని మురిసిపోయారు . 2004 ఎన్నికల ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనే విషయంలోనాకు అంత విశ్వాసం ఉండేది . మద్య పానం అనే ఒక భయంకరమైన వ్యసనాన్ని రాజకీయ ఎత్తుగడగా మార్చి ప్రజలకు ద్రోహం చేశారు . నాటకం ఆడించే వాడు ఎక్కడో ఉండి ఆడిస్తాడు .. నాటకం ఆడే వారికీ తెలియదు తమను ఆడిస్తున్నారని …….. – బుద్దా మురళి
Share this Article